Age Fraud Crackdown: ఇండియా అండర్ 19 సెలెక్షన్ రాగానే బయట పడిన ఏజ్ ఫ్రాడ్ స్కామ్.. రోహిత్ పై బీసీసీఐ రెండేళ్ల బ్యాన్
వయసు ధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు బయటపడటంతో యువ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించడం సంచలనంగా మారింది.

BCCI Cracks Down On Bengal Cricket Age Manipulation: బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో నకిలీ వయసు పత్రాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వయసు మోసం కేసులో బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌ను రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే అండర్-19 సిరీస్ కోసం భారత జట్టులో రోహిత్ ఎంపికైన కొద్దిరోజులకే ఈ కఠిన చర్యలు తీసుకోవడం విశేషం. గత జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టులోనూ అతడు ప్రాతినిధ్యం వహించి ఆరు వికెట్లు పడగొట్టి ఆఖరి టెస్టులో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
భారీ తేడా..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ యాదవ్.. బెంగాల్ తరఫున ఏజ్ గ్రూప్ క్రికెట్ లో పాల్గొంటున్నాడు. ఆస్ట్రేలియాతో రాజ్ కోట్, అహ్మదాబాద్ లలో జరిగే వన్డే, మల్టీ డే మ్యాచ్‌లకు అతడు ఎంపికయ్యాడు. అయితే శ్రీలంక టూర్ సందర్భంగా సమర్పించిన పత్రాలను పరిశీలించగా తీవ్ర అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. రోహిత్ వద్ద 2007, 2009, 2010 సంవత్సరాల పుట్టిన తేదీలతో మూడు వేర్వేరు జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు తేలింది. క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) జరిపిన విచారణలో అతడి వయసులో ఏకంగా 27 నెలల వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో అతడిని వెంటనే సస్పెండ్ చేస్తూ అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ సమాచారం ఇచ్చింది.
ప్రక్షాళన ముమ్మరం..
రోహిత్ యాదవ్ వ్యవహారంతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ భారీ ప్రక్షాళన చేసింది. నకిలీ పత్రాలు, వయసు అవకతవకల ఆధారంగా ఏకంగా 62 మంది ఆటగాళ్లను రాబోయే 2026-27, 2027-28 సీజన్లలో ఎలాంటి పోటీలలోనూ రిజిస్ట్రేషన్ లేదా బదిలీలకు అనర్హులుగా ప్రకటిస్తూ బ్యాన్ చేసింది. దేశవాళీ జూనియర్ విభాగంలో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు అసోసియేషన్ ఈ కఠిన వైఖరి అవలంబించింది.
ప్రపంచకప్ విన్నర్ పై కూడా..
ఈ నిషేధానికి గురైన వారిలో 2022 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు, లెఫ్టార్మ్ పేసర్ రవి కుమార్ కూడా ఉండటం తీవ్ర విస్మయానికి కలిగిస్తోంది. కరీబియన్ దీవుల్లో భారత్ టైటిల్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 2022 లో బెంగాల్ సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన రవి కుమార్, 2023 తర్వాత రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించలేదు. అతడి వయసు పత్రాలలో ఏకంగా 40 నెలల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడు అరంగేట్రం చేసిన నాటి నుంచి 2025-26 సీజన్ వరకు సాధించిన అన్ని ఏజ్ గ్రూప్ రికార్డులను అధికారికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు



















