Rudraksha Remedy: పెళ్లి కావట్లేదని బెంగ పెట్టుకున్నారా? ఈ రుద్రాక్షలను ధరిస్తే త్వరలోనే గుడ్ న్యూస్ వింటారట!
Rudraksha Remedy: మతపరమైన కారణాలతో పాటు, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో రుద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రుద్రాక్షల్లో కొన్ని వివాహ సమస్యలను, వైవాహిక సమస్యలను అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.
Rudraksha Remedy: అనేక కారణాల వల్ల కొందరికి పెళ్లి ఆలస్యమవుతుంది. మరికొందరికి పెళ్లయినా వైవాహిక జీవితం ఆనందంగా సాగదు. కొంతమంది వివాహ నియమాలు పాటించకుండా, సరైన ముహూర్తం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటూ భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ కారణాలన్నీ కాకుండా వైవాహిక సమస్యలకు అనేక జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. వేద జ్యోతిషశాస్త్రంలో ముందస్తు వివాహం కోసం అనేక నివారణలు సూచించారు. రుద్రాక్ష వినియోగం అత్యంత ఖచ్చితమైన, శీఘ్ర ప్రభావంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం.
గ్రహాల స్థానం- రుద్రాక్ష
ఒక అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో గురు గ్రహం అనుకూలత వివాహానికి చాలా అవసరం. అలాగే శని గ్రహానికి గురుగ్రహ ప్రభావం ఉండకూడదు. శని గ్రహం, దశ-మహాదశ, అంతర్దశ, సప్తమ శని, శని అంగారక దోషాల కారణంగా వివాహం సకాలంలో జరగదు.
శివుని ప్రతిరూపమైన రుద్రాక్ష ఆనందంతో అదృష్టాన్ని తెస్తుంది. ముందస్తు వివాహానికి మార్గం సుగమం చేస్తుంది. కానీ దానిని ధరించడానికి సరైన సమయం, విధానం ఉంది. రుద్రాక్షలు 1 నుంచి 21 ముఖాల వరకు లభిస్తాయి. అయితే వివాహానికి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి కొన్ని రుద్రాక్షలు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయి.
గౌరీ శంకర రుద్రాక్ష
గౌరీ శంకర రుద్రాక్షను.. శివ పార్వతుల ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఈ రుద్రాక్ష వివాహంలో ఆనందానికి మూలం. దీనిని ధరించడం వలన అడ్డంకులు, గ్రహ దోషాలు తొలగిపోయి త్వరగా వివాహానికి మార్గం సుగమం అవుతుంది. అయితే ఈ రుద్రాక్ష పొందడం చాలా కష్టం.
ద్విముఖ రుద్రాక్ష
రెండు ముఖాల రుద్రాక్షలు అవివాహితులకు వరం. ద్విముఖ రుద్రాక్షను ధరిస్తే వివాహ సంబంధమైన ఆటంకాలను అధిగమించవచ్చు. ఇది ముందస్తు వివాహ అవకాశాలను పెంచుతుంది. ఈ రుద్రాక్ష ధారణతో వైవాహిక జీవితంలో ఆనందం, అదృష్టం, సంపదతో పాటు శాంతిని ఇస్తుంది.
చతుర్ముఖ రుద్రాక్ష
నాలుగు ముఖాల రుద్రాక్ష వివాహంలో అడ్డంకులను తొలగిస్తుంది. ఇది ఒక వ్యక్తి తెలివితేటలను, ఏకాగ్రతను పెంచుతుంది. జాతకంలో గ్రహాల అననుకూలతల కారణంగా వివాహం ఆలస్యమవుతుంటే చతుర్ముఖ రుద్రాక్ష ధరించడం వల్ల ఆయా గ్రహాలకు శాంతి కలుగుతుంది.
షణ్ముఖ రుద్రాక్ష
ఆరు ముఖాల రుద్రాక్ష సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ రుద్రాక్ష త్వరగా పెళ్లి జరగడానికి వీలు కలిగిస్తుంది. అంతేకాకుండా వివాహ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారికి, వైవాహిక బంధం విచ్ఛిన్నం అంచున ఉన్న జంటలు షణ్ముఖ రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
సప్తముఖ రుద్రాక్ష
ఏడు ముఖాల రుద్రాక్షలను మెడలో ధరించడం ద్వారా శని, అంగారక గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇది బృహస్పతికి బలాన్ని ఇస్తుంది. బృహస్పతి బలంగా ఉంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి. ఏడు ముఖాల రుద్రాక్షను శని రుద్రాక్షిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రుద్రాక్షను శనిని ఆకర్షించడానికి కూడా ధరిస్తారు.
త్రయోదశ ముఖ రుద్రాక్ష
వివాహ సంబంధిత సమస్యలన్నీ 13 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల పరిష్కృతమవుతాయి. ఈ రుద్రాక్ష జాతకంలో ఏడవ స్థానానికి బలాన్ని ఇస్తుంది. వివాహానికి ఏడవ స్థానం బలం చాలా అవసరం.
మీరు వైవాహిక సమస్యలతో బాధపడుతుంటే, మీ కుండలి ప్రకారం సరైన నివారణ, రుద్రాక్షను ఎంచుకోవడానికి మంచి జ్యోతిష్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.