IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి
ఆస్ట్రేలియాతో వన్డే సిరీసును టీమ్‌ఇండియా 2-1 తేడాతో ముగించింది. ఆఖరి వన్డేలో ఓటమి పాలైంది. 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన హిట్‌మ్యాన్ సేన 49.4 ఓవర్లకు 286కు ఆలౌటైంది.
IND vs AUS 3rd ODI:
ఆస్ట్రేలియాతో వన్డే సిరీసును టీమ్‌ఇండియా 2-1 తేడాతో ముగించింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఓటమి పాలైంది. క్వీన్‌స్వీప్ అవకాశాన్ని చేజార్చుకుంది. 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన హిట్‌మ్యాన్ సేన 49.4 ఓవర్లకు 286కు ఆలౌటైంది. 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటుతో విఫలమైన మ్యాడ్ మాక్సీ (4/40) బంతితో భారత్‌ను దెబ్బకొట్టాడు. టాప్ ఆర్డర్లో వరుసగా నలుగురిని పెవిలియన్‌కు పంపించాడు. రోహిత్ శర్మ (81; 57 బంతుల్లో 5x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ (56; 61 బంతుల్లో 5x4, 1x6), శ్రేయస్ అయ్యర్ (48; 43 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. అంతకు ముందు ఆసీస్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ (96; 84 బంతుల్లో 13x4, 3x6), స్టీవ్ స్మిత్ (74; 61 బంతుల్లో 8x4, 1x6), మార్నస్ లబుషేన్ (72; 58 బంతుల్లో 9x4, 0x6), డేవిడ్ వార్నర్ (56; 34 బంతుల్లో 6x4, 4x6) అర్ధశతకాలు చేశారు.
ఆరంభం అదుర్స్
నిజానికి భారీ లక్ష్య ఛేదలో టీమ్‌ఇండియాకు మెరుపు ఆరంభం లభించింది. రోహిత్ శర్మకు తోడుగా ఈసారి వాషింగ్టన్ సుందర్ (18; 30 బంతుల్లో 1x4, 1x6) ఓపెనర్‌గా వచ్చాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 65 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం అందించాడు. సుందర్ తడబడ్డప్పటికీ హిట్‌మ్యాన్ చెలరేగాడు. ఆసీస్ పేసర్లు టార్గెట్ చేసిన మరీ సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టాడు. దాంతో 10 ఓవర్లకు భారత్ వికెట్లేమీ నష్టపోకుండానే 72 పరుగులు చేసింది. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఆ తర్వాత మరింత చెలరేగాడు. వేగంగా సెంచరీ వైపుకు సాగాడు. అయితే జట్టు స్కోరు 144 వద్ద అతడిని మాక్సీ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అంతకు ముందే సుందర్‌ను అతడే ఔట్ చేశాడు.
ఆఖర్లో బెదుర్స్
వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ సైతం అద్భుతంగా ఆడాడు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన అతడు క్రీజులో కుదురుకున్నాక వేగం పెంచాడు. ఐదు సొగసైన బౌండరీలు బాదాడు. 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 61 బంతుల్లో 70 పరుగులు, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 35 బంతుల్లో 27 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. జట్టు స్కోరు 171 వద్ద అతడిని మాక్సీనే ఔట్ చేశాడు. ఈ సిచ్యువేషన్లో కేఎల్ రాహుల్ (26; 30 బంతుల్లో 2x4), శ్రేయస్ కలిసి 54 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఇక టార్గెట్‌ను సాధించడం సులువే అనుకుంటున్న తరుణంలో రాహుల్‌ను స్టార్క్ పెవిలియన్ పంపించాడు. సూర్య (8) పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. పోరాడుతున్న శ్రేయస్‌ను మాక్సీ బౌల్డ్ చేశాడు. అప్పటికి స్కోరు 249. వరుస వికెట్ల పతనంతో టీమ్‌ఇండియాపై రన్‌రేట్ ప్రెజర్ పెరిగింది. ఆఖర్లో రవీంద్ర జడేజా (35; 36 బంతుల్లో 3x4, 1x6) ఒకట్రెండు షాట్లు ఆడినా ఆసీస్ గెలుపు లాంఛనమే అయింది.
మార్ష్ దంచికొట్టుడు
ప్లాట్ పిచ్.. బ్యాటు మీదకు చక్కగా వస్తోన్న బంతి! ఇంకేముంది పరిస్థితులను ఆస్ట్రేలియా అనుకూలంగా మలుచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగి టీమ్‌ఇండియాకు చుక్కలు చూపించింది. బంతి జారుతుండటంతో బౌలర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఇక డేవిడ్ వార్నర్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగులో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. అతడికి తోడుగా మార్ష్ చెలరేగాడు. దాంతో ఆసీస్ 10 ఓవర్లకే 90 పరుగులు చేసింది. జట్టు స్కోరు 78 వద్ద వార్నర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేయడం కాస్త ఊరట.
డేవిడ్ భాయ్ ఔటయ్యాక స్కోరు తగ్గిందనుకుంటే పొరపాటే! వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్‌స్మిత్‌తో కలిసి మిచెల్ మార్ష్ మరింత ప్రమాదకరంగా మారాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 119 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పేసర్లు, స్పిన్నర్లను ఓ ఆటాడుకున్నారు. 45 బంతుల్లో 50 కొట్టిన మార్ష్ వడివడిగా సెంచరీకి చేరువయ్యాడు. జట్టు స్కోరు 215 వద్ద అతడిని కుల్‌దీప్ యాదవ్ ఔట్ చేసింది. కొంత సమయానికి 43 బంతుల్లోనే అర్ధశతకం బాదేసిన స్టీవ్ స్మిత్‌ను మహ్మద్ సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
జోరు పెంచిన లబుషేన్
టాప్ 3 ఔటయ్యాక ఆసీస్‌కు లబుషేన్ అండగా నిలిచాడు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (5), అలెక్స్ కేరీ (11), కామెరాన్ గ్రీన్ (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా అతడు మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఏడో వికెట్‌కు 39 బంతుల్లో 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కేరీతో కలిసీ ఇన్నింగ్స్ నడిపించాడు. అతడే త్వరగా ఔటయ్యుంటే ఆసీస్‌కు ఇంత స్కోర్ వచ్చేది కాదు. 49వ ఓవర్ ఆఖరి బంతికి అతడిని బుమ్రా ఔట్ చేశాడు. కమిన్స్ (19), మిచెల్ స్టార్క్ (1) అజేయంగా నిలిచారు. బుమ్రా 10 ఓవర్లలో 81 పరుగులు ఇచ్చినా 3 వికెట్లు పడగొట్టాడు. కుల్‌దీప్ 2 వికెట్లు దక్కాయి.