IND vs BAN, Match Highlights: భయపెట్టిన బంగ్లాదేశ్ - థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఐదు పరుగులతో భారత్ విక్టరీ!
ICC T20 WC 2022, IND vs BANG: బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగులతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. అయితే బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా ఐదు పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో తిరిగి భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ లిటన్ దాస్ (60: 27 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (21: 25 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.
ఈ దశలో వర్షం పడటంతో బంగ్లాదేశ్ శిబిరంలో ఆనందం కనిపించింది. ఎందుకంటే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అప్పటికే బంగ్లాదేశ్ 17 పరుగుల ముందంజలో ఉంది. అయితే వర్షం కాసేపటికి తగ్గడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు సవరించారు.
ఆ తర్వాత టీమిండియా జాగ్రత్త పడింది. బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీశారు. అలాగే బంగ్లాదేశ్ కూడా ఒత్తిడికి లోనయింది. ఓపెనర్లు అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపించలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ నురుల్ హాసన్ (25 నాటౌట్: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో బంగ్లాదేశ్ 16 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితం అయింది. భారత్ ఐదు పరుగులతో విజయం సాధించింది.
అంతకు ముందు టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (2) త్వరగా ఔటైనా ఈసారి కేఎల్ రాహుల్ (50: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చెలరేగాడు. తన క్లాస్ ఏంటో చూపించాడు. తస్కిన్ అహ్మద్ మంచి లైన్ అండ్ లెంగ్తుతో విరుచుకుపడ్డా రాహుల్ మాత్రం చూడచక్కని బౌండరీలు, సిక్సర్లు బాది స్కోరు వేగం పెంచాడు. 31 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు.
షకిబ్ వేసిన 9.2వ బంతిని ఫైన్‌లెగ్‌లో గాల్లోకి ఆడి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (30: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు) దూకుడుగా, విరాట్ కోహ్లీ (64 నాటౌట్: 44 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) ఆచితూచి ఆడారు. దాంతో 11.5 ఓవర్లకే భారత స్కోరు 100 దాటేసింది. ఈ క్రమంలో సూర్యను షకిబే బౌల్డ్ చేశాడు. 37 బంతుల్లో అర్ధశతకం బాదేసిన కోహ్లీకి తోడుగా ఆఖరి ఓవర్లో అశ్విన్ (13*; 6 బంతుల్లో 1x4, 1x6) మెరవడంతో స్కోరు 185కు చేరింది. కింగ్ కొట్టిన షాట్లు ఫ్యాన్స్‌ను అలరించాయి.