T20 world Cup : గ్రీన్ కార్డ్ వర్సెస్ ఆధార్ కార్డ్.. అమెరికా భారత్ క్రికెట్ మ్యాచ్ లో ఆసక్తికరమైన సన్నివేశాలు
USA vs India highlights: : భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో అమెరికాలోని ప్రవాస భారతీయులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు ప్రదర్శించిన ప్లకార్డులు మీమ్స్ కారణమయ్యాయి.
Aadhaar card vs Green card : టి20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం రాత్రి భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో చోటుచేసుకున్న అనేక పరిణామాలు ఆసక్తిని కలిగించాయి. ఈ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన భారత్, అమెరికా జట్ల అభిమానులు ప్రదర్శించిన ప్లకార్డులు పెద్ద ఎత్తున మీమ్స్ కు కారణమయ్యాయి. భారత జట్టు కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైన పలువురు క్రికెట్ అభిమానులు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. అమెరికా వంటి జట్టుపైన కూడా భారత జట్టు కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడేందుకు ఇబ్బందులు పడిన విధానాన్ని పలువురు విమర్శించారు. అదే సమయంలో భారత్, అమెరికా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో పలువురు క్రికెట్ అభిమానులు ప్రదర్శించిన ప్లకార్డులు ఆసక్తిదాయకంగా మారాయి. అమెరికా జట్టులో కెప్టెన్ మోనాంక్ పటేల్ తో సహా మరో ఆరుగురు ఆటగాళ్లు భారత సంతతికి చెందిన వాళ్లే కావడంతో.. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఎంతోమంది ఇరుజట్లు గెలవాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే గ్రీన్ కార్డ్ వెర్సెస్ ఆధార్ కార్డు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జన్మభూమి వర్సెస్ కర్మభూమి అంటూ మరికొందరు రికార్డులు ప్రదర్శించారు. రెండు జట్లలో ఏది గెలిసిన తమకు ఆనందమే అంటూ పలువురు క్రికెట్ అభిమానులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. మరో క్రికెట్ అభిమాని అమెరికా జట్టు గురించి ప్రస్తావిస్తూ.. యూఎస్ఏ ప్రపంచ కప్ జట్టులో భారతీయులు, పాకిస్థానీయులు, శ్రీలంక వాసులు, నేపాలీలు కూడా ఉన్నారని, అఖండ భారత్ కు ప్రాతినిధ్యం వహించే అమెరికా బృందాన్ని తాను చూస్తానని ఊహల్లో కూడా అనుకోలేదని స్పష్టం చేశారు. మరో క్రికెట్ అభిమాని తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ.. అమెరికా జట్టులో దాదాపు సగం మంది భారతీయులే ఉన్నారని, భారతీయులతో నడిచే జట్టు పాకిస్తాన్ ఓడించిన తర్వాత తమ వద్ద క్రికెట్ జట్టు ఉందని అమెరికాకు తెలిసిందని వెల్లడించారు.
ఇద్దరూ ఇద్దరే అన్నట్టు
అమెరికా వంటి జట్టుపై కూడా ఆశించని స్థాయిలో పరుగులు లేకపోయినా భారత గత కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీపై పలువురు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగా పరుగులు ఏమి చేయకుండానే పెవిలియన్ బాట పట్టారంటూ పలువురు చమత్కరించారు. నామమాత్రపు స్కోరును చేదించడంలో భారత జట్టు పడిన ఇబ్బందుల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ స్కోరును చెమటోడ్చి మరి భారత జట్టు చేధించిందంటూ పలువురు మీమ్స్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పెద్ద ఎత్తున మీమ్స్ కు అవకాశం కల్పించినట్లు అయింది. రెండు జట్ల మ్యాచ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలతో కూడిన మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ మ్యాచ్ లో 111 పరుగులు లక్ష్యాన్ని భారత జట్టు చివరి వరకు వెళ్లి మరి అధిగమించింది ఒకానొక దశలో లక్ష్యాన్ని చేదిస్తుందా..?అన్నట్టుగా భారత జట్టు పరిస్థితి మారిపోయింది. సూర్య కుమార్ యాదవ్, శివం దుబే తుది వరకు క్రీజులో ఉండి జట్టుకు మరో 10 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందించడం ద్వారా భారత జట్టు అభిమానులు ఒత్తిడిని తగ్గించారు. అమెరికా జట్టు కొద్దిరోజులు కిందట జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడించింది. దీంతో భారత్, అమెరికా మధ్య జరిగిన ఈ మ్యాచ్ కు మరింత హైప్ పెరిగింది. అందుకు అనుగుణంగానే అమెరికా జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడంతోపాటు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు.