CPI Telangana: సీపీఐకి తెలంగాణలో కొత్త చీఫ్, రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన వ్యక్తిగా కూనంనేని అందరికి సుపరిచితుడే.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో జరిగిన సీపీఐ పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రతి సారి సీపీఐ కార్యదర్శి ఎంపిక ఏకగ్రీవంగా జరిగినప్పటికీ ఈ సారి జరిగిన ఎన్నికల్లో భువనగిరి జిల్లాకు చెందిన పల్లా వెంకటరెడ్డి తాను కూడా కార్యదర్శి పదవికి పోటీ పడటంతో ఎన్నిక అనివార్యం అయింది. రాష్ట్ర కార్యవర్గంలో ఓటు హక్కు కలిగిన 110 మంది ఈ ఎన్నికల్లో పాల్గొనగా కూనంనేని సాంబశివరావుకు 59 ఓట్లుగా రాగా పల్లా వెంకటరెడ్డికి 44 ఓట్లు పోలయ్యాయి. దీంతో చాడ వెంకటరెడ్డి తర్వాత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అటు దేశంలో జరుగుతున్న రాజకీయాలతోపాటు రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. కాగా కార్యదర్శి ఎంపిక విషయంలో ఇద్దరు నేతల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో కూనంనేని విజయం సాదించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సముచిత స్థానం..
తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టుంది. దీంతోపాటు ఈ జిల్లాలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ తన సత్తాచాటుకుంది. ప్రస్తుతం కొత్తగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు సైతం 2009 ఎన్నికల్లో సీపీఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆది నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితులైన కూనంనేని మూడు దశాబ్ధాలుగా సీపీఐ పార్టీలో ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. సీపీఐ పార్టీ అనుబంధ సంఘాలలో పనిచేస్తూ విశాలాంధ్ర విలేకరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కూనంనేని పార్టీలో కిందస్థాయి నుంచి పనిచేశారు.
1956 జనవరి 14న గుంటూరు జిల్లా సంగుపల్లిలో జన్మించిన కూనంనేని 1980లో విశాలాంధ్ర సబ్ ఎడిటర్‌గా పనిచేస్తూ సింగరేణి కార్మిక ప్రాంతమైన కొత్తగూడెంకు చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ సీపీఐ పార్టీ పట్టణ కార్యదర్శిగా, సీపీఐ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శిగా 1986 వరకు పనిచేశారు. 1987 నుంచి 1992 వరకు కొత్తగూడెం మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రెండు పర్యాయాలు పనిచేసిన ఆయన 1999, 2004లో సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి అరెస్టు అయి జైలులో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సైతం అటు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ఇలా మూడు దశాబ్ధాలుగా పార్టీలో కిందస్థాయి నుంచి పనిచేసిన కూనంనేని ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో కమ్యూనిస్టు ఉద్యమాలకు కంచుకోటగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూనంనేని రాష్ట్ర కార్యదర్శి పదవి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. కాగా వామపక్షాలలో మరో పార్టీ అయిన సీపీఎం కి ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తమ్మినేని వీరభద్రం కార్యదర్శిగా ఉండటంతో రెండు వామపక్ష పార్టీలకు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర బిందువుగా మారింది.