Brother Anil: ఏపీలో కొత్త పార్టీకి రంగం సిద్ధం.. త్వరలోనే దిల్లీలో బ్రదర్ అనిల్ ప్రకటన!
జగన్‌తో విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పిన బ్రదర్ అనిల్ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులతో మాట్లాడిన ఆయన త్వరలోనే అన్నింటిపై క్లారిటీ వస్తుందని చెప్పారు.
సీఎం జగన్‌కు స్వయానా బావ అయిన బ్రదర్ అనిల్ విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్త పార్టీ పెట్టాలని బీసీ, క్రిస్టియన్, ఎస్సీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయంటూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందనడం కూడా ఆయన భవిష్యత్ వ్యూహం చెప్పకనే చెబుతోంది. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిసినప్పుడో లేక విజయవాడలో సమావేశాలు జరిపినప్పుడో మాట్లాడడానికి ఇష్టపడని అనిల్ విశాఖలో మాత్రం స్వయంగా మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చారు. బీసీ వ్యక్తిని సీఎంగా చెయ్యాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు.
జగన్‌ను కలిసి రెండున్నరేళ్లు అయింది
సీఎం జగన్ ను కలిసి రెండున్నరేళ్లు అయింది అంటున్న బ్రదర్ అనిల్ వైఎస్ కుటుంబంలోని విభేదాల చెప్పారు. ఏపీలో రాజకీయంగా బీసీలతోనూ, ఎస్సీ, క్రిస్టియన్‌లతో కలసిన తృతీయ శక్తి అవసరం ఉందన్నారు. అయితే షర్మిల పార్టీని ఏపీలో విస్తరిస్తారా లేక కొత్త పార్టీ పెడతారా అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తనకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశ్యం లేదని కూడా అన్నారు అనిల్. ఇక వివేకానంద హత్య కేసులో మాత్రం న్యాయం జరుగుతుంది దోషులకు శిక్ష పడితీరుతుంది అంటూ బాంబు పేల్చారు .
దిల్లీలో క్రొత్త పార్టీ ప్రకటన ?
బ్రదర్ అనిల్ విశాఖలో జరిపిన అంతర్గత సమావేశంలో త్వరలో పార్టీ ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని బీసీ, క్రిస్టియన్, ఎస్సీ వర్గ నాయకులకు, ప్రతినిధులకు చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే దిల్లీ వేదికగా కీలక ప్రకటన కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. మరొక్క సమావేశం తరువాత దీనిపై బ్రదర్ అనిల్ స్వయంగా ప్రకటన చేస్తారని కూడా తెలుస్తోంది. అది కూడా ఈ నెలాఖరు లోపులో .. లేదంటే వచ్చేనెల మొదటి వరం లో ఉంటుందని అన్నారు ఆయన సన్నిహితులు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చేందుకేనా ?
బ్రదర్ అనిల్ వరుస సమావేశాలపైనా అనుమానాలు వ్యక్తం చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇంత హడావుడిగా వివిధ ప్రాంతాల్లో మీటింగ్స్ పెడుతూ రాజకీయ రంగ ప్రవేశంపై బ్రదర్ అనిల్ చేస్తున్న హంగామా దేనికని ప్రశ్నిస్తున్నారు. కేవలం సీఎం జగన్‌పై వస్తున్న వ్యతిరేకత చీల్చడానికి అన్న అభిప్రాయమూ లేకపోలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పైస్థాయిలో జరుగుతున్న వ్యవహారంగా దీన్ని చూస్తున్నారు కొందరు విశ్లేషకులు. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. ఏదేమైనా ఏపీలో రాజకీయ రంగ ప్రవేశం వైపు బ్రదర్ అనిల్ అడుగులు వేగంగా పడుతున్నాయని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.