Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం, నెక్ట్స్ ఏంటి?
Team India Openor Rohit Sharma: వన్డే ప్రపంచ కప్ 2023లో ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Rohit Sharma To Stay Away From T20Is: న్యూఢిల్లీ: వన్డే ప్రపంచ కప్ 2023లో ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి అంతర్జాతీయంగా టీ20 మ్యాచ్ లు ఆడకూడదని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. బీసీసీఐకి సంబంధించిన వ్యక్తి పీటీఐకి ఈ విషయాన్ని తెలిపారు. ఇదే నిజమైతే టీ20లలో రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ లు, శతకాలు చూడలేం అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
వాస్తవానికి రోహిత్ శర్మ ఏడాది కాలం నుంచి అంతర్జాతీయంగా పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నవంబర్ 2022లో టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత హిట్ మ్యాన్ రోహిత్ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడని తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ మీద ఫోకస్ చేసిన కారణంగా రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడని అంతా భావించారు. అయితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తరువాత రోహిత్ వైట్ బాల్ క్రికెట్ ప్లాన్ పై బీసీసీఐ అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ ఇక అంతర్జాతీయంగా టీ20 ఫార్మాట్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించడనే వార్త వైరల్ అవుతోంది. గత ఏడాది నుంచి టీ20లలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథిగా వ్యవహరించాడు.
36 ఏళ్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ తరఫున 148 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్లో 4 సెంచరీలు బాదిన హిట్ మ్యాన్ 140 స్ట్రైక్ రేట్‌తో 3,853 పరుగులు సాధించాడు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తరువాత అజిత్ అగార్కర్ తో చర్చలు జరిపిన రోహిత్ పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటూనే వన్డే ప్రపంచ కప్ పై ఫోకస్ చేశాడు. ఇక వన్డే వరల్డ్ కప్ ముగియడంతో రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా, లేక ఏదైనా ఫార్మాట్ నుంచి వైదొలుగుతాడా అతడి మనసులో ఏముందంటూ క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. టీ20లకు దూరంగా ఉండాలన్నది పూర్తిగా రోహిత్ వ్యక్తిగత అభిప్రాయమని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో అన్నారు.
టీ20ల నుంచి నిజంగానే రోహిత్ తప్పుకుంటే.. టీమిండియాకు మరో నలుగురు ఓపెనర్లు ఉన్నారు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. వీళ్లందరూ ఇదివరకే ఐపీఎల్ లో తామెంటో నిరూపించుకున్నవారే. గాయాలబారిన పడకుండా ఉండాలన్నా, వయసు రీత్యా కెరీర్ కొనసాగించాలన్నా రోహిత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వన్డే, టీ20, టెస్టులతో పాటు ఐపీఎల్ లోనూ కొనసాగడం కష్టతరం. దాంతో కెరీర్ చివరి దశలో రోహిత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య 5టీ20ల సిరీస్ తొలి మ్యాచ్ గురువారం విశాఖలో జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ.
Also Read: Visakhapatnam Traffic Diversions: అలర్ట్! రేపు ఆస్ట్రేలియా, టీమిండియాల తొలి టీ20 మ్యాచ్, విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా