Sri Rama Navami 2022:తెలుగువారి అయోధ్యాపురిలో వైభవంగా రాములోరి కళ్యాణ ఏర్పాట్లు, ఈసారి స్వామివారికి చేనేత పట్టువస్త్రాలు
శ్రీరాముడు ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి రోజున జన్మించాడు. ఈ సందర్భంగా ఏటా ఈ రోజున శ్రీరామ కళ్యాణం కన్నులపండువగా నిర్వహిస్తారు. ఈ మేరకు భద్రాద్రిలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
పావన గోదావరి తీరంలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడి తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం... సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం. ఇక్కడి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు.. ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించి..తాను భద్రగిరిపై ఉన్నానని మిగిలిన భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయమని ఇందుకోసం ఓ భక్తుడు సాయంగా నిలుస్తాడని చెప్పాడు. మొదట్లో దమ్మక్క పందిరి ఏర్పాటు చేయగా..ఆ తర్వాత రామదాసు ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచీ ఏటా సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు.
Also Read: త్రిజటకు తెల్లవారుజామున వచ్చిన కల విన్నాక ఏడుపు ఆపిన సీతాదేవి, ఇంతకీ ఎవరీ త్రిజట
ఏప్రిల్ 2 నుంచి 16 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది. ఏప్రిల్ 10 న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 11 న రామయ్య పట్టాభిషేకం వైభవంగా జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా భక్తులు హాజరుకావడం లేదు...దీంతో ఈ ఏడాది భారీగా భక్తులు హాజరవుతారని అంచనా. మిథిలా స్టేడియంను సర్వాoగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు,లడ్డులకు 30 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేశారు. విద్యుత్ దీప కాంతులు, చలువ పందిళ్లు, టెంట్ లు, మంచినీరు , ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు . ఎండ తీవ్రత తట్టుకునే విధంగా కూలర్లు,ఫ్యాన్లు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఏప్రిల్ 2 నుంచి 16 వరకు నిత్యకళ్యాణాలు, 6 నుంచి 16 వరకు దర్బార్ సేవలు,6 నుంచతి 23 వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే
భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్ గణేశ్ ఆలయ ఛైర్మన్, పద్మశాలిసంఘ రాష్ట్ర కార్యదర్శి జయరాజు ఆధ్వర్యంలో కళాకారులు రాపోలు గణేశ్, కరుణాకర్, శ్రీనివాస్ మహా మరికొందరు నిష్టతో పనిచేస్తున్నారు. పసుపు, నీలం, గులాబీ రంగుల్లో రెండు కిలోల బరువుతో నేసే వస్త్రాల్నిశ్రీరామ నవమి రోజున దేవతామూర్తులకు అలంకరించనున్నారు. ఇందులో వందకు పైగా డిజైన్లను ఉపయోగిస్తున్నారు.