Ind Vs Pak Asia Clash: సెమీస్ చేరినా టీమిండియా తగ్గేదేలే.. దాయాదిని చిత్తు చేసేందుకు ఉత్సాహంగా హర్మన్ ప్రీత్ సేన
మహిళల ఆసియా కప్‌లో ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు శనివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆమీ తుమీ తేల్చుకోనుంది.

Women In Blue Ready For Arch Rival Challenge: మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో ఇప్పటికే దర్జాగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత మహిళల జట్టు, తమ ఆఖరి గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరాడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి 8 గంటలకు ఈ హై-వోల్టేజ్ సమరం ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా భారత్, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు అభిమానుల అంచనాలకు తగ్గట్లు హోరాహోరీగా సాగడం లేదు, పూర్తి ఆధిపత్యంతో భారత్ విజయాలు సాధిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్, పాకిస్తాన్‌ను చిత్తు చేసి తమ ఆధిపత్యాన్ని చాటాలని చూస్తోంది. గత రెండు ప్రపంచకప్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన నేపథ్యంలో, జట్టులోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ మ్యాచ్ సరైన వేదికగా నిలిచింది.
జోరు మీదున్న మంధాన..
భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో దుమ్ము రేపుతున్నారు. హాంకాంగ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మంధాన 64 బంతుల్లోనే 124 పరుగులతో రికార్డు సెంచరీ బాది ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. దుబాయ్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అంత సులువుగా లేకపోవడంతో ఆరంభంలో క్రీజులో నిలదొక్కుకుని ఆ తర్వాత బౌండరీలతో సత్తా చాటుతున్నారు.. అయితే మూడో స్థానంలో వస్తున్న ప్రతీకా రావల్ టీ20 ఫార్మాట్ వేగానికి తగ్గట్లు ఆడటంలో ఇబ్బంది పడుతోంది. ఆమెతో పాటు రిచా ఘోష్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎక్కువ సమయం క్రీజులో గడిపి భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉందని అంటున్నారు. బౌలింగ్ విభాగంలో క్రాంతి గౌడ్ తో కలిసి నందిని శర్మ పేస్ బాధ్యతలను సమర్థవంతంగా మోస్తోంది.
బ్యాటింగే బలహీనత..
మరోవైపు పాకిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌పై అతి కష్టం మీద గెలిచి సెమీస్ రేసులోకి వచ్చింది. 119 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైనప్పటికీ బౌలింగ్ లో రాణించి విజయాన్ని కాపాడుకుంది. చాలా కాలంగా ఆ జట్టును బ్యాటింగ్ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. జట్టు మొత్తం ఓపెనర్ మునీబా అలీ, కెప్టెన్ ఫాతిమా సనాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోతున్న తీరు మారకపోతే బలమైన భారత బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొని నిలబడటం పాకిస్తాన్‌కు చాలా కష్టంగా మారనుందని తెలుస్తోంది.
మ్యాచ్ ఎప్పుడంటే..
శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో గెలిచి గ్రూప్ టాపర్ గా సెమీస్ కు వెళ్లాలని భారత్ పట్టుదలగా ఉంది. భారత జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, జి కమలిని, అరుంధతి రెడ్డి, ప్రేమ రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతీకా రావల్ ఉన్నారు. పాకిస్తాన్ జట్టుకు ఫాతిమా సనా నాయకత్వం వహిస్తుండగా మునీబా అలీ, సదాఫ్ షమాస్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్ వంటి ప్లేయర్లు బరిలోకి ఆడుతున్నారు.
Before You Go
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
ట్రెండింగ్ వార్తలు



















