Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని నారా లోకేష్ ప్రకటించారు. అలాగే పార్టీ పదవులను కూడా వరుసగా రెండు సార్లు మాత్రమే చేపట్టే విధానంపై చర్చిస్తున్నామన్నారు.
Lokesh Mahanadu : తెలుగుదేశం పార్టీ భారంగా మారిన నాయకులను వదిలించుకుకోవాలని నిర్ణయించుకుంది. పార్టీలో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తామని మహానాడు సందర్భంగా నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. వరుసగా మూడు సార్లు ఓడిన వారికి ఇక టిక్కెట్లు ఇవ్వబోమని చాలా కాలం క్రితమే చంద్రబాబు కూడా పొలిట్ బ్యూరో భేటీలో చెప్పారన్నారు. పార్టీ పదవుల్లోనూ ఇకపై ఇకపై 2+1 సిద్దాంతం అమలుకు ప్రయత్నం చేస్తామన్నారు. అంటే.. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవి బ్రేక్ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు.
పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు !
జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి నేను బ్రేక్ తీసుకుంటాననని ప్రకటించారు. ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే.. కొత్త రక్తం ఎలా వస్తుందని లోకేష్ ప్రశ్నించారు. ఇదే తన బలమైన కోరిక అని. పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించానని.. దీనిపై చర్చ జరుగుతోందన్నారు., ముందస్తు ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేస్తున్నట్లుగా లోకేష్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్ధుల ప్రకటన ఉంటుందన్నారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే ఆయా అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామన్నారు.
30 నియోజకవర్గాల్లో నేతలు ఇంకా స్పీడ్ అందుకోలేదు !
ఇప్పటికీ 30 నియోజకవర్గాల్లో నేతలు లైనులోకి రావడం లేదన్నారు. పని చేయని నేతలకు.. ఇన్ఛార్జులకు అవకాశాలుండవని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలు భారీగా ఖర్చు చేస్తారని జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని భావిస్తున్నానన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు తిరిగి దండం పెడితే చాలు గెలిచిపోయే పరిస్థితి ఉందన్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త వ్యవస్థ !
పార్టీ అధికారంలోకి రాగానే కీలక మార్పులు తెస్తామని..మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేసే వ్యవస్థని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వివిధ శాఖలకు చెందిన మంత్రులు.. పార్టీ సంబంధిత అనుబంధ విభాగాలతో చర్చించి నిర్ణయాలు తీసుకునేలా చూస్తామన్నారు. ప్రతీ సారి అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తూండటంతో ఈ సారి పార్టీకి.. ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేయాలని భావిస్తూండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పలువురు సీనియర్లకు ఈ సారి టిక్కెట్ లేనట్లే !
వరుసగా మూడుసార్లు ఓడిన వారికి అంటే... పలువురు టీడీపీ సీనియర్లకు ఈ సారి టిక్కెట్ లేనట్లేనని అనుకోవచ్చు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓడిపోతున్నారు. ఆయనకు కూడా ఈ సారి టిక్కెట్ లేదని ముందే చెప్పేసినట్లయింది. ఇలా ఓడిపోతున్నా చాన్సులు పొందుతున్న పలువురు నేతలకు ఈ సారి అలాంటిచాన్స్ లేదని తేలిపోయింది. ఇప్పటికే నలభై శాతం యువతకు టిక్కెట్లిస్తామనే విధానాన్ని చంద్రబాబు ప్రకటించారు.
సొంత కార్యకర్తలనే హింసిస్తున్న వైసీపీ నేతలు
జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారని ..ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందని లోకేష్ విశ్లేషించారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ కేడరే ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
పార్టీ ఆదేశిస్తే పాదయాత్రకైనా రెడీ !
పార్టీ ఆదేశిస్తే.. పాదయాత్రే కాదు.. ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నానని లోకేష్ తెలిపారు. ప్రజల్లోకి వెళ్తాను.. గ్రామ గ్రామానికి వెళ్తానని ప్రకటించారు. పొత్తులనేవి ఎన్నికలప్పుడు జరిగే చర్చన్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని.. ప్రజలంతా కలిసి ప్రజా కంటక ప్రభుత్వాన్ని దింపాలనే భావనతోనే అందరూ కలవాలని పవన్, చంద్రబాబు వ్యాఖ్యనించారని భావిస్తున్నానన్నారు. యువత అంటే వారసులు మాత్రమే కాదు.. పార్టీ కోసం పని చేసిన చాలా మంది యువకులున్నారు. 40 శాతం సీట్ల కేటాయింపుల్లో వారసులతో పాటు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని యువత కూడా ఉంటారని లోకేష్ స్పష్టం చేశారు.
జగన్ చేసిన రెండు భారీ కుంభకోణాలను బయట పెడతా !
మహానాడు అయ్యాక జగన్ చేసిన రెండు భారీ కుంభకోణాలను బయట పెడతానని ప్రకటించారు. ఆ కుంభకోణాలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని..అన్ని బయటపెడతాను.. జగన్ నైజం ప్రజలకు వివరిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.మహానాడుకు స్పందన పీక్స్ లో ఉందన్నారు. అదానీ, అరబిందో, గ్రీన్కో సంస్థలతో ఒప్పందానికి దావోస్ వెళ్లాలా..? తాడేపల్లి కొంపకు పిలిస్తే వాళ్లే వస్తారుకదా అని ప్రశ్నించారు. అదానీ, గ్రీన్కోలను గతంలో వెళ్లగొట్టారు.. మళ్లీ వాళ్లతో సెటిల్ చేసుకున్నాక ఒప్పందాలు కుదిరాయని విమర్శించారు.