AAP With BRS : కేసీఆర్- కేజ్రీవాల్ కూటమి కడతారా ? ఆప్ నేతల ప్రకటనలు దేనికి సంకేతం ?
జాతీయ స్థాయిలో కేసీఆర్, కేజ్రీవాల్ కలిసి రాజకీయాలు చేస్తారా? ఆప్ నేతల వరుస తెలంగాణ టూర్లు దేని కోసం ?
AAP With BRS : ఆమ్ ఆద్మీ పార్టీకి.. భారత రాష్ట్ర సమితికి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పంజాబ్ నుంచి ఆప్ నేతలు హైదరాబాద్ కు వరుస కడుతున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హైదరాబాద్ వచ్చి వెళ్లిన వారానికే ఓ ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చింది. నిజామాబాద్ లో పర్యటించి కేసీఆర్ పాలనా తీరుపై ప్రసంసలు గుప్పించింది. కేసీఆర్, కేజ్రీవాల్లతోనే దేశంలో రైతురాజ్యం సాధ్యమవుతుందని ఆ బృందానికి నాయకత్వం వహించిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రకటించేశారు. సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు అందరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎదిగేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం !
కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా మోదీ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తూ ఓటు బ్యాంక్ పెంచుకుంటూ పోతోంది. ఇటీవల గుజరాత్ లో సాధించిన సీట్లు, ఓట్లతో ఆ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికార పార్టీ. గుజరాత్ లోనూ ఘనంగా ఉనికి చాటింది. ముందు ముందు ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఆమ్ ఆద్మీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయంలో పెద్దగా ఆసక్తి చూపదు. పైగా కేజ్రీవాల్ దేశ్ కీ నేత అవ్వాలనుకుంటున్నారు.
కేసీఆర్ ది కూడా అదే ప్రయత్నం !
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కూడా.. దేశ్ కీ నేత అవ్వాలనుకుంటున్నారు. అందుకే అత్యంత సాహసం అయినప్పటికీ తన పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెట్టేశారు. తన పార్టీకి జాతీయ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కలసి వచ్చే పార్టీలతో కలిసి పోీట చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే.. మహారాష్ట్ర , కర్ణాటక, తమిళనాడు శివారు ప్రాంతాలతో పాటు ఏపీలోనూా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉత్తరాదిలో అడుగు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. కేసీఆర్ లక్ష్యం కూడా దేశ్ కీ నేత అవడమే.
ఇద్దరి లక్ష్యం ఒకటే మరి కలవడం సాధ్యమేనా ?
అటు కేజ్రీవాల్.. ఇటు కేసీఆర్ లక్ష్యం దేశ్ కీ నేత కావడమే. అలాంటప్పుడు ఇద్దరూ కలిసి పని చేయడానికి అవకాశం ఉంటుందా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అయితే ముందుగా బీజేపీని కలసికట్టుగా ఓడిస్తే ఆ తర్వాత నాయకుడు ఎవరు అన్నది పరిస్థితిని బట్టి తేల్చుకోవచ్చన్న అవగాహనకు వస్తే మాత్రం ఈ ఇద్దరూ కలిసే అవకాశాలు ఉంటాయి. కేజ్రీవాల్ సహజంగా ఉత్తరాదిన ఎ్కకువ పాపులర్. కేసీఆర్ దక్షిణాదిన పాపులర్. ఇద్దరూ ఇలా ఒకరు ఉత్తరాదిన.. మరొకరు దక్షిణం చూసుకుని సంచనం సృష్టిస్తే.. రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఏదైనా జరగొచ్చు. స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే రెండు పార్టీల నేతలూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అందుకే కొట్టి పారేయలేం.