Botsa Satyanarayana : బొత్స ఫ్యామిలీకి బంపర్ ఆఫర్- ఈసారి ఎన్నికల్లో ఐదుగురికి సీట్లు
YSRCP News: వైఎస్‌ఆర్‌సీపీలో కొందరు సీట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఇష్టం లేని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే మంత్రి బొత్స మాత్రం జాక్‌పాట్ కొట్టారు.
Vizianagaram News: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం బంపర్ ఆఫర్ కొట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నేత కుటుంబం భారీగా సీట్లు దక్కించుకుంది. కొందరు సీట్లు లేక అసంతృప్తితో ఉంటే మరికొందకు ఇష్టమైన స్థానాన్ని వదిలి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో బొత్స సత్యనారాయణ మాత్రం జాక్‌పాట్ కొట్టారనే టాక్ వినిపిస్తోంది.
గడిచిన ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం నుంచి తమ్ముడు బొత్స అప్పలనర్సయ్య పోటీ చేశారు. బొత్స మేనల్లుడు స్థానిక సంస్థలు ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బొత్స కుటుంబం నుంచే ఉన్నారు. రానున్న ఎన్నికల్లోనూ బొత్స కుటుంబానికి సీఎం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నారు.
రెండు ఎంపీ.. మూడు ఎమ్మెల్యే..
వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ గెలిచే అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున వడపోత ప్రక్రియ చేపట్టింది. పలు సర్వేలు ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. ఆయా సర్వేలు ఇచ్చిన రిపోర్టులు ఆధారంగా చేసుకుని బొత్స కుటుంబానికి రానున్న ఎన్నికల్లో సీట్లను సీఎం జగన్మోహన్‌రెడ్డి కేటాయించినట్టు చెబుతున్నారు. చీపురుపల్లి నుంచి మళ్లీ బొత్సకు అవకాశం దక్కనుండగా, గజపతినగరం నుంచి ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య, నెల్లిమర్ల నుంచి తోడల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడు బరిలోకి దిగనున్నారు.
గతంలో విజయనగరం ఎంపీగా పని చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మికి గత ఎన్నికల్లో సీటు నిరాకరించిన వైసీపీ.. ఈసారి అనూహ్యంగా విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతోంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు, బొత్స ప్రాబల్యం, ఆర్థిక, అంగబలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బొత్స ఝాన్సీని వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇదే కుటుంబానికి చెందిన ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం. అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారు అయింది. ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు ప్రత్యామ్నాయం చూపించడంలో ఉన్న ఇబ్బందులలు దృష్ట్యా ప్రకటన వాయిదా పడింది. ఒకటి. రెండు రోజుల్లో ఈ మేరకు ప్రకటన రానుంది. అంటే, బొత్స కుటుంబం నుంచి ఈసారి ఇద్దరు ఎంపీలుగా, ముగ్గురు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగనున్నారు.
బొత్స సూచించిన వారికే టికెట్లు..
విజయనగరం జిల్లాపై బొత్స పట్టు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు భారీగా సీట్లు ఇప్పించుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లోనూ తాను సూచించిన వారికే టికెట్లు ఇచ్చేలా చూసుకుంటున్నారు. అందుకే అనేక నియోజకవర్గాలకు చెందిన నాయకులు సీట్లు కోసం బొత్స చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఎస్ కోట మినహా అన్ని చోట్ల దాదాపు అభ్యర్థులు ఖరారు అయినటట్టు చెబుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కడుబండి శ్రీనివాసరావు మరోసారి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుండగా, ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు కూడా తన ప్రయత్నాలను సాగిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను అసెంబ్లీకి పంపించాలని భావిస్తే.. అధిష్టానానికి కనిపిస్తున్న ఏకైక నియోజకవర్గం కూడా ఇదే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీటు ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
పట్టు నిలుపుకుంటూ..
మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఒక మెట్టు దిగి వస్తున్నానంటూ బొత్స చేసిన కామెంట్లు సర్వత్రా ఆసక్తిని కలిగించాయి. బొత్సకు తగిన ప్రాధాన్యతను ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి అప్పట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా.. రెండో విడత మంత్రివర్గ విస్తరణలోనూ ఆయననను కొనసాగించి గౌరవాన్ని నిలబెట్టారు. తాజాగా సీట్లు కేటాయింపుతో బొత్స ఆధిపత్యం వైసీపీలోనూ కొనసాగుతున్నట్టు స్పష్టమైంది.
Also Read: వైఎస్ఆర్‌సీపీ ప్రకటిస్తున్న జాబితాల్లోని వారు సమన్వయకర్తలు మాత్రమేనా ? అభ్యర్థులు కాదా ?
Also Read: కార్యకర్తలు ఆదేశిస్తే అనేక మార్గాలు - ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటున్న మంత్రి జయరామ్