Gambhir on Ajinkya Rahane: రహానె లక్కీ అనే చెప్పాలి మరి! గంభీర్ ఎందుకిలా అన్నాడో తెలుసా?
వైస్ కెప్టెన్ అజింక్య రహానెకు ఇంకా అవకాశాలు రావడం అదృష్టమని గౌతమ్ గంభీర్ అంటున్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీని ఫామ్‌లోకి వచ్చేందుకు ఉపయోగించుకోవాలని సూచించాడు.
సీనియర్ క్రికెటర్ అజింక్య రహానెకు ఇంకా అవకాశాలు దొరకడం అదృష్టమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. భారత్‌లో జరుగుతున్న టెస్టు సిరీసులో అతడు ఫామ్ అందుకోవలని సూచించాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌కే తాను ఓటేస్తానని వెల్లడించాడు. టెస్టు సిరీసుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.
మరో రెండు రోజుల్లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆరంభం అవుతోంది. ఎడతెరపి లేకుండా క్రికెట్ ఆడుతుండటంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 సిరీసును గెలిపించిన రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చారు. దాంతో అజింక్య రహానె తొలి టెస్టులో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. కొన్నాళ్లుగా అతడు సమయోచిత ఇన్నింగ్సులు ఆడుతున్నప్పటికీ భారీ స్కోర్లు చేయడం లేదు. దాంతో అతడికి ఇంకా అవకాశాలు ఇస్తుండటం అదృష్టమేనని గౌతీ అంటున్నాడు.
'నేనైతే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ జోడీకి ఓటేస్తాను. రాహుల్ ఇంగ్లాండ్‌లో ఓపెనింగ్ చేశాడు. కాబట్టి శుభ్‌మన్‌గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం మంచిది. ఏదేమైనా రహానె అదృష్టవంతుడు! నాయకత్వం వహిస్తుండటంతో అతడికీ జట్టులో చోటు దొరికింది. ఇది అతడికి మరో అవకాశం. దానిని అతడు అందిపుచ్చుకోవాలి' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
రెగ్యులర్ క్రికెటర్లు లేకపోవడం, కొత్త కుర్రాళ్లు రావడంతో జట్టు కూర్పు ఇబ్బందికరంగా మారింది. మయాంక్, గిల్ తిరిగి రావడంతో ఓపెనింగ్ ఎవరితో చేయించాలో అర్థం కావడం లేదు. మరోవైపు కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో సెంచరీ చేశాడు. ఇప్పుడు మిడిలార్డర్‌కు పంపించడం సరికాదు. దాంతో పుజారా, రహానె, గిల్ మిడిలార్డర్లో ఆడే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Gambhir on Ravi Shastri: శాస్త్రిపై గౌతీ విమర్శలు.. ద్రవిడ్ సమతూకం బాగుందన్న మాజీ ఓపెనర్
Also Read: Cricketer Dog Viral Video: కుక్క ఫీల్డింగ్ కేక.. ఏకంగా సచిన్ టెండూల్కరే అలా!