Mohammed Shami : పాండ్యా లేకపోయినా పర్లేదు,షమీ సంచలన వ్యాఖ్యలు
IPL 2024: గుజరాత్ జట్టును ఎవరు వీడినా ఎలాంటి ప్రభావం ఉండదని షమీ అన్నాడు. జట్టు సమతూకంగా ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రమే చూడాలని షమీ స్పష్టం చేశాడు.
ఐపీఎల్(IPL)లో హార్దిక్ పాండ్యా ముంబై జట్టులో చేరతాడన్న ఊహాగానాలే నిజమై ఈ ఆల్‌రౌండర్ కెప్టెన్ కూడా అయిపోయాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans )ను ఫైనల్స్ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన పాండ్యా.. వచ్చే సీజన్ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పాండ్యా ముంబయి జట్టు సొంతమయ్యాడు. ముంబైలో చేరేందుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యా వైదొలిగాడు. IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ జరిగి హార్దిక్ పాండ్యా ముంబై జట్టు సొంతమయ్యాడు. తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్ అంగీకరించడం సంచలనంగా మారింది. హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కలిపిన ముంబై అనుకున్నది సాధించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే సమయం ఇక ముగిసిందనుకున్న సమయంలో ఈ సంచలనం జరిగింది. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైతో చేరాడు. తాజాగా ఈ వ్యవహారంపై గుజరాత్ స్టార్ పేసర్ షమీ(Mohammed Shami) స్పందించాడు.
ఏం ప్రభావం ఉండదు
గుజరాత్ జట్టును ఎవరు వీడినా.. ఎలాంటి ప్రభావం ఉండదని షమీ అన్నాడు. జట్టు సమతూకంగా ఉందా.. లేదా.. అన్న విషయాన్ని మాత్రమే చూడాలని షమీ స్పష్టం చేశాడు. హార్దిక్ కెప్టెన్‌గా రాణించాడని... జట్టును రెండుసార్లు ఫైనల్‌కు తీసుకెళ్లి.. ఒకసారి విజేతగా నిలిపాడని గుర్తు చేశాడు. కానీ.. అతడితో గుజరాత్ జీవితకాల ఒప్పందం ఏమీ చేసుకోలేదు కదా.. అని ఈ స్టార్ పేసర్ ప్రశ్నించాడు. గుజరాత్ జట్టులో ఉండాలా..? వద్దా.. అనేది పాండ్యా నిర్ణయమన్నాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ కెప్టెన్ అయ్యాడని.... భవిష్యత్తులో అతడు నేర్చుకుంటాడని షమీ అన్నాడు. ఏదో ఒక రోజు అతడూ వెళ్లిపోవచ్చని... కానీ ఇదంతా ఆటలో భాగమని షమీ పేర్కొన్నాడు. ఎవరైనా కెప్టెన్ అయితే.. తన వ్యక్తిగత ప్రదర్శనను జాగ్రత్తగా చూసుకుంటూ.. జట్టు బాధ్యతలను నిర్వర్తించడం ఎంతో ముఖ్యమని షమీ అభిప్రాయపడ్డాడు. గిల్‌కు ఈ సారి ఆ బాధ్యతలు అప్పగించాం. అతడిపై ఒత్తిడి పెరగొచ్చు. అయితే.. అతడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.
రోహిత్ అభిమానుల ఆగ్రహం
ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు వచ్చే సీజన్ నుంచి సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్ పాండ్యా(Hardic Pandya) ఫిట్‌నెస్ కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడన్న వార్తలతో.... రోహిత్ శర్మ అభిమానులు అప్పట్లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. కామెంట్లు, పోస్టులు, మీమ్‌లతో సోషల్ మీడియాను హోరెత్తించారు. హార్దిక్ పాండ్యా ఫొటోలను ట్వీట్ చేస్తూ రోహిత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుందంటూ కామెంట్లు చేశారు. డియర్ హార్ధిక్ పాండ్యా.. మళ్లీ రోహిత్ శర్మకు జోలికి రావద్దంటూ ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. పలువురు అభిమానులు ఫన్నీ మీమ్స్, ట్రోల్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. రోహిత్ శర్మతో పెట్టుకోవడమంటే నువ్వు నీ కర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే ని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.