Why Modi Soft On KCR : సాఫ్ట్ స్పీచ్‌తో షాకిచ్చిన మోదీ ! విమర్శించలేదని టీఆర్ఎస్ నేతలు ఫీలవుతున్నారా ?
ప్రధానమంత్రి మోదీ తన స్పీచ్‌లో కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ నేతలు కూడా ఇలా ఎందుకు జరిగిందని మథనపడుతున్నారు . ఎందుకంటే ?
Why Modi Soft On Kcr : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కొంత కాలంగా బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీని అనడం కన్నా ఆయన మోదీని టార్గెట్ చేశారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన మోదీ విధానాల్నే తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మోదీ వల్లనే దేశం దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లిందంటున్నారు. ఆయనకు తానే ప్రత్యామ్నాయం అని చెబుతూ ఏకంగా జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతగా టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌ను .. తెలంగాణకు వస్తున్న మోదీ చీల్చి చెండాడుతారని అందరూ అనుకున్నారు. ఎవరో ఎందుకు స్వయంగా సీఎం కేసీఆర్ కూడా అనుకున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడినప్పుడు "మోదీ రేపు తనను చీల్చి చెండాడుతారని" వ్యాఖ్యానించారు.కానీ అందరి అంచనాలు తప్పాయి. ప్రధాని నోటి వెంట కనీసం కేసీఆర్ అనే మాట కూడా రాలేదు. అదే సమయంలో తీవ్రమైన ఆరోపణలు.. విమర్శలు చేయలేదు. ఇతర నేతలు చేశారు కానీ..ప్రధాని ఏమీ అనకపోవడం వల్ల వారి విమర్శలకూ పెద్దగా గుర్తింపు రాలేదు. మోదీ ఎందుకిలా అంచనాలను తలకిందులు చేశారు ? కేసీఆర్‌పై విమర్శలకు సమయం కాదనుకున్నారా ? వ్యూహాత్మకంగా వ్యవహరించారా ?
కేసీఆర్ మాటెత్తకుండానే ప్రసంగం !
యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిర్వహించిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా ప్రశ్నలను సంధించారు. మోదీ మాట్లాడి వెళ్లిపోవడం కాదని .. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కానీ మోదీ మాత్రం కేసీఆర్ మాటలను పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని దాదాపుగా పట్టించుకోలేదు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రభుత్వాలపై మోదీ విరుచుకుపడుతారు. పైగా మోదీ వచ్చింది పూర్తి స్థాయి తెలంగాణ పర్యటనకు. దీంతో సహజంగానే రాజకీయ పరమైన వ్యాఖ్యలను అందరూ ఆశిస్తారు. కానీ మోదీ మాత్రం అంచనాలను తలకిందులు చేశారు. తాము తెలంగాణకు ఏం చేశామో.., ఏం చేస్తామో చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధి జరుగుతుందని వివరించారు. దీంతో బీజేపీ నేతల్లో కాస్త నిరాశ వ్యక్తమవుతోంది.
కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకూడదనే వ్యూహాత్మక మౌనమా ?
అయితే ఇలా స్పందించకపోవడాన్ని బట్టి కేసీఆర్‌ను మోడీ అంత సీరియస్‌గా తీసుకోలేదనే అర్థం అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన నోటి వెంట కేసీఆర్ అనే మాటే రాలేదని అంటున్నారు. కేసీఆర్‌కు వ్యూహాత్మకంగా కావాలనే మోదీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని బీజేపీ వర్గాలు కారణాలు చెబుతున్నాయి. ఆయనకు అనవసరంగా ప్రాధాన్యత ఇస్తే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చినట్లవుతుందన్న ఉద్దేశంతో మోదీ లైట్ తీసుకున్నారని అంటున్నారు. కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ప్రచారం కూడా ఏదైనా జాతీయ స్థాయిలో ఉండేలా చేసుకుంటున్నారు. ఒక వేళ మోదీ కేసీఆర్‌ను విమర్శించి ఉంటే.. అది జాతీయ స్థాయిలో ప్రచారం అయ్యేదని.. మోదీ తన ప్రత్యర్థిగా కేసీఆర్‌ను చూస్తున్నారన్న భావన ఏర్పడేదని అంటున్నారు. అందుకే బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా టీఆర్ఎస్‌ను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు.
భయపడ్డారంటున్న టీఆర్ఎస్ !
ప్రధాని మోదీ టీఆర్ఎస్‌ను విమర్శించలేదు అంటే.. తమకు భయపడ్డారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సోషల్ మీడియాలోనూ అదే ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నుంచి ఊహించని రియాక్షన్‌ను టీఆర్ఎస్ నేతలు కూడా ఎక్స్ పెక్ట్ చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ విషయంలో జరిగిన ఫ్లెక్సీ వార్ కానీ..బీజేపీ నేతలను చేర్చుకునే విషయంలో కానీ టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరించింది. ఇవన్నీ రెచ్చగొట్టినట్లేనని భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాలను రాష్ట్ర స్థాయిలోనే ఉంచాలనుకుంది. దానికి తగ్గట్లుగానే వ్యవహరించింది. ఓ రకంగా మోదీ స్పీచ్ టీఆర్ఎస్ నేతల్ని కూడా నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు.
మొత్తంగా అంచనాలను అందుకోలేకపోయిన మోదీ స్పీచ్ !
రాజకీయాల్లో ఒక్కో సారి ప్రత్యర్థిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశం ఇప్పుడు కేసీఆర్‌కు వచ్చింది. ఆయన ఎవరు ప్రత్యర్థిగా భావించి పోరాడితే వారే ప్రత్యర్థి అవుతారు. కేసీఆర్ ఇప్పటి వరకూ బీజేపీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ పార్టీపై ఆయన పెట్టిన ఫోకస్ కారణంగానే ఇప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఉందన్న అభిప్రాయం ఎప్పటి నుండో ఇప్పుడు టీఆర్ఎస్‌పై కూడా బీజేపీ అలాగే ఫోకస్ పెడితే... తమకు దేశవ్యాప్తంగా పాపులారిటీ వస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆశించి ఉండవచ్చు. ఆ విధంగా కూడా టీఆర్ఎస్ అంచనాలు తప్పాయనుకోవచ్చు. మొత్తంగా మోదీ స్పీచ్ " ఎక్స్ పెక్టేషన్స్ " ను అందుకోలేకపోయింది.