Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనకు ఆయన బయలుదేరుతున్నారు. టెకెట్లు ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించనున్నారు.
Telangan CM Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం అనుమతి తీసుకునేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుండగా, ఇందులో పాల్గొనేందుకు ఆయన వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైనా చర్చించే అవకాశముందని చెబుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని రేవంత్‌రెడ్డి విస్తరించలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక తదితర విషయాలపై చర్చిస్తారని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వంశీ చంద్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ తదితర నేతలు కూడా హాజరుకానున్నారు.
మంత్రివర్గాన్ని విస్తరిస్తే తనకు అత్యంత ఆప్తులైన కొందరికి అవకాశాన్ని కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో కొందరికీ సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇద్దరు, ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందితే.. తదుపరి ప్రక్రియను పూర్తి చేసేందుకు రేవంత్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు.