Jagan And Babu : ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు ! ఆరో తేదీన ఢిల్లీలో జరగబోయేది ఇదేనా ?
ఢిల్లీలో నరేంద్రమోదీ నిర్వహించనున్న సమావేశానికి జగన్ కూడా హాజరవనున్నారు. జగన్, చంద్రబాబు ఒకే సమావేశంలో పాల్గొనడం ఆసక్తి రేపుతోంది.
Jagan And Babu : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాల్లో కాకుండా మరో సందర్భంగా ఒకే వేదికపై ఎప్పుడూ కనిపించలేదు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి కంటే ఎక్కువగా చంద్రబాబును చూస్తూంటారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూంటారు . ఈ క్రమంలో చంద్రబాబుతో ఆయన వేదిక పంచుకోవడం అనే అంశాన్ని సామాన్యంగా ఊహించలేము. కానీ ఇప్పుడు ఘటన చోటు చేసుకోబోతంది. ఇందుకు ఢిల్లీ వేదిక కాబోతోంది.
ఆరో తేదీన ఢిల్లీలో ఒకే వేదికపై చంద్రబాబు, జగన్ !
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరో తేదీన ఢిల్లీ వెళ్లబోతున్నారు. "అజాదీ కా అమృత్ మహోత్సవ్" జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇదే్ సమావేశానికి ముఖ్యమత్రి హోదాలో ఏపీ సీఎం జగన్‌కూ ఆహ్వానం అందింది. జగన్ కూడా.. ఈ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రితో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించాలని అనుకుంటున్నారు. అంటే... చంద్రబాబు హాజరవుతున్నప్పటికీ.. జగన్ ఢిల్లీ భేటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లే అనుకోవచ్చు.
బీజేపీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు !
ఏపీలో బీజేపీకి కనీస మాత్రం ఓటు బ్యాంక్ లేదు. ఎలాంటి ఎన్నికలు జరిగినా ఆ పార్టీ కనీస బలం ప్రదర్శించలేకపోతోంది. అయితే బీజేపీ పార్టీ పరంగా మాత్రం ఏపీలో కీలకంగా ఉంది. దీనికి కారణం ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో మైత్రికి పోటీ పడుతూండటమే. టీడీపీ గతంలో నేరుగా పొత్తులు పెట్టుకుంది. తర్వాత కటీఫ్ చెప్పింది. కానీ ఇప్పుడు బీజేపీతో ఎలాంటి శత్రుత్వం లేకుండా పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో రహస్యమేమీ లేదు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ కూడా. బీజేపీతో సంబంధాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ నేరుగా బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇలా పోటీ పడి బీజేపీతో స్నేహంగా ఉండటానికి కారణం కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటమే. అందుకే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆహ్వానాల్ని ఎవరూ తిరస్కరించే అవకాశం లేదు. చంద్రబాబు హాజరైనా సీఎం జగన్ గైర్హాజర్ అయ్యే అవకాశం లేదు.
అసెంబ్లీ కాకుండా జగన్, చంద్రబాబు ఒకే వేదికపై ఇదే మొదటి సారి !
అసెంబ్లీలో చంద్రబాబు , జగన్ ఒకే సమావేశంలో కనిపించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ సభ్యులు అవమానించడంతో చంద్రబాబు కంటతడి పెట్టుకుని వెళ్లిపోయారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేశారు. ఈ అసెంబ్లీ కాలంలో ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. అంటే మరోసారి అసెంబ్లీలోనూ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మాత్రం కలిసి పాల్గొంటారు. ఇది రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం కాబట్టి... ఈ ఇద్దరూ కలిసి పాల్గొన్నా.. ఇద్దరూ ఏపీకి ప్రాతినిధ్యం వహించినా ఎలాంటి సమస్యా రాకపోవచ్చు. కానీ కలసి పాల్గొనడం మాత్రం అరుదైన విషయంగా ఉండిపోతుంది.