BAN vs AFG: బంగ్లాదేశ్‌కు ఎలిమినేషన్ గండం - బోణీ కోసం అఫ్గాన్ తండ్లాట
ఆసియా కప్ మొదలై ఐదు రోజులు కూడా కాకముందే నేడు ఓ జట్టు ఎలిమినేట్ అయ్యే గండంలో చిక్కుకుంది. అఫ్గానిస్తాన్‌తో నేటి మ్యాచ్‌లో ఓడితే బంగ్లాదేశ్ టీమ్.. ఢాకాకు టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.
BAN vs AFG: ఆసియా కప్‌లో ఇంకా అఫ్గానిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకముందే మరో జట్టు బంగ్లాదేశ్‌కు ‘ఎలిమినేషన్ గండం’ భయపెడుతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఇదివరకే శ్రీలంకతో ఒక మ్యాచ్ ఆడి అందులో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్.. నేడు అఫ్గానిస్తాన్ టీమ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో గనక ఓడితే ఇక లాహోర్ నుంచి నేరుగా ఢాకాకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పాకిస్తాన్‌లో తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న అఫ్గాన్.. బోణీ కొట్టడంతో పాటు బంగ్లాను నాగిని డాన్స్ ఆడించేందుకు భారీ ప్రణాళికలతో ముందుకొస్తున్నది. మరి ఈ కీలక పోరులో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి..? లాహోర్ (పాకిస్తాన్) లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచేది ఎవరు..?
బంగ్లాకు డూ ఆర్ డై..
లంకతో మ్యాచ్‌లో ఓడటంతో బంగ్లాదేశ్‌కు నేడు అఫ్గాన్‌తో జరుగబోయే మ్యాచ్‌లో గెలవడం అనివార్యమైంది. గ్రూప్ స్టేజ్‌లో ప్రతి జట్టు ప్రత్యర్థితో ఒక మ్యాచ్ ఆడాలి. అందులో ఒక్కటైనా గెలిస్తేనే సూపర్ - 4కు అర్హత సాధించొచ్చు. లంకతో ఇదివరకే ఓడిపోయిన బంగ్లాకు అఫ్గాన్ చేతిలో కూడా చావుదెబ్బ తింటే ఇంక అంతే సంగతులు. కొద్దిరోజుల క్రితమే అఫ్గాన్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాను అఫ్గానిస్తాన్ ఊహించని దెబ్బకొట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గింది. ఇదే ఫలితం ఇక్కడ కూడా రిపీట్ అయితే బంగ్లా పరిస్థితి గోవిందా గోవిందా..
అఫ్గాన్‌తో చిక్కులు తప్పవు అనుకుంటే బంగ్లాదేశ్‌కు మరో గండం కూడా పొంచి ఉంది. 2008 తర్వాత బంగ్లా జట్టు లాహోర్ లో మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం బంగ్లా టీమ్‌లో ఉన్నవారిలో ముష్పీకర్ రహీం ఒక్కడికే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ కూడా లంకతో మ్యాచ్‌లో తడబడింది. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్‌లు లేని లోటు ఆ జట్టులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముష్ఫీకర్ రహీమ్ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. లంకతో మ్యాచ్‌లోనే అతడు పూర్తి ఫిట్‌గా లేకున్నా ఆడాడు. ఆ మ్యాచ్‌లో నజ్ముల్ శాంటో తప్ప మిగిలినవారంతా విఫలమయ్యారు. మెహిది హసన్, షకిబ్ కూడా రాణిస్తేనే బంగ్లా భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం ఫర్వాలేదనిపించినా పల్లెకెలెలో అంతగా ప్రభావం అయితే చూపలేకపోయారు. మరి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే లాహోర్ పిచ్ పై వీళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరం.
అఫ్గాన్ బోణీ కోసం..
ఆసియా కప్ - 2023లో నేడు తమ తొలి మ్యాచ్ ఆడనున్న అఫ్గానిస్తాన్.. బోణీ కొట్టాలని బరిలోకి దిగుతున్నది. ఇటీవల బంగ్లాదేశ్‌ను వన్డేలలో ఓడించిన ఉత్సాహం ఆ జట్టులో మరింత స్ఫూర్తి నింపేదే. అఫ్గాన్‌కు పాకిస్తాన్ గడ్డమీద ఇదే తొలి వన్డే మ్యాచ్. పాక్‌పై తమ తొలి అడుగును ఘనంగా వేయాలని అఫ్గానిస్తాన్ భావిస్తున్నది. ఆ జట్టు బ్యాటింగ్ ప్రధానంగా రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా ల మీదే ఆధారపడి ఉంది. ఈ ఏడాది వన్డేలలో ఆ జట్టుకు విజయాలు అందించినవారిలో వీరే కీలకం. కానీ రహ్మత్ షా ఫామ్ కోల్పోవడం ఆ జట్టును తీవ్రంగా వేధిస్తున్నది. మిడిలార్డర్‌లో రియాజ్ హసన్‌కు పెద్దగా అనుభవం లేదు. అతడు ఇప్పటికీ 5 వన్డేలు మాత్రమే ఆడాడు. బంగ్లా వన్డే జట్టులోకి ఆరేండ్ల తర్వాత వచ్చిన నజీబుల్లా జద్రాన్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
బౌలింగ్‌లో అఫ్గానిస్తాన్ పటిష్టంగానే కనిపిస్తోంది. కొత్త బంతితో ఫజల్ ఫరూఖీకి తోడుగా అబ్దుల్ రెహ్మన్ రాణిస్తున్నాడు. స్పిన్నర్లుగా రషీద్ ఖాన్‌కు తోడుగా యువ కెరటం ముజీబ్ ఉర్ రెహ్మన్, సీనియర్ మహ్మద్ నబీలు కూడా తలా ఓ చేయి వేస్తారు. వీళ్లు అంతగా ఫామ్‌లో లేని బంగ్లా బ్యాటింగ్‌ను ఏ మేరకు నిలువరిస్తారో మరి..
తుది జట్లు (అంచనా) :
అఫ్గానిస్తాన్ : రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్/రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ ఫరూఖీ, అబ్దుల్ రెహ్మన్
బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, తాంజిద్ హసన్/అనాముల్ హక్, నజ్ముల్ హోసెన్ శాంటో, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫీకర్ రహీమ్, మెహిది హసన్, అఫిఫ్ హోసేన్, టస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం
మ్యాచ్ వేదిక, టైమింగ్స్:
- లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.
లైవ్ చూడటమిలా..
- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో స్టార్ నెట్వర్క్స్‌తో పాటు మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్‌లలో ఉచితంగా చూడొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial