సస్పెన్షన్ ప్రమాదంలో పడబోతున్న పీసీబీ - అలా చేస్తే గడ్డుకాలమే!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేస్తుందా? ఫుల్ టైం మెంబర్ గా పాకిస్థాన్ తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయా? దాని కారణాలు, ఉన్న అవకాశాలేంటో చూడండి.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేస్తుందా? ఫుల్ టైం మెంబర్ గా పాకిస్థాన్ తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం బీసీసీఐ, పీసీబీ మధ్య నెలకొన్న పరిస్థితులే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏషియా కప్, వరల్డ్ కప్ రెండూ జరగబోతున్నాయి. ఈ రెండింటికీ పాకిస్థాన్, ఇండియా ఆతిథ్యం ఇస్తున్నాయి. దీని మీద గత కొన్నాళ్లుగా పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా చేస్తున్న కామెంట్స్ చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు అవి కాస్తా తేడా కొట్టేసి చివరకు వాళ్ల ఐసీసీ సభ్యత్వమే కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఎందుకంటే ఒక టైంలో ఏకంగా వచ్చే ఏడాది భారత్ లో జరిగే వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేస్తామంటూ రమీజ్ అన్నాడు. కానీ అలా చేసే సాహసం పీసీబీ చేయదేమో. ఎందుకంటే కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐసీసీ తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి.
ఏదైనా సభ్య దేశం తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకుండా ఉల్లంఘిస్తున్నట్టు ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ భావించినట్టైతే ఆ దేశ సభ్యత్వాన్ని వెంటనే సస్పెండ్ చేసే అధికారం వారికి ఉంటుందని ఐసీసీ మెమొరండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోని క్లాజ్ 2.10 చెప్తోంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఐసీసీ ఈవెంట్ ను బహిష్కరిస్తే మాత్రం సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. ప్రాసెస్ అంత సులువు కాకపోవచ్చు. ఈ విషయం ఓ మధ్యవర్తిత్వ ప్యానెల్ దాకా కూడా వెళ్లొచ్చు. సభ్యత్వ సస్పెన్షన్ పక్కన పెడితే ఇంకా చాలా ప్రభావాలు పడే అవకాశముంది.
ఉదాహరణకు వచ్చే ఏడాది వరల్డ్ కప్ ను పీసీబీ బహిష్కరించిందే అనుకోండి. ఐసీసీ నుంచి బోర్డులకు వచ్చే ఆదాయం కూడా పాకిస్థాన్ కు ఆగిపోవచ్చు. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా వరల్డ్ కప్ ను పాకిస్థాన్ బహిష్కరించే సమస్యే లేదు. వారు అంత ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. ఇండియా, పాకిస్థాన్ ను ఇన్వాల్వ్ చేసిన విషయం కాబట్టి ఈ కాంట్రవర్సీ గురించి ఐసీసీ ఇప్పటిదాకా స్పందించలేదు. వరల్డ్ కప్ దగ్గరపడే కొద్దీ ఈ ఇష్యూ బాగా చల్లారిపోతుందని ఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. పాక్ లో జరగబోయే ఏషియా కప్ లో ఇండియా పాల్గొనబోదని కొన్నాళ్ల క్రితం జై షా అన్నారు. కానీ ఏషియా కప్ అనేది ఐసీసీ పరిధిలోకి రాదు. దాని నిర్వహణ బాధ్యతలు... ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చూసుకుంటుంది. ఒకవేళ 2025లో పాకిస్థాన్ లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లకుండా బహిష్కరిస్తామని బీసీసీఐ చెప్పినా సరే.... బీసీసీఐకి కూడా ఐసీసీ నుంచి ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముంది. కానీ దానికి ఇంకా దాదాపుగా మూడేళ్ల సమయం ఉంది. అంతకన్నా ముందు వచ్చే ఏడాది ఏషియా కప్, వరల్డ్ కప్ విషయంలో ఏం జరుగుతుందా అని అంతటా ఆసక్తి నెలకొంది.