vayu's in the body: శరీరంలో ఉండే ఈ పది వాయువుల గురించి తెలుసా?
మనం పీల్చుకునేది ఆక్సిజన్....విడిచిపెట్టేది కార్బన్ డై ఆక్సైడ్ అని అందరకీ తెలుసు. కానీ మన శరీరంలో మొత్తం పది వాయువులు ఉన్నాయి. రెప్పపాటు నుంచి ఆవులింత వరకూ ఏ వాయువుని ఎలా పిలుస్తారో తెలుసా?
శరీరంలో ఉండే ఈ పది వాయువుల గురించి తెలుసా?
వాయు పుత్రం వాల గాత్రం వజ్ర కాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం
వాయువుతోనే ఆయువు ఆరంభం..వాయువుతోనే ఆయువు అంతం..నడుమన గడిచేదే నరుని జీవితం. అది శ్వాసల లెక్కలు మోసిన వెంటనే సమాప్తం....ఇది ఓ సినీకవి కలం నుంచి జాలువారింది. అయితే కరోనా కాలంలో ఆక్సిజన్ కోసం అంతా పడిన తపన చూస్తే అది నిజమే అనిపించకమానదు...
ఊపిరి తీసుకోవడం మొదలు...మన శరీరం పనిచేసేందుకు కావాల్సింది వాయువే. శాస్త్రం ప్రకారం మన శరీరంలో పది వాయువులు ఉంటాయి. అవేంటంటే....
ప్రాణవాయువు
ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉండేది ప్రాణవాయువే. కరోనా సెకండ్ వేవ్ లో ప్రాణవాయువు కోసం ఎంత అల్లాడిపోయామో చూశాం. గాలి కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తుందని ఊహించలేదు. ఆక్సిజన్ కోసం పరుగులు తీశారు. సమయానికి ఆక్సిజన్ అందక ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ పూర్తిగా తెలియజేసింది కరోనా మహమ్మారి.
అపానవాయువు
తిన్న ఆహారం విసర్జించేందుకు ఉపయోగపడేదే అపాన వాయువు. పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. ఇలా తయారైన గ్యాస్ మొత్తం ఎలాగోలా బయటికి రావాలి. ఇందులో కొంతభాగాన్ని మానవ శరీరం సహజంగా పీల్చేసుకుంటుంది. సాధారణంగా అపానవాయువును ఆపుకోకూడదు. అపానవాయువు ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ వెబ్ సైట్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.
వ్యానము
శరీరం వంగడానికి కారణమయ్యేది వ్యానము. శరీరం సంకోచ, వ్యాకోచాలకు కారణమయ్యే వాయువు ఇది. అంటే ఎక్సర సైజ్ చేసేందుకు శరీరం సహకరించేలా చేసే వాయువు ఇది.
ఉదానము
శరీరంలో కామ ప్రచోదనం చేసే వాయువు ఉదానము. శరీర భాగాలు అదురేలా చేసేది కూడా ఈ వాయువే.
సమానము
జీర్ణం అయిన ఆహారం రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి, శరీరం అంతా సమానంగా ప్రసరించేలా చేస్తుంది సమాన వాయువు.
నాగము
జీర్ణాశయంలో అధిక వాయువు ఉండకుండా సహాయం చేసేది నాగము. అందరకీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే త్రేణుపు. కడుపునిండా తిన్నప్పుడు....హెవీగా అనిపించినప్పుడు ఈ వాయువు గొంతు ద్వారా బయటకు వస్తుంది....
కూర్మము
కళ్లుమూసి తెరిచేందుకు కూడా గాలి అవసరం ఉంటుందని మీకు తెలుసా..! కళ్లు మూసి తెరిచే సమయంలో అవసరమయ్యే గాలిని కూర్మము అంటారు.
కృకరము
తుమ్మే సమయంలో వచ్చే గాలి కృకరము.
దేవదత్తము
ఇంద్రియములు పనిచేసేందుకు సహకరించేది దేవదత్తము. ఇదే ఆవులింత.
ధనుంజయము
శరీరంలో ప్రాణం పోయినా దహనం అయ్యేవరకు ఉండే వాయువు ధనుంజయము. సాధారణంగా మనిషి మృతిచెందిన తర్వాత కూడా కొన్ని గంటల పాటూ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ సమయంలో వాయువు ధనుంజయము.
మొత్తంగా పంచ ప్రాణాలు ఐదు....ఉప ప్రాణాలు ఐదు....ఈ పదింటిని కలరి దశవాయువులు అంటారన్నమాట.....