Navaratri Day 10: నవరాత్రి ఉత్సవాల్లో పదో రోజు శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 01 పదో రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో దర్శనమిస్తోంది. ఈ రోజు విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

Durgastami 2025: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చే దుర్గాదేవి...బాలా త్రిపురసుందరి, గాయత్రి , అన్నపూర్ణ, కాత్యాయనీ, మహాలక్ష్మి , లలితా దేవి, మహా చండీదేవి, మహాసరస్వతి, దుర్గమ్మగానే దర్శనమిచ్చిన అమ్మవారు.. పదో రోజు శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో దర్శనమిస్తోంది.
మహర్నవమి రోజు అపరాజితగా పూజిస్తారు. మహిషాసురమర్దిని (Mahishasura Mardhini) అలంకాంలో దుర్గమ్మ సింహవాహినిగా పది చేతుల్లో ఆయుధాలు ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు మహిషాసురమర్దినికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారిని పూజిస్తే భయాలు తొలగి శత్రువులపై విజయం సాధిస్తారని విశ్వాసం. ఈ రోజు అమ్మవారికి పాయసం, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.
మహిషాసురుడు విధ్వంసం సృష్టించే సమయంలో దేవతలంతా తమ శక్తులను కలగలపిదుర్గను సృష్టించారు.
శివుని తేజస్సుతో ముఖం..
విష్ణువు తీవ్రతతో బాహువులు..
బ్రహ్మతేజస్సుతో పాదాలు..
యముడి తేజస్సుతో శిరోజాలు..
చంద్రుని తేజస్సుతో వక్షస్థలం..
ఇంద్రుని వైభవంతో నడుము..
వరుణుడి తేజస్సుతో తొడలు..
సూర్యుడి తేజస్సుతో పాదాల వేళ్లు..
ప్రజాపతి తేజస్సుతో దంతాలు..
అగ్ని తేజస్సుతో కళ్ళు..
సాయంత్రం ప్రకాశంతో కనుబొమ్మలు
గాలి నుంచి చెవులు..
ఇతర దేవతల తీవ్రతతో మిగిలిన శరీర భాగాలు ఏర్పడ్డాయి.
దేవతకు ప్రాణం పోసారు కానీ..మరి మహిషాసురుడిని అంతం చేసేందుకు అపారమైన శక్తి అవసరం కదా అని ఆలోచించారు. అలా
శివుడు త్రిశూలం
విష్ణువు సుదర్శన చక్రం
హనుమంతుడు గద
శ్రీరాముడు ధనుస్సు
అగ్ని- వరుణుడు - ప్రజాపతి సహా మిగిలిన దేవతలంతా తమ ఆయుధాల శక్తిని ఆమెకు ప్రసాదించారు
ఆ ఆయుధాలు తీసుకుని సింహవాహనాన్ని అధిరోహించిన అమ్మవారు మహిషాసురుడిని సంహరించింది.
అమ్మవారికి తన, పర అనే భేదభావం లేదు
ఆమెకు నాశనం లేదు..
నిత్య స్వరూపిణి
మృత్యువును నశింపచేసే ముక్తేశ్వరి
తాను చేసిన మేలుకి బదులుడగని తల్లి
మంత్రాలు, యంత్రాలు , అన్ని తంత్రాలు ఆమెనే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉంటే సాధ్యంకానిది ఉండదు
‘నదీనాం సాగరోగతిః’
ఎక్కడినుంచో నదులన్నీ సముద్రంలో కలసినట్టు ..మంత్ర, తంత్ర,యంత్రాలన్నీ చివరకు జగన్మాతలోనే చేరుతాయి. ఆ జగన్మాతే మహిషాసుర మర్దిని.
అమ్మవారి ఉపాసకులు కుండలినీ శక్తితో సాధన చేస్తారు. 9 రోజులు 9 అలాంకారాల్లో అమ్మవారిని పూజిస్తారు. ఈ ఏడాది ఒకే తిథి రెండు రోజులు రావడంతో పది రోజులు వచ్చాయి. అందుకే ఏటా తొమ్మిదో రోజు మహిషాసురమర్ధనిగా కనిపించే అమ్మవారు ఈ ఏడాది పదో రోజు ఈ అలంకారంలో దర్శనమిచ్చింది. నవరాత్రుల ఆరంభంలో కన్యలకు పూజ చేయలేకపోయినవారు..చివరి మూడు రోజుల్లో చిన్నారులను అలంకరించి పూజ చేసి వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"
సకల భయాలను తొలగించి సంపదను ఇచ్చే శక్తి స్వరూపిణి అండ లేకుండా.. పరమేశ్వరుడు కూడా తన విధులను నిర్వర్తించలేడు. శివుని శక్తి రూపమే దుర్గ అని స్వయంగా ఆదిశంకరాచార్యులు తన అమృతవాక్కులో చెప్పారు.
భూమినీ ప్రజలను హింసించేవారిని, లోక కంటకులైన రాక్షసులని, దుర్మార్గంతో భూదేవికి భారమైన వాళ్ళను మట్టుపెట్టే మహాశక్తి జగన్మాత.. ఆ జగన్మాతే ‘మహిషాసురమర్దిని’
శ్లోకం
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!






















