Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే జీవితకాలానికి సరిపడా పుణ్యఫలం దక్కుతుందని, ఆర్థికసమస్యలుండవని భక్తుల విశ్వాసం.
Nirjala Ekadashi 2023: సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. అధికమాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుపుకుని 26 వస్తాయి. తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే. మరి జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ప్రత్యేకత ఏంటి...ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో పుణ్యఫలం ఈ ఒక్కరోజే దక్కుతుందని ఎందకంటారో చూద్దాం.
4 పురుషార్థాలను జయించేందుకే ఉపవాసం
ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను జయించేందుకు ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించాలని మహర్షి వేదవ్యాసుడు పాండవులకు చెప్పాడు. వెంటనే స్పందించిన భీముడు వినయంతో వ్యాసుడికి నమస్కరిస్తూ.. "స్వామి మీరు ప్రతి పదిహేను రోజులకోసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. నేను ఒక్క రోజు కూడా తినకుండా ఉండనలేను. మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా ఆచరించగలను" అని భీముడు అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు... "నువ్వు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందన్నాడు. అప్పటి నుంచి ఏటా నిర్జల ఏకాదశి రోజు మాత్రమే భీముడు ఉపవాసం ఉండటంతో ఈ ఏకాదశిని భీమసేన ఏకాదశి అనికూడా అంటారు.
Also Read: మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి
చుక్క నీరుకూడా తీసుకోరు
ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి ఈ ఏడాది మే 31న వచ్చింది. ఈ రోజు ఉపవాసం చేయాలి, నేలపైనే నిద్రించాలి, మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పూజచేయాలి. అష్టాక్షరి మంత్రం "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టడం, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
Also Read:గర్భాదానం (First Night) ఎందుకు జరిపిస్తారు, మంచి ముహూర్తంలో జరగకపోతే ఏమవుతుంది!
అక్షయ తృతీయ కంటే ప్రాధాన్యత ఉన్న రోజు
నిర్జల ఏకాదశికి అక్షయ తృతీయ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెబుతారు పండితులు. ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారో వారికి సకల సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు భూ, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసివస్తుందని, కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని విశ్వాసం. ఏకాదశిరోజు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు జల దానం చేసినా, అన్న దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా శుభప్రదంగా చెబుతారు