T20 World Cup IND vs NED: నెదర్లాండ్స్‌పై హార్దిక్‌కు రెస్ట్! అడిగితే బౌలింగ్ కోచ్ ఏమంటున్నాడో తెలుసా?
T20 World Cup IND vs NED: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అన్ని మ్యాచులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే అంటున్నాడు.
T20 World Cup IND vs NED: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అన్ని మ్యాచులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే అంటున్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచులో ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదని పరోక్షంగా సూచించాడు. మైదానాలు, పరిస్థితులు, పనిభారాన్ని బట్టి ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని వెల్లడించాడు. పాకిస్థాన్ మ్యాచులో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అనుభవంతో ఉండే ఉపయోగం ఇదేనని తెలిపాడు.
'హార్దిక్ పాండ్య అన్ని మ్యాచులు ఆడాలని కోరుకుంటున్నాడు. ఇదెంతో ముఖ్యం. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలనో మేం ఆలోచించడం లేదు. ఏ ఆటగాడి విషయంలోనూ మేం అలా ఆలోచించడం లేదు. హార్దిక్ మాకు కీలక ఆటగాడు. బౌలింగ్, బ్యాటింగ్‌తో బ్యాలెన్స్ తీసుకొస్తాడు. అంతకు మించి మైదానంలో అతడి యాటిట్యూడ్ ఎంతో ముఖ్యం. చివరి మ్యాచులో అతడెంత కీలకంగా ఆడాడో మీకు తెలుసు. ఆటను చివరి వరకు తీసుకెళ్తే బౌలింగ్ జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఈ మ్యాచ్‌ను విరాట్ ముగించినా హార్దిక్‌కు క్రెడిట్ ఇవ్వాలి. మా చర్చల్లో విశ్రాంతికి తావులేదు. అన్ని మ్యాచులూ ఇంపార్టెంటే' అని మహంబ్రే అన్నాడు.
View this post on Instagram
మహ్మద్ షమి చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని పరాస్ తెలిపాడు. కొవిడ్ 19 తర్వాత ఎన్‌సీఏలో అతడు కోలుకున్నాడని వివరించాడు. 'అతడెలా ఫీలవుతున్నాడో, ఎలాగున్నాడో, పనిభారం ఎలా ఉందో మేం తెలుసుకోవాలని అనుకున్నాం. ఎన్‌సీఏ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో సంతోషించాం. అతడికెంతో అనుభవం ఉంది. అతడి నుంచి ఏం ఆశిస్తామో తెలిసిందే. కొవిడ్ తర్వాత చాలా బాగా కోలుకున్నాడు. అప్పట్నుంచి మంచి షేప్‌లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియాలో వేసిన తొలి ఓవర్ నుంచే మంచి లయలో ఉన్నాడు. అతడు ఛాంపియన్ బౌలర్ అనడంలో సందేహం లేదు' అని ఆయన పేర్కొన్నాడు.
హార్దిక్ పాండ్య వల్ల అదనపు బ్యాటర్‌ను ఆడించేందుకు అవకాశం దొరుకుతోందా అని ప్రశ్నించగా 'మేం ఆడుతున్న పరిస్థితులను బట్టి అది ఉంటుంది. మేం కోరుకున్నదీ అదే. అతడు సమతూకం తీసుకొస్తాడు. చాలా ప్రభావవంతంగా ఆడుతున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. ఏదేమైనా అదనపు బ్యాటర్‌ను తీసుకోవడం పరిస్థితులను బట్టే ఉంటుంది' అని పరాస్ జవాబిచ్చాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌అప్స్ చూస్తామని, ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే అశ్విన్ ఎక్కువ మ్యాచులే ఆడతాడని పేర్కొన్నాడు. అతడు పరిణతితో బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటాడని తెలిపాడు. వికెట్‌ను బట్టే నలుగురు పేసర్లా, ఐదుగురు పేసర్లా అన్నది నిర్ణయిస్తాం' అని వెల్లడించాడు.