Lord Shiva: శివుడు పులిచర్మంపైనే ఎందుకు కూర్చుంటాడు, మెడలో పాము ఎందుకుంటుంది
త్రిమూర్తులలో శివుడు ఒకడు. అన్నింటిని తనలో లయం చేసుకుంటాడు కాబట్టే లయకారుడు అంటారు. చేతిలో ఢమరుకం మొదలు ధరించే పులిచర్మం వరకూ ప్రతిదాని వెనుక ఆంతర్యం ఉంటుందంటారు. ఇంతకీ పులిచర్మమే ఎందుకు ధరిస్తాడు.
పరమేశ్వరుడు పులి చర్మంపై ధ్యాన ముగ్ధుడై కూర్చుంటాడు. అసలు సృష్టిలో ఇన్ని జంతువులు ఉండగా పులి చర్మంపైనే ఎందుకు...భోళా శంకరుడు ఏం చేసినా అందులో ఆంతర్యం ఉండనే ఉంటుంది కదా అంటారు పండితులు. వాస్తవానికి పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది.
- శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక
- ఢమరుకం శబ్దం బ్రహ్మ స్వరూపం
- శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక
- దేహంపై ఉన్నసర్పాలు భగవంతుని జీవాత్మలు
- ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని అర్థం
- మృగవాంఛకు దూరంగా ఉండమని చెబుతూ పులిచర్మంపై కూర్చుంటాడు
- భస్మం పరిశుద్ధతకు సూచన
- నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక
Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే
వీటిలో ముఖ్యంగా పులిచర్మాన్ని ఎందుకు ఆసనంగా చేసుకున్నాడు అనే దానిపై శివపురాణంలో ఓ కథ చెబుతారు.. అదేంటంటే...శంకరుడు సర్వసంగ పరిత్యాగి. దిగంబరుడిగా అరణ్యాలు, శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజు ఆ మార్గంలో వెళుతున్న శివుడినిని చూసిన మునికాంతలు.. ఆ తేజస్సుకి,సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయారు. నిత్యం ఆయన్ను చూడాలనే కాంక్ష మునికాంతల్లో పెరిగింది. గృహంలో నిర్వహించాల్సిన దైవ కార్యాలు, నిత్యకృత్యాలు కూడా శివుడుని తలుచుకుంటూనే చేయసాగారు. తమ భార్యల్లో ఎప్పుడేలేని ఈ మార్పునకు కారణం ఏంటా అని ఆలోచనలో పడిన మునులకు పరమేశ్వరుడిని చూడగానే సమాధానం దొరికింది.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
తమ భార్యల దృష్టి మరిల్చాడన్న కోపం తప్ప..ఆ దిగంబరుడే సదాశివుడని మరిచిపోయి సంహరించే ఆలచోన చేశారు. తాము స్వయంగా హింసకు పాల్పడలేరు కాబట్టి.. తమ తపోశక్తితో ఓ పులిని సృష్టించారు. నిత్యం దిగంబరుడు నడిచి వెళ్లే దారిలో ఓ గుంతను తవ్వి అందులో పులిని ప్రవేశపెట్టారు. స్వామి ఆ గుంత వరకూ రాగానే తాము సృష్టించిన పులిని ఉపిగొల్పారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా మరి ఆయన ఆజ్ఞ లేకుండా మునుల శక్తితో ప్రాణం పోసుకున్న ఆ క్రూరమృగం ఏం చేయగలదు. అయితే తనపై ఎగిరిన పులిని సంహరించిన మహాదేవుడు ... మునుల చర్య వెనుకున్న ఉద్దేశం గ్రహించి పులితోలుని తన దిగంబర శరీరానికి కప్పుకున్నాడు. పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది. అలాంటి పులి కూడా లయకారుడైన పరమేశుని ఎదుట నిలవలేదని, కాల స్వరూపుని ఎదుట నిలబడ గలది ఏదీ లేదని చెప్పడమే ఇందులో ఉద్దేశ్యం.