Sri Rama Navami 2024: రాముడు ఏమయ్యాడు? లక్ష్మణుడి వల్లే సరయులో ఐక్యమయ్యాడా? అసలు ఏం జరిగింది?
సీతారామ పట్టాభిషేకం తర్వాత ఏం జరిగిందనేది చాలా మందికి తెలియదు. కొంత మంది ఉత్తర రామాయణం కథ ఆతర్వాత జరిగిందని చెబుతారు. రాముడి అవతార సమాప్తి ఎలా జరిగిందనే విషయం గురించి పెద్దగా అవగాహన లేదు.
రాముడి పేరు చెప్పగానే ఆయన పద్నాలుగు సంవత్సరాల వనవాసం, సీతాపహరణం, హనుమంతుడి సహాయంతో సీతను వెతికి పట్టుకోవడం, రామరావణ యుధ్దం తర్వాత రామ పట్టాభిషేకం వరకు నడిచిన కథ చాలా ప్రాచూర్యంలో ఉంది.
తర్వాత కథ ఏమైంది?
రామావతర సమాప్తి ఎలా జరిగిందనేది తెలిసిన వాళ్లు చాలా తక్కువ. త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుడి కుమారుడిగా రాముడు జన్మించాడు. ఇది విష్ణుమూర్తి 7వ అవతారం. సాక్షాత్తు విష్ణుమూర్తి రావణ సంహారం కోసం రాముడిగా ఈ భూమి మీద అవతరించాడనేది చాలా పురాణ కథలు చెబుతున్నాయి. సీతాదేవి ఆ శ్రీమహాలక్ష్మీ అవతారం. శ్రీరామ చంద్రుడు మర్యాద పురుషోత్తముడిగా పేరుగాంచాడు. ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఆయన జీవితం గురించి తెలిసిన వారున్నారు. కానీ ఆయన మరణానికి సంబంధించిన వివరణ ఎక్కడా కనిపించదు. రావణ సంహారార్థం పుట్టిన రాముడు కారణ జన్ముడు. లక్ష్యం పూర్తయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామావతార సమాప్తి గురించి చాలా కథలున్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
రాముడు సరయు నదిలో కలిసి పోయాడా?
సీత అగ్నీపరీక్ష ద్వారా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న తర్వాత కూడా రాముడు పట్టాభిషేకానంతరం గర్భవతిగా ఉన్న సీతను తిరిగి వదిలేశాడు. ఆమె అడవిలో వాల్మీకీ ఆశ్రమంలో కవలలకు జన్మనిచ్చి ముని బాలకులుగా వారిని పెంచి పెద్ద చేసి రాముడికి అప్పగించి భూమిలో కలిసిపోయిందనేది ఉత్తరరామాయణం చెప్పేకథ. ఆమె సమాధి తర్వాత రాముడు పూర్తిగా బాధతో కుంగిపోయాడు. ఆ బాధలోనే యముడి అంగీకారంతో గుప్తర్ ఘాట్ వద్ద సరయునదిలో జలసమాధి అయ్యాడని ఒక కథ ఉంది.
మరోకథ ఎలా ఉందంటే
ఒకసారి యముడు ఒక సన్యాసి రూపంలో అయోధ్యకు వచ్చి రాముడిని తనతో సంవాదానికి రావల్సిందిగా సవాలు చేస్తాడు. అందుకు ఒక చిన్న నియమం కూడా పెడతాడు. వారి సంవాదం జరుగుతున్న గదిలోకి ఎవ్వరూ రాకూడదు. అలా ఎవరైనా ప్రవేశిస్తే ద్వారం దగ్గర కాపలాగా ఉన్న ద్వార పాలకుడికి మరణశిక్ష విధించాలి. రాముడు అందుకు అంగీకరించి ఎవరూ రారని అలా రాకుండా సాక్ష్యాత్తూ ఈ దేశ రాజకుమారుడైన తన సోదరుడు లక్ష్మణుడే ద్వార పాలకత్వం నిర్వహిస్తాడని లక్ష్మణుడిని ఆ బాధ్యతలో పెడతాడు.
అదే సమయంలో దుర్వాంస మహర్షి రాముడిని కలవాలని వస్తాడు. లక్ష్మణుడు ఆయనను అడ్డగించి రాముడు మరో సమావేశంలో ఉన్నందున వెంటనే కలుసుకోవడం కుదరదని చెబుతాడు. ఇది దుర్వాంసుడికి చాలా కోపం తెప్పిస్తుంది. రాముడిని శపించేందుకు సిద్ధపడతాడు. ఆ సమయంలో లక్ష్మణుడు తన ప్రాణాలకు ముప్పని తెలిసినా సరే రాముడిని దుర్వాంసుడి కోపం నుంచి రక్షించేందుకు గాను రాముడి గదిలోకి అనుమతిస్తాడు. దుర్వాంసుడి ప్రవేశంతో రాముడు, యముడి మధ్య సాగుతున్న సంవాదానికి అంతరాయం కలుగుతుంది. కోపంగించుకున్న రాముడు తన ఆజ్ఙను ధిక్కిరించినందుకు గాను లక్ష్మణుడికి రాజ్య భహిష్కార శిక్ష విధిస్తాడు.
కానీ రాముడు ద్వారపాలకుడికి రాజాజ్ఞ ధిక్కరిస్తే మరణ దండన విధించాల్సి ఉంది. రాముడు మాట తప్పినవాడు కాకూడదని లక్ష్మణుడు సరయు నదిలో జలసమాధి అవుతాడు. ఇది రాముడిని పూర్తి స్థాయిలో కలచి వేస్తుంది. ఆ బాధను తట్టుకోలేక ఆయన కూడా సరయు నదిలోనే జలసమాధి అయినట్టు, తర్వాత హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, భరతుడు, శత్రుజ్ఞుడు మిగిలిన రామపరివారమంతా కూడా జలసమాధి అయినట్టుగా మరో కథ కూడా ఉంది.
అయోధ్యలో అవతరించిన రాముడు అవతార సమాప్తి సమయం వచ్చినపుడు సరయు నది అయోధ్య తీరంలో జలసమాధి తీసుకున్నారని.. అందుకే ఇక్కడ సరయు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు.
Aslo Read : శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఎలాంటి నియమాలు పాటించాలి? ప్రయోజనాలేమిటీ?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.