Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం
Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది.
ఫైనల్స్ చేరారిలా
క్వార్టర్ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది. గ్రూపు దశలో టాప్ సీడ్ చైనాను చిత్తుచేసిన పి.వి.సింధు బృందం.. క్వార్టర్స్‌లో హాంకాంగ్‌ను మట్టికరిపించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ తొలి పోరులో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు 21-7, 16-21, 21-12తో లో సిన్ యాన్పై గెలిచి బోణీ కొట్టగా.. డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీ 21-10, 21-14తో యెంగ్ నెగా టింగ్-యెంగ్ లామ్ ద్వయంపై గెలుపొందింది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో యువ షట్లర్ అష్మిత చలిహ 21-12, 21-13తో యెంగ్ సుమ్ యీపై నెగ్గింది. దీంతో 3-0తో భారత్ విజయభేరి మోగించింది. సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది.
చైనాకు షాక్ ఇచ్చారిలా....
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనా(China)కు భారత్(Bharat) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్-2024 టోర్నీలో టాప్ సీడ్ చైనా జట్టును మట్టికరిపించి టేబుల్ టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అద్భుత ఆటతీరుతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సింధు 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అక్టోబర్ నుంచి టోర్నీలకు దూరంగా ఉన్న సింధు సింగిల్స్ పోరులో హాన్ యుపై గెలిచింది. నలభై నిమిషాల పాటు సాగిన పోరులో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది.