News
News
X

Danger Bells For YSRCP: వైఎస్ఆర్‌సీపీకి ప్రమాద ఘంటికలే - తప్పెక్కడ జరిగింది ? దిద్దుబాటు చర్యలేమిటి ?

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్‌సీపీకి ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. తప్పెక్కడ జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.

FOLLOW US: 
Share:

 

Danger Bells For YSRCP:   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాలు చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి. దీనికి కారణం ప్రజా నాడి ఎలా ఉందో నేరుగా ఓట్ల రూపంలో తెలుసుకునే ఓ అవకాశం రావడమే. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పార్టీల ఓటర్లు ఓట్లు వేస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు చాలా పరిమితం. కానీ పట్టభద్రుల ఓటర్లు మాత్రం లక్షల్లో ఉంటారు. మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి  దాదాపుగా పది లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ప్రజాభిప్రాయాన్ని ఓ రకంగా అంచనా వేయవచ్చు. అందుకే అందరూ ఈ ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూశారు. చివరికి వైఎస్ఆర్‌సీపీకి షాక్ తగిలింది. రెండు స్థానాల్లో అసలు పోటీ ఇవ్వలేకపోగా కంచుకోట లాంటి స్థానంలో తామే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.  అన్ని చోట్లా గెలుస్తామని కేబినెట్  భేటీలో ముందస్తుగానే మంత్రుల్ని సీఎం జగన్ అభినందించారు. కానీ జరిగింది మాత్రం వేరు. 

ఏ మాత్రం ప్రభావం చూపని విశాఖ రాజధాని వాదన !

ఉత్తరాంధ్రపై ఈ సారి వైఎస్ఆర్‌సీపీ చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దానికి కారణం తాము రాజధానిని విశాఖ తీసుకు వస్తున్నామని అక్కడి ప్రజలు తమకు బ్రహ్మరథం పడతారని అనుకోవడమే. అలా అని ఊరుకోలేదు. ఆరు నెలల ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. ఓట్ల నమోదు దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంది. చివరికి  ప్రచారంలోనూ మంత్రులు అంతా తామై వ్యవహరించారు. మంత్రి ధర్మాన ఎక్కడ పట్టభద్రుల ఎన్నికల మీటింగ్  పెట్టినా... వైఎస్ఆర్‌సీపీకి ఓటేయకపోతే విశాఖ రాజధాని డిమాండ్‌ను బలహీనపర్చడమేనని సెంటిమెంట్ వాడే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టభద్రులైన ఓటర్లు మాత్రం పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావుకే భారీ మెజార్టీ ఇచ్చారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొదట  గాడు చిన్నికుమారి అనే నేతను అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఆమె బలహీన అభ్యర్థి అని నిర్ణయించుకుని ఫిబ్రవరిలోనే అభ్యర్థిగా ఎకానమీ చిరంజీవిగా ఎంతో మంది గ్రాడ్యూయేట్లకు పరిచయమున్న వేపాడ చిరంజీవి రావును అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయన ఇతర టీడీపీ నేతల కృషితో విస్తృతంగా పర్యటించారు. మంచి  ఫలితం సాధించారు. వైఎస్ఆర్‌సీపీ గెలుపొందడటానికి చేయని ప్రయత్నాలు లేవు. వెండి బిస్కెట్లు పంచారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక విజయసాయిరెడ్డి నుంచి ఉత్తరాంధ్ర బాద్యతలు తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఓడిపోతే రాజధాని వాదన బలహీనపడుతుందన్న అభిప్రాయంతో చేయాల్సినంత చేశారు. కానీ.. ఫలితం ఏ మాత్రం అనుకూలంగా రాలే్దు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఈ అంశంపై సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. అమరావతిని కాదని అక్కడ వ్యతిరేకత మూట గట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విశాఖలో కూడా సానుకూలత లేకపోతే  రెంటికి చెడ్డ రేవడి అయిపోతుంది పరిస్థితి. వైఎస్ఆర్‌సీపీ తన  ఉత్తరాంధ్ర రాజకీయ వ్యూహంలో మార్పులు  చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక తెచ్చి పెట్టిందనుకోవచ్చు. 

తూర్పు రాయలసీమలోనూ  గడ్డు పరిస్థితికి కారణం ఏమిటి ?

ఒక్క ఉత్తరాంధ్రలోనే  కాదు తూర్పు రాయలసీమలోనూ  వైఎస్ఆర్‌సీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పరిధిలోని గ్రాడ్యూయేట్ ఓటర్లు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు మద్దతుగా నిలిచారు.  నిజానికి నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ కంచుకోట. చిత్తూరులో అయితే పెద్దిరెడ్డి లాంటి నేత ఉన్నారు. ఆయన ఏ ఎన్నిక జరిగినా పట్టు బిగిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ మెజార్టీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలే. పైగా మూడు రాజధానుల పేరుతో తిరుపితలోనూ గర్జన నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పలేదు. రాజధానిగా విశాఖ వాదనకు.. తూర్పురాయలసీమ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. అమరావతి అయితే సమీపంలోనే ఉంటుందని.. విశాఖ అయితే ఎలా ఉన్న అభిప్రాయం సామాన్య జనాల్లో ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రకాశం , నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. వెలిగొండ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టిన జగన్ ప్రభుత్వం తాము వచ్చాక జరుగుతున్న పనుల్ని నిలిపివేసి.. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇతరులకు పనులు ఇచ్చారు కానీ అసలు ముందుకు సాగలేదు. ఇలాంటివి మూడు జిల్లాల్లో ఉన్నాయి. అదే సమయంలో నిరుద్యోగ సమస్య కూడా యువతను ఆలోచింప చేసినట్లుగా అనుకోవచ్చు. అందుకే.. గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా పేరున్న  జిల్లాల్లోనూ వైఎస్ఆర్‌సీపీకి ఎదురు గాలి వీచిందని నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ సమస్యలపై సమీక్ష చేసి.. పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన  పరిస్థితుల్ని గ్రాడ్యూయేట్లు తమ ఓటింగ్ ద్వారా గుర్తు చేశారని అనుకోవచ్చు. 

కుంచుకోట పశ్చిమ రాయలసీమలో ఇంత ప్రతిఘటనా ?

పశ్చిమరాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉన్న  జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం. ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ పట్టు గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు జిల్లాలకు కలిపి టీడీపీకి ఉన్నది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా అనంతపురం జిల్లా నుంచే ఉన్నారు. అంటే ఏకపక్షంగా పట్టభద్రులు ఓటింగ్ చేయాల్సిన నియోజకవర్గం. కానీ హోరాహోరీ పోరు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టి పోటీ చేస్తున్నారు. అన్ని రౌండ్లలోనూ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థికి మెజార్టీ వచ్చినప్పటికి అది డబుల్ డిజిట్స్ లోనే ఉంటుంది. అందుకే ఓవరాల్ మెజార్టీ రెండు వేలకు దాటడం లేదు. పీడీఎఫ్ అభ్యర్థులతో టీడీపీ  వచ్చిన అవగాహన మేరకు ద్వితీయ ప్రాధాన్య ఓట్లు.. టీడీపీ అభ్యర్థికి వేసిఉంటే.. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ షాక్ తినొచ్చు. అదే జరిగితే.. వైఎస్ఆర్‌సీపీ కంచుకోట కూలినట్లవుతుంది. అది వైఎస్ఆర్‌సీపీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. 

లోపాలను సమీక్షించుకుని మార్పు చేసుకుంటారా ? 

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తాము ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నామన్న ఓ రకమైన అభిప్రాయంలో ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని తాజా ఎమ్మెల్సీ పరిణామాలతో అర్థమైపోతుంది. ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు కాబట్టి.. అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని అనుకోవచ్చు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంటుందా అన్నది ఆసక్తికర అంశం.  ప్రత్యర్థులపై రాజకీయ దాడులు ఆపి ప్రజలకు అత్యధిక సమయం కేటాయించాలన్న విశ్లేషణ ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తే..  అది వారికి బలం ఇస్తుంది. కానీ టార్గెట్ చేసిన వారికి మైనస్ అవుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేని సమయంలో..  ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సమీక్షించుకుని.. లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం అధికార పార్టీపై పడిందని అనుకోవచ్చు. 

Published at : 17 Mar 2023 05:21 PM (IST) Tags: YSRCP AP Politics CM Jagan Chandrababu TDP

సంబంధిత కథనాలు

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు-  మంత్రి కేటీఆర్

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

కర్ణాటక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారా, జనసేనాని నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

కర్ణాటక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారా, జనసేనాని నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

Only KTR : పాలనా వైఫల్యాలకు కేటీఆర్ ఒక్కరే బాధ్యులా ? ఎందుకిలా జరుగుతోంది ?

Only KTR : పాలనా వైఫల్యాలకు కేటీఆర్ ఒక్కరే బాధ్యులా ? ఎందుకిలా జరుగుతోంది ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెబుతున్నాయి?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెబుతున్నాయి?

టాప్ స్టోరీస్

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ