Dreams meaning: మీకు నచ్చని వ్యక్తులు కలలో కనిపిస్తున్నారా? ఇది దేనికి సంకేతమో తెలుసా?
కలలో విరోధులు, శత్రువులు కనిపిస్తున్నారంటే కచ్చితంగా ఆ కలను నిర్లక్ష్యం చెయ్యొద్దని జ్యోతిషం, స్వప్న శాస్త్రం చెబుతోంది. అసలెందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందాం.
కలలో జరిగే సంఘటనలు, కనిపించే వ్యక్తులు భవిష్యత్తు గురించి వచ్చే సందేశాలని స్వప్నశాస్త్రం చెబుతోంది. చాలా సార్లు కలలు గుర్తుండవు. కానీ కొన్ని కలలు చాలా స్పష్టంగా గుర్తుంటాయి. కొన్ని సార్లు వెంటాడుతాయి కూడా. అలాంటి సందర్భాల్లో ఆ కలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడుతుంది. కలలో ప్రత్యేకంగా ఒకరు కనిపించడం వారితో మనకు కోపమో, ప్రేమో ఏదో భావావేశం కలిగి ఉండడం వంటివి మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా మనకు నచ్చని వ్యక్తులు కలలో కనిపిస్తే వీళ్లెందుకు కనిపించారో అనే ఆలోచన వేధిస్తుంటుంది. ఆ కలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. కంటికి కనిపించని, మనసుకు తోచని కారణాలేమైనా ఉన్నాయా? మన సబ్ కాన్షియస్ లో ఇంకేదైనా ఉందా? అనే అనుమానాలు వస్తుంటాయి. దీని గురించి జ్యోతిషం ఏం చెబుతోందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ద్వేషించే వ్యక్తులు కలలో కనిపిస్తే...
కలను మనకు మనం ఇచ్చుకునే సందేశంగా కూడా భావించవచ్చు. ఉదాహరణకు ద్వేషించే వ్యక్తి కలలో కనిపించడం మీ సంబంధ బాంధవ్యాల గురించి మీకు అందుతున్న సందేశంగా భావించవచ్చు. అటువంటి కలల్లో నిగూఢంగా దాగి ఉన్న అర్థాలను తెలుసుకునేందుకు భావోద్వేగాల స్థితిగతులను పరిశీలించడం అవసరం.
ఎందుకు విరోధులు కలలో కనిపిస్తారు?
పరిష్కారం కానీ వివాదాలు ఇద్దరి మధ్య ఉన్నపుడు అది పదేపదే మనసును బాధిస్తున్నపుడు కలలో విరోధులు కనిపించవచ్చు. ఇది వ్యక్తిగా మీరు మరింత ఎదగాల్సిన అవసరాన్ని గురించి మీ సబ్ కాన్షియస్ మీకు ఇచ్చే సూచన కూడా కావచ్చు.
ఒక్కోసారి విరోధులు కాకుండా ద్వేషం వ్యక్తపరిచే సన్నివేశాలు కూడా కలలో కనిపించవచ్చు. ఇలాంటి కలలను విశ్లేషించేందుకు అన్ని సంకేతాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కోసారి మీతో మీరే గొడవ పడుతున్నట్టు కూడా కల రావచ్చు. లేదా మీరు మరెవరితోనో గొడవ పడుతున్నట్టు కల రావచ్చు. ఈ కలలన్నీ కూడా మనలో మనకు తెలియకుండానే మార్చుకోవాల్సిన విషయాలేవో ఉన్నాయనేందుకు సంకేతాలని శాస్త్రం చెబుతోంది. కొన్ని సార్లు ఇలాంటి కలలు త్వరలో రాబోతున్న గొడవకు కూడా సూచన కావచ్చు.
విరోధులు లేదా మనకు నచ్చని మనుషులు కలలో కనిపించినపుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. మీ మధ్య ఉన్నది కేవలం అభిప్రాయ బేధాలా? లేక అంతకు మించిన విరోధమా అనే విషయం క్లియర్ చేసుకోవాలి. ఏర్పడిన సమస్య పరిష్కారంలో మీ పాత్ర గురించి ఆలోచించాలి. అన్ని కోణాల్లో మీ మధ్య పునరాలోచించుకుని విరోధాన్ని అంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ కల సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. విరోధం ఉన్న వారు కలలో కనిపించడాన్ని మంచి శకునంగా భావించలేము. ఇది త్వరలో మీకు ఏర్పడబోయే ఇబ్బందికర పరిణామానికి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు సమీప దూరంలో ఏర్పడగలవో అంచనా వేసుకుని అవి ఏర్పడకుండా నివారించుకోగలిగితే మంచిదనేది పండితుల సూచన. మీరు మరింత ఓపికగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ఓపికగా వ్యవహరిస్తే మీ అవసరాలు తీరవచ్చు, మరింత విజయం మీకు ప్రాప్తించవచ్చు.