Sundarakanda: నువ్వే గొప్పోడివి అని అందరూ అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండాలో తెలుసా!
Sunderkand Path: ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సందర్భంలో నువ్వు ఈ విషయంలో అద్భుతం అనే ప్రశంసలు అందుకుంటారు. అలాంటి సమయంలో ఉబ్బి తబ్బిబ్బైపోవడం కామన్..కానీ అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండాలో తెలుసా?

Sunderkand Path Benefits and Importance: నీకు నువ్వు గొప్పవాడివి అనుకోకూడదు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు..పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు కుంగిపోకూడదు.. అప్పుడే కదా ఆనందం, బాధ ఏ క్షణాన్ని అయినా సమానంగా స్వీకరించగలవు..అంతకుమించిన ఆనందకరమైన జీవితం ఏముంటుంది. ఇదే విషయం ఆచరించి చూపించాడు ఆంజనేయుడు..
బుద్ధి, బలం, పరాక్రమంలో తనకు సాటి ఎవరూ లేరు..అయినప్పటికీ ఎప్పుడూ తనంతటవాడు లేడని హనుమాన్ అనుకోలేదు. అందుకు ఉదాహరణగా సుందరకాండలో ఎన్నో సంఘటలు
సముద్రం దాటి లంకకు ఎవరు వెళతారు అనే చర్చ జరుగుతున్న సమయంలో జాంబవంతుడు చెప్పిన మాటలివి..
ఓ హనుమా నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో.. అసలు కోతులకు రాజు నువ్వే...సుగ్రీవుడితో సమానుడివి..అంతకన్నా బలవంతుడివి.. రామలక్షణ్ముడు తేజస్సు బలం ఎలాంటివో నీ తేజస్సు బలం కొంచెం కూడా తక్కువ కాదు..అలాంటివాడివి ఇలా చేతకానట్టు కూర్చుండిపోతావా? లే ..లేచి నిలబడు..నీ శక్తి తెలుసుకో.. ఈ లోకంలో ఉన్న ఏప్రాణికి కూడా నీకున్న తేజస్సు లంఘన శక్తి లేదు..నీతో సమానంగా ఎగరగలిగేవాడు ఈ లోకంలోలేడు..వానరులు పరువు ప్రతిష్టలు నిలబెట్టు అని జాంబవంతుడు చెప్పాడు. అప్పటికి లేచి నిల్చున్న హనుమాన్ ఆ మాటలకు పొంగిపోలేదు..అందరి వైపు తిరిగి వానర వృద్ధులకు నమస్కరించాడు.
నీ అంతటి వాడు లేడు అన్నప్పుడు నేను గొప్పోడిని అని కనుబొమ్మలు ఎగరేయలేదు..వానర వృద్ధులకు నమస్కరించి వినయంగా ఎలా బతకాలో నేర్పించాడు ఆంజనేయుడు.. ఆ క్షణంలో ఏమన్నాడంటే..
వాయువుతో సమానమైన బల పరాక్రమాలు కలిగినవాడిని, సూర్యుడికి అభిముఖంగా వెళ్లగల శక్తి కలిగినవాడిని, సముద్రానికి ఈవల నుంచి ఆవల అంచుని ముట్టుకోగలవాడను, అపారమైన వేగంతో సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు కొండలు పిండి చేయగలవాడిని, సముద్రం లోపలున్న భూతములు కనిపించేంత వేగంగా ప్రయాణించగలిగిన వాడిని, భూమి ఆకాశాలను ఏకం చేయగలవాడిని..నేను మీకు వాగ్ధానం చేస్తున్నాను. ఇదంతా రామచంద్రుడు ఇచ్చిన బలమే..ఆ బలంతోనే రామచంద్రుడి కార్యాన్ని సాధిస్తాను, సుగ్రీవుడి మాట నిలబెడతాను, సీతమ్మ జాడ వెతుక్కుని వస్తాను అని అందరి భరోసా ఇచ్చి సముద్రంపైకి లంఘించాడు. నువ్వు వెళ్లిన పని మంగళప్రదం కావాలని కోరుకుంటూ మేమంతా ఒంటికాలిపై నిలబడి ప్రార్థిస్తాం అని ఆంజనేయుడికి చెప్పి పంపించారు వానర వృద్ధులు.
అంతమంది వానరులు ఉన్నారన్నావ్..నువ్వు ఒక్కడివేగా వస్తే రావణుడిని ఎలా ఎదిరించగలం అని సీతమ్మ అడిగింది..
ఈ ప్రశ్నకు సమాధానంగా ఆంజనేయుడు ఏం చెప్పాడంటే...
కోట్ల వానరాలు, రామలక్ష్మణులు కూడా రాలేని ఈ ప్రదేశానికి నువ్వు మాత్రమే వచ్చావ్ అనగానే ఆ మాటలకు పొంగిపోలేదు. కష్టంలో ఉన్నవ్యక్తిలో నిరుత్సాహాన్ని పోగొట్టడం తన కర్తవ్యం అనుకున్నాడు. అందుకే ఏం చెప్పాడో తెలుసా
అమ్మా సీతమ్మా... ఏ వానరుడు రాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా..సుగ్రీవుడి దగ్గర కోట్ల వానరాలున్నాయి. ఒక్కొక్కరు పదివేల ఏనుగుల బలం కలిగినవారు. వారికి సముద్రం దాటి రావడం కష్టం కాదు. నేనే వచ్చానంటే మిగిలినవాళ్లు రాకపోవడం ఏంటమ్మా? నాతో సమానులున్నారు నా కన్నా అధికులు ఉన్నారు..నా కన్నా బలం, తేజస్సు ,బుద్ధి, పరాక్రమంలో తక్కువవాడు లేడు.. అంతఃఫురం స్త్రీల దగ్గరకు పంపించినప్పుడు అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని పంపిస్తారు.అందుకే నేను వచ్చాను. నేనే వచ్చానంటే మిగిలినవాళ్లు రాలేరా...అని భరోసా ఇచ్చాడు ఆంజనేయుడు.
ఇలా చెప్పుకుంటూ వెళితే సుందరకాండ మొత్తం ప్రతి ఘట్టమూ అద్భుతమే.. ప్రతి సన్నివేశం మీలో నిరుత్సాహాన్ని దూరం చేసి నూతన ఉత్సాహాన్ని నింపేదే...
గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న వివరాలు, ప్రవచనకర్తల సందేశం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ భక్తి, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది






















