Kondagattu Hanuman Jayanti : కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతోత్సవాలు, భారీగా తరలివస్తున్న భక్తులు
Kondagattu Hanuman Jayanti : కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Kondagattu Hanuman Jayanti : జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇది ఫెవరేట్ టెంపుల్. 2009 ఎన్నికల సమయంలో షార్ట్ సర్క్యూట్ నుంచి అంజన్న కాపాడానికి ఆయన నమ్మకం. కరోనా తగ్గడంతో ఈసారి కొండగట్టులో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చిన్న జయంతి పేరుతో నిర్వహించే ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించలేకపోవడంతో ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హనుమాన్ దీక్ష తీసుకుని దర్శనానికి దాదాపు 200 కిలోమీటర్ల నుంచి కాలినడకన భక్తులు వస్తున్నారు.
3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
ఈ సారి భారీ స్థాయిలో భక్తులు మాల వీరమణ చేయనున్నారని ఆలయ నిర్వహకులు చెబుతున్నారు. సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉత్సవాలకు భారీగా భక్తులు రావడంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశ్ తెలిపారు. భక్తుల కోసం వసతి సౌకర్యాలతో పాటు ట్రాఫిక్ మళ్లించేందుకు బారికేడ్లు ఏర్పాటుచేశారు. వేసవి కావడంతో మంచినీరు సౌకర్యం అడుగడుగునా ఏర్పాటుచేశారు. 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 20 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు ఉత్సవాల్లో భద్రత పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాలు ప్రారంభం కావటంతో హనుమాన్ దీక్షా పరులు కొండపైకి చేరుకుంటున్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఐదు రోజుల పాటు వేడుకలు
ఈ నెల 18 వరకు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 16న చిన్న హనుమన్ జయంతి కాగా, ఐదు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు కొండగట్టుకు తరలివస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రధానాలయం ఆవరణతోపాటు ఖాళీ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేశారు. టికెట్ కౌంటర్లు, దర్శనం క్యూ లైన్లు, బారికేడ్లను ఏర్పాటుచేశారు. మాల విరమణ మండపం ఎదుట భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆరు సెల్లార్లు సిద్ధంచేసారు. వీఐపీల దర్శనాల కోసం ఆలయ వెనక ద్వారం నుంచి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేశారు. పది జనరేటర్లను సిద్ధంగా ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు. వై జంక్షన్ నుంచి నాచుపెల్లి మార్గంలోని బొజ్జపోతన్న వరకు ఎల్‌ఈడీ లైట్లు, 8 లక్షలు ఖర్చు పెట్టి ఆలయం చుట్టూ అద్దె ప్రాతిపాదికన సోలార్ లైట్లు అమర్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు జయంతులు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతిని, వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ పెద్ద జయంతిని నిర్వహిస్తారు.