Khammam: ఖమ్మంలో వేడెక్కుతున్న రాజకీయం, ఆ ముగ్గురు నేతల చుట్టూనే, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలతో మరింతగా
40 ఏళ్లుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకటరావులు ఇప్పుడు జిల్లాలో పర్యటనల జోష్ పెంచారు.
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమంటూ ప్రచారం సాగడం, ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న నేతలు ఇప్పుడు పర్యటనలతో కార్యకర్తలలో జోష్ నింపుతుండటంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. నాలుగు దశాబ్ధాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకటరావులు ఇప్పుడు జిల్లాలో పర్యటనల జోష్ పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలలో ప్రత్యేక చర్చ సాగుతుంది.
మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన తుమ్మల..
2014లో కేసీఆర్ కెబినెట్‌లో మంత్రిగా పనిచేసిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2016లో జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో విజయం సాదించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో కందాల ఉపేందర్‌రెడ్డి అధికార పార్టీలో చేరడంతో మూడేళ్లుగా తుమ్మల స్తబ్ధుగా ఉన్నారు. అడపాదడపా పర్యటనలు చేసినా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవల పాలేరులో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధిష్ఠానం ఆదేశిస్తే పోటీచేస్తానని, అందుకు కార్యకర్తలే కీలకమని వ్యాఖ్యలు చేయడంతో పాలేరు నియోజకవర్గంలో ఇది కాస్తా హాట్ టాపిక్‌గా మారింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని తుమ్మలకు ఇక్కడ్నుంచి టిక్కెట్ ఇస్తారా? అనే విషయంపై చర్చ సాగుతుంది. మరోవైపు తుమ్మల సైతం ఇటీవల నియోజకవర్గంలో పర్యటన చేస్తుండటంతో రాజకీయంగా మార్పులు జరుగుతాయనే విషయంపై చర్చ జోరుగా సాగుతుంది.
కొత్తగూడెం కోసం జలగం..
2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆ పార్టీ తరుపున గెలిచిన జలగం వెంకటరావు తనదైన శైలిలో జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన జలగం వెంకటరావుకు మంత్రి పదవి వరిస్తుందని చర్చ జరిగింది. అయితే అది కాస్తా జరగలేదు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వనమా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వనమా రాఘవ ఉద్దంతం అనంతరం కొత్తగూడెంకు వచ్చిన వెంకటరావు తాను మళ్లీ క్రియాశీలకంగా ఉంటానని పేర్కొనడంతో నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. వనమాపై వ్యతిరేకత రావడంతో మళ్లీ పట్టు సాదించే దిశగా వెంకటరావు కార్యాచరణ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ముచ్చటించిన వెంకటరావు నియోజకవర్గంలో తరుచూ అందుబాటులో ఉంటానని పేర్కొంటున్నారు. మరి ఈ పరిణామాలు నియోజకవర్గంలో ఎటు దారితీస్తాయో..? అనేది జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతుంది.
స్పీడు పెంచిన పొంగులేటి..
2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి తాను ఎంపీగా గెలవడంతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకుని రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉనప్పటికీ పార్టీ టిక్కెట్ కేటాయించలేదు. దీంతో పొంగులేటి పార్టీ మారుతాడని అప్పట్నుంచి ప్రచారం సాగుతుంది. అయితే పొంగులేటి మాత్రం పార్టీలోనే ఉన్నారు. ఇటీవల కాలంలో పొంగులేటి ఉమ్మడి జిల్లాలో పర్యటనల జోరు పెంచారు. దీంతోపాటు ఈ దపా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాడని ప్రచారం సాగుతుంది. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు..? అందుకు అదిష్టానం ఒప్పుకుంటుదా..? లేదా..? అనే విషయం చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా జిల్లాలో కీలకంగా ఉన్న ఈ ముగ్గురు నేతలు మళ్లీ స్పీడ్ పెంచడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.