తేనెటీగలు పూలను కనుగొన్న తర్వాత, మైనపు దిమ్మపై నిల్చుని తమ పొట్టను ఊపుతూ చేసే నృత్యం ఇది. ఇది 8 ఆకారంలో తిరుగుతూ ఇతర తేనెటీగలకు సమాచారం అందిస్తుంది.
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
Waggle Dance: తేనెటీగలు డాన్స్ చేస్తూ దారిచూపిస్తాయని మీకు తెలుసా? మాట్లాడకుండానే ప్రకృతి నేర్పించే పాఠం ఏంటి? దీనివెనుకున్న ఆధ్యాత్మిక సందేశం ఏంటి? తెలుసుకోండి

- తేనెటీగలు 'వాగిల్ డ్యాన్స్'తో ఆహార స్థానం, దూరం తెలియజేస్తాయి.
- నృత్య కోణం సూర్యుని దిశను, వ్యవధి దూరాన్ని స్పష్టంగా సూచిస్తుంది.
- ఇది స్వార్థరహిత సేవ, సమష్టి జీవన విలువలకు గొప్ప ఉదాహరణ.
తేనెటీగల వాగిల్ డాన్స్ - ప్రకృతి నేర్పించే ఆధ్యాత్మిక పాఠం ఇది. ప్రకృతి ఓ గొప్ప గురువు...నోట మాటలు లేకుండానే జీవిత సత్యాలు బోధిస్తుంది. చిన్న కీటకం శరీర కదలికల ద్వారా దూరం, దిశ అన్నింటినీ చెప్పగలగడం కేవలం శాస్త్రం కాదు..అది సృష్టిలోతైన జ్ఞానం.
తేనెపట్టులో ఉన్న తేనెటీగ దూరంగా ఉన్న పూలను కనుగొని తిరిగి వస్తుంది. అప్పుడు అది ఓ మైనపు దిమ్మపై నిల్చుని విచిత్రమైన నృత్యం చేస్తుంది. సూటిగా ముందుకు వెళుతూ..తన పొట్టను ఓ వైపు నుంచి మరోవైపు వేగంగా ఊపుతుంది..దీన్నే వాగిల్ రన్ అంటారు. ఆ తర్వాత ఎడమవైపు లేదా కుడివైపు సెమీ-సర్కిల్ లో తిరిగి మళ్లీ అదే దార్లో నడుస్తుంది. ఇలా 8 ఆకారంలో తిరుగుతూ నృత్యం చేస్తుంది. ఎంతదూరంలో ఆహారం ఉందో కూడా తమ డాన్స్ తో కమ్యూనికేట్ చేస్తాయి. ఉదాహరణకు ఒక సెకెను = ఒక కిలోమీటర్ అని సందేశం ఇస్తాయి. వాగిల్ రన్ ఎంతసేపు ఉంటే ఆహారం అంతదూరంలో ఉందని అర్థం.
తేనెటీగ నిలువు రేఖ పట్ల ఏ కోణంలో వాగిల్ చేస్తుందో అది సూర్యుని దిశపట్ల ఆహారం ఉన్న కోణాన్ని సూచిస్తుంది. నేరుగా పైకి వాగిల్ చేస్తే సూర్యుడి వైపు, కిందకి డాన్స్ చేస్తే వ్యతిరేకదిశలో ఉన్నట్టు. దూరం మాత్రం వాగిల్ రన్ వ్యవధిలో తెలుస్తుంది. ఆహారం నాణ్యత ఎక్కువగా ఉంటే నృత్యం మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఇది కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు సమష్టి జీవనానికి గొప్ప ఉదారహణ. ఓ తేనెటీగ తాను కనుగొన్నది తనకోసం మాత్రమే ఉంచుకోదు..తన శక్తిని వినియోగించి తన శరీరంతో నృత్యం చేసి మొత్తం కాలనీకి సమాచారం అందిస్తుంది. స్వార్థం లేని ఈ సేవ, సహకారం ఇవన్న జీవిత పాఠాలు.
ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే...
స్వార్థరహిత సేవ
తేనెటీగలు తాను కనుగొన్న పూలను తనకు మాత్రమే ఉంచుకోదు. తన శక్తిని, సమయాన్ని వినియోగించి తన శరీరంతో నృత్యం చేసి ఇతరులకు మార్గం చూపిస్తుంది. ఇది నిజమైన సేవా భావన. మనిషి జీవితంలో కూడా నిజమైన ఆనందం స్వార్థంలో కాదు..ఇతరులకు ఉపయోగపడడంలో ఉంటుంది. ఒకరి జ్ఞానం, అనుభవం మరొకరికి దారి చూపిస్తేనే సమాజం ముందుకు వెళుతుంది
సమష్టి చైతన్యం
తేనెటీగలు...వ్యక్తి అనే భావనకు దూరంగా ఉంటాయ్.. ఓ టీగ చేసే నృత్యం మొత్తం సమూహం మనుగడకు సంబంధించినది. ఇక్కడ నేను అనే భావన లేకుండా మనం అని మిగులుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మనిషి కూడా ఈ భావన నేర్చుకోవాలి, వ్యక్తిగత గెలుపు కన్నా సమూహ శ్రేయస్సు ముఖ్యం. పరస్పర సహకారంతో జీవించడమే నిజమైన ధర్మం
మాటలు లేని జ్ఞానం
తేనెటీగలకు భాష లేదు..గ్రంధాలు లేవు..అయినా సూర్యుడి స్థానాన్ని, దూరాన్ని, దిశను కచ్చితంగా చెబుతాయి. ఇది అంతర్ జ్ఞానం శక్తిని చూపిస్తుంది. మనిషి కూడా బయటి శబ్దాలు, వాదనలు మించి లోపలున్న నిశ్శబ్ధ సత్యాన్ని వినగలగాలి. నిజమైన అవగాహన మాటల్లో కాదు అనుభవంలో ఉండాలి
విశ్వ క్రమం పట్ల నమ్మకం
తేనెటీగ సూర్యుని కదలికను , గురుత్వాకర్షణను, కాలాన్ని లెక్కపెట్టి నృత్యం చేస్తుంది. ఇది సృష్టిలో లయను, క్రమాన్ని గమనించడం. ప్రకృతి ఎప్పుడూ యాదృచ్ఛికం కాదు. ప్రతి జీవికి, ప్రతి కదలికకు ఓ అర్థం ఉంది. మనం కూడా జీవితంలో సవాళ్లను ఈ క్రమంలో భాగంగా చూస్తే భయం తగ్గి సమతుల్యత ఏర్పడుతుంది
తేనెటీగలు చేసే నృత్యం ఏకత్వాన్ని గుర్తు చేస్తుంది. తేనెటీగ, పూలు, సూర్యుడు, గాలి..అన్నీ ఒకే సృష్టికి సంబంధించినవి. ఒకదాని ఉనికి మరోదానిపై ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా ప్రకృతి నుంచి వేరు కాదు...ప్రకృతిని గౌరవించి సామరస్యంగా జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత. జీవితం ఓ సమష్టి యాత్రం. ఒకరి వెలుగు మరొకరికి దారి చూపాలి. స్వార్థం విడిచి సేవ చేయాలి. మాటల్లో మించి నిశ్శబ్దంలో జ్ఞానాన్ని వినాలి. ప్రకృతి ప్రతి రోజూ పాఠాలు చెబుతుంది..మనం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి అంతే..
Frequently Asked Questions
తేనెటీగల వాగిల్ డాన్స్ అంటే ఏమిటి?
వాగిల్ డాన్స్ ద్వారా తేనెటీగలు ఎలాంటి సమాచారాన్ని పంచుకుంటాయి?
సూర్యుని స్థానాన్ని బట్టి ఆహారం ఉన్న దిశను, నృత్య వ్యవధిని బట్టి దూరాన్ని, నృత్య ఉత్సాహాన్ని బట్టి ఆహారం నాణ్యతను సూచిస్తుంది.
తేనెటీగల వాగిల్ డాన్స్ నుండి మనుషులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి?
స్వార్థరహిత సేవ, సమష్టి చైతన్యం, మాటలు లేని జ్ఞానం, విశ్వ క్రమం పట్ల నమ్మకం, మరియు ఏకత్వం వంటి విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















