Congress Presidential Elections : హైదరాబాద్ వచ్చిన శశిథరూర్‌కు షాకిచ్చిన రేవంత్ - ఆనాటి గొడవలో రివెంజ్ తీర్చుకున్నట్లేనా !?
హైదరాబాద్ వచ్చిన శశిథరూర్‌ను కలిసేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ నిరాకరించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు హైదరాబాద్‌లో కనీస మద్దతు లభించలేదు.
Congress Presidential Elections : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నేత శశిథరూర్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. తెలంగాణలో ఉన్న ఏఐసీసీ ప్రతినిధుల నుంచి మద్దతు పొందడానికి ఆయన వచ్చారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కొంత మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. హోటల్‌కు వెళ్లిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడాలో తెలియక ఖాళీగా ఉండిపోయారు. తనకు మద్దతుగా గాంధీభవన్‌లో సభ ఏర్పాటు చేయాలని.. తాను కలిసేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి శశిథరూర్ ఫోన్ చేశారు. అయితే తన సమీప బంధువు ఒకరు చనిపోయినందున తాను కలిసే అవకాశం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ విషయాన్ని శశిథరూర్ సోషల్ మీడియాలో చెప్పారు. రేవంత్ రెడ్డి సమీప బంధువు చనిపోవడంపై సంతాపం వ్యక్తం చేశారు.
My sincere condolences to my colleague @revanth_anumula on the sudden loss of a close relative. We will meet another time but I convey my best wishes to him & his team at @INCTelangana
— Shashi Tharoor (@ShashiTharoor) October 3, 2022
అయితే కాసేపటికే రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత్ జోడో యాత్రపై మాట్లాడారు. దీంతో శశిథరూర్‌కు ఆయన చెప్పిన కారణం నిజం కాదని తేలిపోయింది. ఉద్దేశపూర్వకంగానే శశిథరూర్‌తో భేటీకి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని అర్థమవుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న ఏఐసిసి ప్రతినిధుల్లో ఒక్కరు కూడా శశిథరూర్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న మల్లిఖార్జున్ ఖర్గే వైపే అందరూ ఉన్నారు. అందుకే శశిథరూర్ హైదరాబాద్ వచ్చినప్పటికీ ఎవరితో భేటీ అవుతారో స్పష్టత లేకుండా పోయింది.
ఇదే సమయంలో గతంలో రేవంత్ రెడ్డి వర్సెస్ శశిథరూర్ అన్నట్లుగా సాగిన ఓ ఎపిసోడ్‌లో రేవంత్ రెడ్డి ఇప్పుడు రివెంజ్ తీర్చుకున్నట్లయిందని ఆయన వర్గీయులు సంబరపడుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన కొన్నాళ్లకు శశిథరూర్ టీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలంగా మాట్లాడిన విషయంపై మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆయనపై అభ్యంతరకరమైన పదం ప్రయోగించారు. ఓ ఓ జర్నలిస్ట్ చిట్ చాట్‌ను రికార్డు చేశారు. ఈ అంశంపై కేటీఆర్ సోషల్ మీడియాలో శశిథరూర్‌ను ఇలా కించ పర్చిన వ్యక్తికి టీ పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. ఆ సమయంలో శశిథరూర్‌కు మద్దతుగా కొంత మంది సీనియర్లు వచ్చారు. విషయం పెద్దది కాకుండా వెంటనే రే్వంత్ రెడ్డి శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. వెంటనే విషయం సద్దుమణిగిపోయింది.
శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత . ఐక్యరాజ్య సమితిలో పని చేసి వచ్చారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి వరకూ పరిచయం లేని నేత. ఆయన రేంజ్ వేరు. కాంగ్రెస్ పార్టీలో కన్నా ఇతర పార్టీల నేతలతోనే ఆయనకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీ చేస్తున్నారు. కానీ ఆయనకు సన్నిహితులెవరూ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి.