Spirituality : జుట్టుతో ఒళ్లంతా కప్పుకునే అమ్మవారి గురించి తెలుసా!
Akka Mahadevi Story : భక్తి ఉద్యమానికి ఆమె కొత్త ఊపునిచ్చిన రచయిత్రి. భగవంతుడినే భర్తగా భావించి అదే ధ్యానంలో మునిగితేలి... ఆ పరమేశ్వరుడిలో లీనమైన దేవత ఆమె...
Akka Mahadevi: అక్కమహాదేవి.. భగవంతుడిని నమ్మేవారికి ఈ పేరు సుపరిచితమే. ఈమె ఎవరో అందరకీ తెలియకపోయినా శ్రీశైలంలో ఈ పేరుమీద ఉన్న గుహల గురించి అందరకీ తెలుసు. విశాలమైన ఆ గుహలో అక్కమహాదేవి చాలాకాలం తపస్సు ఆచరించి ఆ పరమేశ్వరుడిలో లీనమైపోయిందని చెబుతారు.
మహాదేవుడి వరప్రసాదం
కర్ణాటక రాష్ట్రం ఉడుతడి గ్రామంలో సుమతి - నిర్మలశెట్టి దంపతులకు జన్మించింది అక్కమహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్నో పూజలు చేయగా..ఓ ఆడపిల్ల జన్మిస్తుందని వరమిచ్చాడు శంకరుడు. అందుకే సాక్షాత్తూ ఆ పార్వతీదేవే తమ ఇంట జన్మించిందని భావించి మహాదేవుడి భార్య కనుక మహాదేవి అని పేరు పెట్టారు. వారి భావనే నిజం అని నిరూపించేలా మహాదేవి నిత్యం పంచాక్షరి మంత్ర జపంలో మునిగితేలేది. అనుక్షణం పరమేశ్వర ధ్యానంలోనే ఉండేది..ఆమెకు అదే లోకంగా మారింది. ఆమె అత్యంత సౌందర్యరాశి, గుణవంతురాలు...పెరుగుతున్న వయసుతో పాటూ శివుడిపై ప్రేమ పెరగసాగింది. తన చుట్టూ చేరే పిల్లలకు కూడా శివపురాణం, శివుడి కథలు చెప్పేది.
Also Read: ఇంకా పెళ్లికాలేదా - అయితే ఇక్కడకు వెళ్లొస్తే ఓ ఇంటివారైపోతారు!
మహాదేవిని పెళ్లిచేసుకున్న మహారాజు
ఓసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు గ్రామ పర్యటనకు వెళ్లాడు. ఆ సమయంలో అందరితోపాటూ ఓ పక్కన నిల్చున్న మహాదేవిని చూసి మనసుపడ్డాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నమైఉంది. అయినప్పటికీ మహారాజు మాట ధిక్కరిస్తే తన కుటుంబానికి కష్టాలు తప్పవు. అందుకే మహారాజుని పెళ్లిచేసుకునేందుకు అంగీకరించిన మహాదేవి..మూడు షరతులు విధించింది. ఆ షరతులకు అంగీకరించి మహారాజు వివాహం చేసుకున్నాడు. ఆమె ఎప్పుడూ శంకరుడి ధ్యానంలోనే ఉండేది. ఆమె కోసం ఎదురు చూసి చూసి మహారాజు అక్కమహాదేవి షరతులను అతిక్రమించాడు. రాజమందిరం నుంచి వెళ్లిపోతున్న అక్కమహాదేవిని...ఆ వస్త్రాలు, నగలు అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్లు అని మహారాజు ఆజ్ఞాపించడంతో ఆమె నిండుసభలో వస్త్రాలు, నగలు విడిచి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఎంతమంది చెప్పినా మళ్లీ ఆమె దుస్తులు వేసుకునేందుకు నిరాకరించింది. అలా తన కేశాలతో శరీరాన్ని కప్పేసుకుంది అక్కమహాదేవి.
ధ్యానంలో అక్కమహాదేవి
కట్టుబట్టలతో రాజమందిరం నుంచి వచ్చేసిన అక్కమహాదేవి కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్కు చేరుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం చేరుకుంది. అప్పట్లో మల్లికార్జునుడి సన్నిధి చేరుకోవడం అంత సులభం కాదు. దట్టమైన అడవి, క్రూరమృగాలు, దోపిడీ దొంగల దాడులతో ఆ ప్రాంతం భయంకరంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒంటరి మహిళ ప్రయాణం చేసి మల్లన్న సన్నిధికి చేరుకుని...ఓ గుహలో కూర్చుని తపస్సు సాగించింది. కొన్నేళ్ల తర్వాత ఆ మల్లికార్జునిలో ఐక్యమైపోయింది. ఆమె విగ్రహము ఇప్పటికి మల్లికార్జుని గుడిలో ఉన్న మర్రిచెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది.
Also Read: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం, రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చిందో తెలుసా!
మహా రచయిత్రి కూడా
అక్కమహాదేవి మహాభక్తురాలు మాత్రమే కాదు..మంచి రచయిత్రి కూడా. కన్నడలో ఆమె శివుడిపై 400లకు పైగా వచనాలు రాసింది. ప్రతి వచనంలోనూ ‘చెన్న మల్లికార్జునా!’ అనే మకుటం కనిపించడంతో అవన్నీ అక్కమహాదేవి రాసినవే అంటారు. ప్రతి వచనంలోనూ శివుడిపై ఆమెకు ఉండే ఆరాధన, ప్రకృతిపై ప్రేమ, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం కనిపిస్తాయి. అక్కమహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువదించారు.