Telangana Election 2023 : వలస నేతలకే టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యం - కాంగ్రెస్ రిస్క్ తీసుకుంటోందా ?
ప్యారాచూట్ నేతలకు టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత వీరు కాంగ్రెస్‌కు విధేయంగా ఉంటారా ?
Telangana Election 2023 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల పేరుతో వలస నేతలకు పెద్ద పీట వేస్తోంది. అది కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తూ టిక్కెట్లు కేటాయించింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రం అనే పారామీటర్‌తోనే టిక్కెట్లు కేటాయిస్తోంది. ఏ పార్టీలో ఉన్నా.. ఆ లీడర్ గత చరిత్ర ఎలా ఉన్నా వదిలి పెట్టలేదు. ఆఫర్లు ఇచ్చింది.. టిక్కెట్లు ఇచ్చింది. బతిమాలింది.. బుజ్జగించింది.. అన్నీ చేసి పార్టీలో చేర్చుకుంది. వీరందరూ పోటీలో ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ నేతలే. అయితే వీరిలో ఎంత మంది విధేయంగా ఉంటారన్న చర్చ కూడా ఇప్పుడు ప్రారంభమయింది.
రెండో జాబితాలోనూ ఫిరాయింపు దార్లకే ప్రాధాన్యం
కాంగ్రెస్ రెండో జాబితాలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, తాండూరు, మహబూబ్ నగర్, మునుగోడు, భువనగిరి, పరకాల టిక్కెట్లు కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయం కాంగ్రెస్‌లో చేరితే సాయంత్రానికి మునుగోడు టిక్కెట్ ఇచ్చారు. మొదటి జాబితాలోనూ ఫిరాయింపు దార్లకు అవకాశం కల్పించారు. మైనంపల్లి హన్మంతరావు.. కుమారుడికి, తనకకూ టిక్కెట్ కోసం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికీ టిక్కెట్లు ఇచ్చారు. కాంగ్రె్స పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్‌లో చేరిన భువనగిరి నేత కంభం అనిల్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఆఫర్ చేసి మరీ పార్టీలోకి తెచ్చుకున్నారు. వీరిలో అత్యధికులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారు. గతంలో చాలా మంది కాంగ్రెస్ నేతలే. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఇప్పుడు అవకాశం కోసం వస్తే.. అంతకు మించి లీడర్లు లేరన్నట్లుగా కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోంది. మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు లాంటి ఫిరాయింపు దారులకు మొదటి జాబితాలో చోటు దక్కింది.
హంగ్ వస్తే వీళ్లను కాంగ్రెస్ కాపాడుకోగలదా ?
తెలంగాణ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత హోరోహోరీగా సాగబోతున్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి హోరాహోరీ పోరులో గుర్తించాల్సింది ... కాంగ్రెస్ గెలిచే సీట్లు కాదు. గెలిచిన తర్వాత ఆ పార్టీ వైపు ఎంత మంది ఉంటారన్నది ముఖ్యం. హంగ్ అంటూ వస్తే.. కాంగ్రెస్ పార్టీ తట్టుకునే అవకాశం ఉండదని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలుపు గుర్రాలపేరుతో ఫిరాయించిన వాళ్లే. వారు తమకు బెస్ట్ ఆఫర్ ఏదనుకుంటే అందులోకి వెళ్లిపోతారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విలపించి ప్రయోజనం ఉండదు. ఇదే సమస్య అతి సాధారణ మెజార్టీ వచ్చినా ఉంటుంది. 61 లేదా 62 సీట్లు గెల్చి అధికారం దక్కించుకుంటే డిమాండ్లు పెట్టే నేతలు కూడా ఎక్కువగానే ఉంటారు. తాము అడిగిన పదవులు ఇవ్వకపోతే పార్టీ ఫిరాయిస్తామని బెదిరించే వారూ ఎక్కువగానే ఉంటారు.
కాంగ్రెస్‌కు కత్తి మీద సామే !
హంగ్ వచ్చినా.. సాధారణ మెజార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేల్ని నిలుపుకోవడం అసాధారణమైన పని అవుతుంది. విధేయులకు టిక్కెట్లు ఇప్పించి గెలిపిచుకుంటే.. ఇంతలా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ సీజన్ల వారీగా పార్టీలు మారేవారిని బలమైన నేతల పేరుతో తెచ్చి పెట్టుకుని టిక్కెట్లు ఇస్తూండటంతోనే ఈ భయం పెరుగుతుంది. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష మెజార్టీ సాధించడం కష్టమనే అంచనాలు ఉన్నాయి. అసలు సమస్య అక్కడే వస్తుంది. గెలుపు గుర్రాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. వారంతా అధికారం, పదవుల లక్ష్యంతోనే వచ్చారు. వారిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ మరో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఓ రకంగా ప్యారాచూట్ నేతలతో కాంగ్రెస్ పార్టీ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వారిలో ఎంత మందిని తమ కంట్రోల్ లో ఉంచుకోగలుగుతారనేది అసలు విషయం.