Brother Anil Comments : కొత్త పార్టీ ఏర్పాటు దిశగా బ్రదర్ అనిల్ - విశాఖలో స్పష్టమైన సంకేతాలు !
సీఎం జగన్షను కలిసి రెండున్నరేళ్లు అయిందని బ్రదర్ అనిల్ విశాఖలో అన్నారు. ఏపీలో కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి తమపై ఉందన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ సంఘాలతో సమావేశం తర్వాత మీడియాతో ఆయన పార్టీ ఏర్పాటు సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఒత్తిడి తమపై ఉందని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని బ్రదర్ అనిల్ కుమార్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేసిన ఎస్సీ, బీసీ, క్రిస్టియన్ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్‌ను కలిసి రెండున్నరేళ్లు అయింది !
వైఎస్ఆర్‌సీప విజయం కోసం పని చేసిన సంఘాలు అన్నీ ఆవేదనతో ఉన్నాయన్నారు. ఇప్పుడు వారి ఇబ్బందులను వారు చెప్పారన్నారు. వారి ఆవేదనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. సీఎం జగన్‌ను కలిసి రెండున్నరేళ్లు అయ్యిందని.. ఆయనను కలవాలంటే తనకు అపాయింట్‌మెంట్ అవసరమా అని ప్రశ్నించారు. ఎప్పుడు కావాలంటే అప్పులు వెళ్లగలనన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపికి మద్దతుపలికిన వారి బాధలు, వెతలను ఓ లేఖ ద్వారా సీఎం జగన్‌కు తెలియచేస్తాననితెలిపారు. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఒక ప్రత్యమ్నాయా పార్టీ పెట్టాలని కోరుతున్నారన్నారు. ఈ మాటల ద్వారా ఆయన పరోక్షంగా సీఎం జగన్‌తో దూరం పెరిగిందన్న విషయాన్ని అంగీకరించిటనట్లయిందని భావిస్తున్నారు.
ఏపీకి బీసీ సీఎం పదవి నినాదం !
బిసి కి సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారు వారికి అండగా నిలుస్తానని బ్రదర్ అనిల్ ప్రకటించారు. ఎన్నికల ముందు నన్ను నమ్మి సహాయం చేసి ప్రభుత్వ ఏర్పాటు కృషి చేశారు కాబట్టి... వారు బాధ లో ఉంటే స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పార్టీ ఏర్పాటు అనేది ఒక్కరోజులో చేసే పని కాదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను పార్టీ విషయంపై కలవలేదని.. ఆయనను వేరే పని మీద కలిశానన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంపై మీడియా స్పందించినప్పుడు బ్రదర్ అనిల్ భిన్నంగా స్పందించారు. వివేకా హత్య కేసులో , దోషులు తప్పించుకోలేరని.. సీబీఐ కేసు విచారణ చేస్తోంది అంటే చిన్న విషయం కాదన్నారు.
పార్టీ పెట్టడం ఖాయమేనని బ్రదర్ అనిల్ సంకేతాలు
విశాఖలో మీటింగ్ తర్వాత కొత్త పార్టీ విషయాన్ని బ్రదర్ అనిల్ పూర్తిగా ఖండించలేదు. తమపై ఒత్తడి ఉందన్నారు. అదే సమయంలో ఆయన బీసీ సీఎం ప్రస్తావన తీసుకు వచ్చారు. అంటే.. పార్టీ పెట్టాలనే స్పష్టమైన ప్రణాళికతో.. బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లే ఆలోచనతోనే ఇలా సమావేశాలు నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు. అయితే బ్రదర్ అనిల్ సమావేశాలు...పార్టీ పెట్టబోతున్నామన్న సంకేతాల వెనుక షర్మిల ప్రోత్సాహం ఉందా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.