Bathukamma 2022: ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకంటారు, బతుకమ్మలకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి
Bathukamma 2022: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునేే బతుకమ్మ పండుగలో ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారంటే...
![Bathukamma 2022: ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకంటారు, బతుకమ్మలకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి Bathukamma 2022: Food and Culture in batukamma each of these 9 days in Telangana Bathukamma 2022: ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకంటారు, బతుకమ్మలకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/f57e7669ec621607892a9e552cc2583d1663658370360217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bathukamma 2022: బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ జరగనున్నాయి. మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపుల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. తొమ్మిది రోజులు ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుని కన్నులపండువగా పూలపండుగ జరుపుకుంటారు.బతుకమ్మలు చేసి ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ ఆడిపాడతారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే...
1.ఎంగిలి పూల బతుకమ్మ
మహాలయ అమావాస్య రోజున అంటే.. భాద్రపదమాసం చివరి రోజు లేదా ఆశ్వయుజమాసం ముందురోజు మొదలవుతుంది. బతుకమ్మను పేర్చేటప్పుడు ఆ పూల కాడలను చేతులతో తుంచి పెడతారు. కత్తితో కట్ చేసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు. అప్పట్లో కొందరు మహిళలు నోటితో కొరికి బతుకమ్మ పేర్చడం వల్ల అప్పటి నుంచి అమావాస్య రోజు ఆడే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతారు. మొదటి రోజు బతుకమ్మ పేర్చడానికి ముందు రోజు రాత్రే పువ్వులు తీసుకొస్తారని.. ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరువచ్చినట్లు ఇంకొందరు చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత బతుకమ్మ పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందంటారు. మొదటి రోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
Also Read: ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ప్రకృతిని ఆటపాటలతో పూజించే 'బతుకమ్మ' వెనుక ఎన్ని కథలో!
2.అటుకుల బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అటుకుల బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అటుకులను ఈ రోజు వాయనంగా ఇస్తారు.
3.ముద్దపప్పు బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ విదియ రోజు బతుకమ్మకి ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు
4.నానే బియ్యం బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
5.అట్ల బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు
6.అలిగిన బతుకమ్మ
ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించరు
7.వేపకాయల బతుకమ్మ
ఆశ్వయుజ షష్టి రోజు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు
8.వెన్నముద్దల బతుకమ్మ
ఆశ్వయుజ సప్తమి రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
9.సద్దుల బతుకమ్మ
ఆశ్వయుజ అష్టమి ..ఇదే రోజు దుర్గాష్టమి. ఈ రోజు ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
చివరి రోజు సాయంత్రం బతుకమ్మని పేర్చి ఆటపాటల అనంతరం బతుకమ్మని తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా వెళతారు. అందంగా అలంకరించుకున్న మహిళలు, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ బతుకమ్మ పాటలు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్నాక పాటలు పాడుతూ బతుకమ్మలను నీటిలో విడిచిపెడతారు. ఆ తర్వాత ప్రసాదం బంధుమిత్రులకు పంచిపెట్టి తాంబూలం వేసుకుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)