IND Vs PAK: ఓవర్లు తగ్గితే టార్గెట్ ఎంత ఉంటుంది? - ఎన్ని ఓవర్లకు తగ్గితే టీమిండియాకు మంచిది!
ఆసియా కప్ 2023లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయింది. కానీ వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. ఒకవేళ ఓవర్లు తగ్గితే పాకిస్తాన్ టార్గెట్ ఎలా?
IND Vs PAK Revised Target: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇన్నింగ్స్ బ్రేక్‌లో వర్షం ఆటంకం కలిగించింది. ఇంతవరకు ఆట ప్రారంభం కాలేదు. ఎప్పుడు మ్యాచ్ ప్రారంభం అయినా ఓవర్లు తగ్గడం మాత్రం ఫిక్స్ అయిపోయింది.
ఓవర్లు తగ్గితే టార్గెట్ ఎలా?
ఒకవేళ కేవలం 20 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయితే పాకిస్తాన్ లక్ష్యం 155 పరుగులుగా ఉండనుంది. 30 ఓవర్లకు కుదిస్తే పాకిస్తాన్ 203 పరుగులు చేయాల్సి ఉంటుంది. 40 ఓవర్ల ఆట సాధ్యం అయితే మాత్రం పాకిస్తాన్ 239 పరుగులు ఛేదించాల్సి ఉంటుంది. మ్యాచ్ ప్రారంభం అయినా ఏ క్షణంలో అయినా ఆట ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ దాన్ని దృష్టిలో పెట్టుకునే మొదటి బంతి నుంచి బ్యాటింగ్ చేస్తుంది. భారత్ కూడా దానికి తగ్గట్లే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మనకు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. భారత జట్టు బ్యాటింగ్ మూల స్తంభాలు రోహిత్ శర్మ (11: 22 బంతుల్లో, రెండు ఫోర్లు), విరాట్ కోహ్లీ (4: 7 బంతుల్లో, ఒక ఫోర్) ఇద్దరూ ఘోరంగా విఫలం అయ్యారు. వీరిద్దరినీ షహీన్ షా అఫ్రిది బౌల్డ్ చేసి భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. దీంతో 27 పరుగులకే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కూడా టీమిండియా వైఫల్యాల పరంపర ఆగలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (10: 32 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో టూ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (14: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ కేవలం 66 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ఇక భారత జట్టు 150 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్న దశలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (82: 81 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (87: 90 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టీమిండియాను ఆదుకున్నారు. ప్రారంభంలో అనవసరంగా భారీ షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకోవడానికి వీరిద్దరూ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఒక్కసారి టచ్‌లోకి వచ్చాక ఇషాన్ కిషన్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా అతనికి చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఒకరి తర్వాత ఒకరు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
వీరిద్దరూ ఐదో వికెట్‌కు 141 బంతుల్లో 138 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్రీజులో నిలదొక్కుకున్న ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. ఇషాన్ వికెట్ పడ్డాక హార్దిక్ పాండ్యా గేర్ మార్చాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. చివర్లో జస్‌ప్రీత్ బుమ్రా (16: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) తన శక్తి మేరకు బ్యాటింగ్ చేశాడు. కానీ స్లాగ్ ఓవర్లలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. 48.5 ఓవర్లలో 266 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టాడు. నసీం షా, హరీస్ రౌఫ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial