TS BJP : తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది ? ఆ ఇద్దర్ని ఢిల్లీకి ఎందుకు పిలిపించారు ?
తెలంగాణ బీజేపీలో ఇద్దరు కీలక వలస నేతల్ని హైకమాండ్ ఢిల్లీ పిలిపించింది. వారికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
TS BJP : తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ ముఖ్య నేతలకూ అర్థం కావడం లేదు. మంగళవారం హఠాత్తుగా కేంద్ర పెద్దలు ఇటీవలి ఉపఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించారు. హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన ఈటల రాజేందర్, మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. వారు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలతో కొన్ని అంతర్గత సమావేశాల్లో పాల్గొంటున్నారు. వారితో పాటు ఇతర నేతల్ని ఢిల్లీకి పిలువలేదు. దీంతో తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందా అన్న చర్చ ప్రారంమయింది.
ఢిల్లీలో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి !
ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరి ఉపఎన్నికలను ఎదుర్కొన్న ఇద్దరు నేతలను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఇతర తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల్ని ఆహ్వానించలేదు. కేవలం వారిద్దరిని మాత్రమే పిలిచారు. వారితో ఇతర ముఖ్య నేతలతో పాటు ..చివరిగా అమిత్ షా కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వారు బలంగానే పోరాడుతున్నారు. కానీ వారు ఎక్కడ బలపడితే తమ స్థానాలకు ఎసరు వస్తుందోనని బీజేపీలో పాతుకుపోయిన కొంత మంది వారికి సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈటల అసంతృప్తిగా ఉన్నారని కొన్నారని కొంత కాలంగా ప్రచారం !
ఈటల రాజేందర్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా గతంలో చాలా సార్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ వారు తమ అసంతృప్తిని హైకమాండ్‌కు తెలిసేలా చేస్తున్నారు కానీ ఆ ప్రభావం పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో చేరికల ఇంచార్జ్‌గా కూడా ఈటల ఉన్నారు. కానీ చేరికలు… సంప్రదింపులు అన్నీ ఈటలకు సంబంధం లేకుండానే సాగుతున్నాయి. అదే సమయంలో పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కకుండా.. ఒకరే పెత్తనం చేస్తున్నారని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయంలో ఈటల ఉన్నారంటున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంత నిలకడగా కనిపించడం లేదు.
పార్టీ మార్పుపై కొన్ని మీడియాల్లో ప్రచారంతోనే హైకమాండ్ అప్రమత్తమయిందా?
ఈటల రాజేందర్ ను మళ్లీ టీఆర్ఎస్ హైకమాండ్ సంప్రదిస్తోందన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. టీఆర్ఎస్‌లో పని చేసి బయటకు వెళ్లిపోయిన వారికి మళ్లీ మైండ్ బ్లాంక్ అయ్యే ఆఫర్లు ఇచ్చి వెనక్కి పిలుస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే స్వామిగౌడ్, శ్రవణ్ వంటి వారు చేరారు. ఈటాలకూ ఆహ్వానం పంపారని చెబుతున్నారు. కోమటిరెడ్డి కూడా ఊగిసలాటలో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో వారిని బీజేపీ హైకమాండ్.. బుజ్జగించడానికే పిలిపించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని.. బయట జరిగే ప్రచారాలకు ప్రభావితం కావొద్దని హైకమాండ్ వారికి నచ్చే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
వారిద్దరికీ పార్టీలో కీలక బాధ్యతలిస్తారా ?
తెలంగాణ బీజేపీలో కొత్తగా చేరుతున్న వారికి.. పాత నేతలకు మధ్య సమన్వయం అంశాలపై హైకమాండ్ వీరి వద్ద నుంచి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కుదురుకోలేకపోతున్నారన్న ప్రచారంతో రాబోయే కాలంలో వచ్చి చేరే వారికి మరింత భరోసా ఇచ్చేందుకు ఈటల , కోమటిరెడ్డిలకు బీజేపీ హైకమాండ్ కొన్ని సూచనలు చేయడంతో పాటు కీలక బాధ్యత్లు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో ఎవరికైనా కీలక పదవి లభిస్తే.. పార్టీలో చేరాలనుకునేవారు కూడా మరింత ఉత్సాహం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ బీజేపీలో అంతర్గతంగానే చర్చనీయాంశం అవుతోంది.