Stumps In Cricket: క్రికెట్‌లో మూడు స్టంప్స్ ఎందుకుంటాయి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
Stumps In Cricket: క్రికెట్‌లో మూడు స్టంప్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు కనిపించే త్రీ స్టంప్స్ వెనుకాల ఉన్న నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Stumps In Cricket: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. సెమీస్‌కు వెళ్లేది ఎవరు? భారత్ ను సెమీస్‌లో ఢీకొట్టే జట్టు ఏదని కొందరు ఆలోచిస్తే.. అసలు టీమిండియా సెమీస్‌కు వెళ్తుందా? అని లెక్కలు వేసే వాళ్లు మరికొందరు. ఇలా ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి. ఇలాంటి విశ్లేషణలు గడగడా చెప్పేవాళ్లకు సైతం క్రికెట్‌లోని కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. క్రికెట్ లోని కొన్ని నియమాల గురించి పూర్తి వివరాలు తెలియదు. అలాంటి వాటిలో స్టంప్స్ ఒకటి.
అసలు క్రికెట్‌లో మూడు స్టంప్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? క్రికెట్ ప్రారంభించేటప్పుడు ఎలా ఆడేవాళ్లో మీకు ఐడియా ఉందా? గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు కనిపించే త్రీ స్టంప్స్ వెనుకాల ఉన్న నిజాలు ఇప్పుడు మీకు మేం చెప్పబోతున్నాం.
ఆ మ్యాచ్ తర్వాతే మూడు స్టంప్స్
క్రికెట్ ప్రారంభమైన మొదట్లో రెండు స్టంప్స్ మాత్రమే ఉండేవి. వాటిపై ఒక బెయిల్ పెట్టి క్రికెట్ ఆడేవాళ్లు. ఇంటికి ఉండే గేట్ మాదిరిగా ఆ స్టంప్స్ కనిపించేవి. ఆ పేరు మీదుగానే క్రికెట్ గేట్ అనే పేరు వచ్చింది. 1775లో కెంట్, సర్రే మధ్య మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన మ్యాచ్‌లో 3 స్టంప్స్ రావడానికి కారణమైంది. ఆ మ్యాచ్ క్రికెట్ చరిత్రను మలుపు తిప్పింది. జాన్ స్మాల్ బ్యాటింగ్ చేస్తుంటే… లంపీ స్టీవెన్సన్ బౌలింగ్ చేశారు. ఆయన వేసిన మూడు వరుస బంతులు రెండు స్టంప్స్ మధ్య నుంచి వెళ్లిపోయాయి. బాల్ స్టంప్స్‌కు తగిలినా బెయిల్ పడితేనే అవుట్ అని అప్పటకే రూల్ ఉంది. అందుకే ఆ 3 బంతులు కూడా రెండు వికెట్ల మధ్య నుంచి వెళ్లినా ఔట్‌గా పరిగణించలేదు. అప్పుడు క్రికెట్ నిపుణులు దీనిపై బాగా చర్చలు జరిగి మిడిల్ స్టంప్ ను ప్రవేశపెట్టారు. మిడిల్ స్టంప్ తో పాటు రెండు బెయిల్స్ ను తీసుకొచ్చారు. ఇవి 0.5 ఇంచ్ ల వెడల్పు, 4.31 ఇంచుల పొడవుకు మించిగానీ తక్కువగాని ఉండకూడదని నిర్ణయించారు.
స్టంప్స్ పేర్లు
బ్యాటర్‌కు ముందు దగ్గరగా ఉన్న స్టంప్ పేరు ఆఫ్ స్టంప్ అని, కాళ్లకు దగ్గరగా ఉండేదాన్ని లెగ్ స్టంప్ అని అంటారు. ఈ రెండింటికీ మధ్యలో ఉండేదాన్ని మిడిల్ స్టంప్‌గా చెబుతారు. బెయిల్స్ స్థూపాకార ఆకారంలో ఉంటాయి కానీ వాటి నిర్మాణంలో రెండు కచ్చితమైన భాగాలు ఉంటాయి. మధ్య భాగాన్ని బారెల్ అని పిలుస్తారు. బారెల్ నుంచి బయటకు వచ్చిన భాగాన్ని "స్పిగోట్స్" అంటారు. ఈ స్పిగోట్‌లు వేర్వేరు పొడవు కలిగి ఉంటాయి. చిన్న స్పిగోట్ మధ్య స్టంప్స్ ఉంచుతారు. బెయిల్‌లు స్టంప్‌ల వెడల్పుకు మించి ఉండవు.
2014లో క్రికెట్ బెయిల్స్ కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. క్రికెట్‌లో జింగ్ బెయిల్స్ ప్రవేశపెట్టారు. ఈ బెయిల్‌లను ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. బెయిల్స్ స్టంప్స్ పై నుంచి పడితే ఎల్‌ఈడీ లైట్లతో మెరుస్తాయి. ఈ బెయిల్స్ ప్రవేశపెట్టడం వల్ల బ్యటర్ల అవుట్ ను నిర్ధారించడం అంపైర్లకు సులువుగా మారింది.




















