Amarnath Yatra 2024: జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ఎలా రిజిస్టర్ అవ్వాలంటే?
Amarnath Yatra 2024: ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుండగా.. యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. యాత్రికులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Amarnath Yatra Registration Started: పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ఆదివారం ప్రకటించింది. దాదాపు 52 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఆగస్ట్ 19తో ముగుస్తుంది. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం (ఏప్రిల్ 15) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. యాత్రికులు వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్, వాట్పాస్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆలయ బోర్డు వివరించింది. దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో 3,800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని ఏటా భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. యాత్రికులు www.jaksasb.nic.in సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ రిజిస్ట్రేషన్ చెయ్యొచ్చు. అనంత్ నాగ్ జిల్లా పహల్లామ్, గండర్ బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర సాగుతుంది. 13 నుంచి 70 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ దేవస్థానం బోర్డు అంచనా వేస్తోంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
భారీ భద్రత
జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (SDRF) సభ్యులు.. అమర్నాథ్ యాత్ర 2024 భద్రతను పర్యవేక్షిస్తారు. ఇందుకోసం వీరు ప్రత్యేక శిక్షణ పొందుతారు. అమర్నాథ్ ఆలయానికి వెళ్లే మార్గాల్లో దళాలు భారీగా మోహరిస్తాయి. భక్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా బృందాలు చర్యలు చేపడతాయని యాత్ర నిర్వాహకులు తెలిపారు.
ఆ ఆలయాల సందర్శనకు రిజిస్ట్రేషన్
అలాగే, కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈసారి చార్ ధామ్ యాత ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. యాత్రికులకు ప్రయాణ ప్రణాళికలు సులభతరం చేసేలా ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నెంబర్, చిరునామా జత చేయాలి. పర్యాటక శాఖ వెబ్ సైట్ registrationandtouristcare.uk.gov.in కు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే, వాట్సాప్ నెంబర్ 8394833833 నెంబర్ కు యాత్ర అని రాసి సందేశం పంపించడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో పేర్ల నమోదుకు అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 01351364 కు కాల్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కాగా, గతేడాది 74 లక్షల మంది చార్ ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకోగా.. 56 లక్షల మంది సందర్శించారు. ఈసారి కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉండొచ్చని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుందని తెలిపింది.
Also Read: Iran Israel War: ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, ఇండియాలో పెట్రోల్ ధరల బాదుడు!