Cheteshwar Pujara: కోపమొచ్చిందా ఏంటీ! ఈ సీజన్లో మూడో డబుల్ సెంచరీ కొట్టేసిన పుజారా!
Cheteshwar Pujara: టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా ఆకలిగొన్న పులిలా రెచ్చిపోతున్నాడు! ఇంగ్లాండ్ గడ్డపై పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లోనే మూడో డబుల్ సెంచరీ కొట్టేశాడు.
Cheteshwar Pujara Double Tons: టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా ఆకలిగొన్న పులిలా రెచ్చిపోతున్నాడు! ఇంగ్లాండ్ గడ్డపై పరుగుల వరద పారిస్తున్నాడు. భారత జట్టులో చోటు కోల్పోయానన్న కసితో ఆడుతున్నాడు. వరుసగా సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టేస్తున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో గతంలో ఎన్నడూ లేనంత ఫామ్ చూపిస్తున్నాడు. ఈ సీజన్లోనే మూడో డబుల్ సెంచరీ కొట్టేశాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు పుజారా వెన్నెముక! అతడు నిలబడితే ప్రత్యర్థులు భయపడేవాళ్లు. ఎలా ఔట్‌చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకొనేవాళ్లు. ప్రత్యేక వ్యూహాలు రచించేవారు. అలాంటిది ఏడాదిన్నరగా అతడు ఫామ్‌లో లేడు. బంతులు ఆడుతున్నా రన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఫలితంగా భారత జట్టులో పదేపదే చోటు కోల్పోతున్నాడు. కొన్నేళ్లుగా అతడు ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సీజన్లో ససెక్స్ కౌంటీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ చర్య బాగానే పనిచేసింది. కెప్టెన్సీ బాధ్యతలు అతడిని ఫామ్‌లోకి తీసుకొచ్చాయి.
ఏప్రిల్‌లో డెర్బీషైర్‌తో ఆడిన తొలి మ్యాచులో పుజారా దుమ్మురేపాడు. తొలి ఇన్నింగ్సులో కేవలం 6 పరుగులే చేశాడు. ఆ జట్టు 174కే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్సులో అతడు 387 బంతుల్లో 23 బౌండరీల సాయంతో 201తో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా టామ్ హైన్స్ (243) డబుల్ సెంచరీ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఏప్రిల్ 28న దుర్హమ్‌తో జరిగిన టెస్టులోనూ చెతేశ్వర్ ఇలాగే రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్సులో దుర్హమ్ 223కు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ససెక్స్ 538 రన్స్ చేసింది. ఇందుకు పుజారేనే కారణం. అతడు 334 బంతుల్లో 24 బౌండరీలతో 203 పరుగులు చేశాడు. ఈ మ్యాచూ డ్రాగా ముగిసింది.
ఇక మిడిలెక్స్‌తో వరుసగా 16, 170*తో నిలిచాడు పూజి! మళ్లీ అదే జట్టుతో జులై 19న మొదలైన మ్యాచులో డబుల్ సెంచరీ కొట్టేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే 403 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 231 రన్స్ చేశాడు. ఈ మధ్యలోనే వార్విక్‌షైర్ టెస్టులో సెంచరీ సాధించాడు. మరి ఇదే ఫామ్‌ను టీమ్‌ఇండియా తరఫున కొనసాగిస్తాడేమో చూడాలి.
View this post on Instagram