Telangana Elections 2023 : తెలంగాణ అన్ని పార్టీల నేతలకూ క్రిమినల్ రికార్డే - కానీ రాజకీయ కేసులే ఎక్కువ !
Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నేరచరితులు ఎక్కువగా ఉన్నారు. అయితే నేతలపై రాజకీయకారణాలతో పెట్టిన కేసులో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Telangana Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో నేర చరితులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన అభ్యర్థులు 360 మంది పోటీచేస్తున్నారు. వీరిలో 226 మంది నేరచరిత్ర గలవారేనని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలోని నేరచరిత్రను పరిగణనలోకి తీసుకున్నారు. ఇతర పార్టీల్లోని అభ్యర్థులపైనా చిన్నా, చితకా కేసులు ఉన్నా, ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే ఎక్కువ కేసులు ఉన్నాయి.
ప్రతిపక్ష నేతలపై ఎడాపెడా కేసులు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై పెట్టిన కేసులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అదే సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులపై గతంలో పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ 118 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలోని బీజేపీ 111 స్థానాల్లో పోటీచేస్తుంది. ఆ అభ్యర్థుల్లో 78 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక 12 స్థానాల్లోనే పోటీచేస్తున్న ఎంఐఎంపార్టీలో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేస్తుండగా, వారిలో 58 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అనేకమందిపై ఏండ్ల తరబడి కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
బీఆర్ఎస్ నేతలపై ఉద్యమకాలం నాటి కేసులు
బీఆర్‌ఎస్‌లో కరీంనగర్ స్థానం నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌పై అత్యధికంగా పది క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల అభ్యర్థి కే తారకరామారావుపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా ఒక్కోక్కరిపై ఐదు క్రిమినల్ కేసులు నమోదైన వారిలో నర్సాపూర్ అభ్యర్థి వాకిటి సునీత, మహేశ్వరం అభ్యర్థి, రాష్ట్ర మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి, హూజూర్‌నగర్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 58 మంది అభ్యర్థులపై 120 కేసులు నమోదై ఉన్నాయి.
రేవంత్‌రెడ్డిపై 89 కేసులు
కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేస్తున్న 84 మంది అభ్యర్థులపై మొత్తం 540 కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆపార్టీ అభ్యర్థి వెడ్మా బొజ్జుపై 52 కేసులు ఉన్నాయి. మంచిర్యాల నుంచి పోటీచేస్తున్న కొక్కిరాల ప్రేంసాగర్‌రావుపై 32 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీజేపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 78 మందిపై 549 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఆపార్టీ అభ్యర్థిగా గోషామహల్ నుంచి పోటీచేస్తున్న రాజాసింగ్‌పై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కరీంనగర్ నుంచి పోటీచేస్తున్న బండి సంజరుకుమార్‌పై 59 కేసులు, బోథ్ నుంచి పోటీచేస్తున్న సోయం బాపూరావుపై 55 కేసులు నమోదై ఉన్నాయి.