Munugode TRS Candidate : మునుగోడుపై తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ - అభ్యర్థిత్వం ఎవరికో ?
మునుగోడులో అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో కేసీఆర్ అన్ని రకాల సమీకరణాలు చూసుకుంటున్నారు. ఇతర పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి చాన్స్ ఇస్తున్నందున బీసీ అభ్యర్థికి ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Munugode TRS Candidate : మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారరయ్యారు. కానీ అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడానికి వెనుకాడుతోంది. మునుగోడులో గెలిచి తీరుతామంటున్న టీఆర్ఎస్‌కు అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాములా మారింది. మాజీ ఎమ్మెల్యే, గతంలో పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. మునుగోడులో జరిగిన బహిరంగసభలో ఈ విషయాన్ని కేసీఆర్ ప్రకటిస్తారని కూడా చెప్పుకున్నారు. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసు మార్చుకున్నారు. మునుగోడులో జరిగినస బహిరంగసభలో అసలు అభ్యర్థి ప్రస్తావన తీసుకు రాలేదు. దీనికి కారణం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై సొంత పార్టీలో అసంతృప్తి ఉండటమే.
మునుగోడులో పీకే టీం సర్వేలు
మరింతగా ఆలోచించి అభ్యర్థిని ఖరారు చేయాలనుకున్న కేసీఆర్ సర్వేలు చేయించినట్లుగా తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేయాలనుకుంటున్నారు. మెల్లగా మునుగోడులో బీసీ నినాదం వినిపిస్తోంది. బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఆ నియోజకవర్గంలో అన్ని పార్టీలూ రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులనే నిలబెడుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఉండటం ఖాయం. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేశారు. అందుకే బీసీ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుందన్నదానిపై టీఆర్ఎస్‌లో సమాలోచనలు జరుగుతున్నాయి. మునుగోడులో అవకాశం ఇస్తే పోటీ చేయడానికి టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ తో పాటు మాజీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా రెడీగా ఉన్నారు. ఆయన బీసీలకే టిక్కెట్ ఇవ్వాలన్న నినాదాన్ని వినిపిస్తున్నారు.
రెడ్డి సామాజికవర్గానికే చాన్స్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం
అయితే సర్వేలు నిర్వహించిన తర్వాత కేసీఆర్.. రెడ్డి సామాజికవర్గానికే ఇవ్వడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్నే ఖరారు చేయాలనుకుంటున్నారని అయితే.. పార్టీ నేతలను బుజ్జగించాల్సి ఉందని చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఈ బాధ్యత తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో మొత్తం ఆయనే చక్కబెడుతున్నారు. వీలైనంత త్వరగా ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా క్యాడర్ మారేలా చేయడానికి జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ సాధ్యం కాకపోతే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును పరిశీలించే అవకాశం ఉంది. పోటీ చేసేందుకు సుఖేందర్ రెడ్డి కూడా ఆసక్తిగానే ఉన్నారని చెబుతున్నారు.
కూసుకంట్ల వైపే మొగ్గు చూపే అవకాశం
ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాలేదు. కానీ కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ఖరారు చేస్తే పరిస్థితి అనుకూలంగా మారుతుందని భావిస్తారు. దుబ్బాక, హుజూరాబాద్‌లలో అలాగే చేశారు. అయితే అక్కడ అభ్యర్థిత్వం కోసం పోటీ ఉన్నా బుజ్జగించగలిగారు. కానీ ఇప్పుడు మునుగోడులో అభ్యర్థిత్వంపై పోటీ కన్నా.. అభ్యర్థిపై వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ఆలోచించక తప్పడం లేదు.
మునుగోడులో కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా ! కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ తప్పదా !