Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ
Tirumala Brahmotsavam: సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వివిధ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనం కల్పిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ..
సెప్టెంబరు 27న ధ్వజారోహణం నాడు ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ..
Tirumala Brahmotsavam 2022: ఏడుకొండల్లోని ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా కొలువైయున్న శ్రీ వేంకటేశ్వరుడు.. సప్తగిరుల్లో అడుగు పెట్టిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారటా... అందువల్లే ఇవి 'బ్రహ్మోత్సవాలు'గా ప్రసిద్ధిచెంది అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు 9 రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారు వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనం కల్పిస్తారు. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది.. ఈ ఏడాది స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగనుంది.. గరుడ వాహన సేవ రాత్రి 7 నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ టీటీడీ నిర్వహించనుంది..
రెండేళ్ల తరువాత తిరు మాడ వీధుల్లో..
కరోనా కారణంగా రెండేళ్ల తరువాత తిరు మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ వాహన సేవలు నిర్వహిస్తున్న నేపధ్యంలో విశేషంగా విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్తేక్ దర్శనంను టీటీడీ రద్దు చేసి, కేవలం ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనంను టీటీడీ పరిమితం చేసింది.. అంతే కాకుండా అర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సీనియర్ సిటిజన్స్ వంటి దర్శనాలను రద్దు చేసి కేవలం సర్వదర్శనం గుండా మాత్రమే భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్ దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టింది.. బ్రహ్మోత్సవాల సమయంలో విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా గ్యాలరీలో అన్నదానం, త్రాగునీరు,పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాటు చేసింది టీటీడీ.. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు.. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.
నేడే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం...
నేటి రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమంను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది.. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామి వారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది.. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 27వ తేదీ మంగళవారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. అటుతరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.
28వ తేదీ ఉదయం 8గంటలకు చిన్నశేషవాహనం, రాత్రి 7గంటలకు హంసవాహనం
29వ తేది ఉదయం 8గంటలకు సింహవాహనం, రాత్రి 7గంటలకు ముత్యపు పందరి వాహనం
30వ తేది ఉదయం 8గంటలకు కల్పవృక్షవాహనం, రాత్రి 7గంటలకు సర్వభూపాల వాహనం
అక్టోబర్ 1వ తేది ఉదయం 8గంటలకు మోహిని అవతారం, రాత్రి 7గంటలకు గరుడవాహనం
2వ తేది ఉదయం 8గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరధం, రాత్రి 7గంటలకు గజవాహనం
3వ తేది ఉదయం 8గంటలకు సూర్య ప్రభవాహనం, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనం
4వ తేది ఉదయం 7గంటలకు రధోత్సవం, రాత్రి 7గంటలకు ఆశ్వవాహనం
5వ తేది ఉదయం 6గంటలకు చక్రస్నానం, రాత్రి 9గంటలకు ధ్వజావరోహాణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.