Pawan Kalyan: సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
AP Deputy CM Pawan: కల్తీ లడ్డు వివాదంపై అనూహ్యంగా పోరాట గళాన్ని ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎంగా ఉంటూ చేసిన కామెంట్స్ వెనుక పెద్ద వ్యూహం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
Janasena Chief Pawan Kalyan: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు అవమానం అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఘోర అపచారం జరిగిందంటూ ఆయన ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన విజయవాడ దుర్గ గుడిలో శుద్ధి కార్యక్రమాన్ని సైతం స్వయంగా చేపట్టారు.
తిరుమల కల్తీ లడ్డు ఎవరు తేలికగా మాట్లాడినా అస్సలు సహించడం లేదు పవన్. వారు తనకు ఎంతటి దగ్గరి వారైనా, ఎంత మంచి మిత్రులైనా సరే ధర్మం ఫస్ట్ అంటున్నారు. తనంటే ఎంతో అభిమానం చూపించే తమిళ హీరో కార్తీ, చిరకాల మిత్రుడు ప్రకాష్ రాజ్‌పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. అంతేకాదు కేంద్రస్థాయిలో సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేసి హైందవ ధర్మ పరిరక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు జనసేనాని. ఇదంతా సనాతన ధర్మంపై పవన్‌కున్న అభిమానం ఆసక్తి అని ఆయన అభిమానులు, హిందూత్వ పెద్దలు అంటూ మద్దతు పలుకుతుంటే, జాతీయ స్థాయిలో ఎనలిస్టులు, రాజకీయవేత్తలు మాత్రం దక్షిణ భారత రాజకీయాల్లో హిందూత్వ ముఖచిత్రంగా పవన్ మారే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
సౌత్ ఇండియాలో కుదరని హిందూత్వ రాజకీయాలు
మొదటి నుంచి దక్షిణ భారతంలో స్థానిక అంశాలు, అభివృద్ధి, ప్రాంతీయ పార్టీలు, కులపరమైన అజెండాలు, ఉద్యోగ అవకాశాల ప్రాతిపదికన మాత్రమే రాజకీయాలు కొనసాగుతూ వస్తున్నాయి. ధర్మం, మతం ఆధారంగా జరిగే పాలిటిక్స్ సౌత్ ఇండియాలో పెద్దగా కనపడవు. ఉన్న వాటిలో తెలంగాణలో మాత్రం ఇటీవల బిజెపి కొంత పురోగతి సాధించింది. అయినప్పటికీ అక్కడ కూడా అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలకే తొలి ప్రాధాన్యత. ఏపీలో అయితే విభజన తర్వాత ప్రత్యేక ఉనికి కోసం పోరాడడం, రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడడం ఇవే ప్రధానమైన అంశాలు. కులాల వారీగా విడిపోయిన జనాలు, పార్టీలు వాటి ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నాయి.
తమిళనాడులో ద్రవిడ ఉద్యమ ఆధారిత రాజకీయాలు ఇంకా బలంగానే ఉన్నాయి. జయలలిత అనంతరం అన్నాడీఎంకే స్థానంలో తాము బలపడదామనుకున్న బిజెపి వ్యూహాలు విజయవంతం కాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై ప్రయోగం వర్కౌట్ కాలేదు. అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడదాం అనుకుంటే అక్కడి సినీ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దానితో అక్కడ స్థానిక అంశాలే రాజకీయాల్లో ముఖ్యమైన ఎజెండాగా మారిపోతున్నాయి.
కేరళ మొదటి నుంచి మతపరమైన రాజకీయాలకు దూరమే. కొంతకాలం క్రితం దక్షణాదిన బిజెపి దాని మిత్రపక్షాలకు ఎంట్రీగా కర్ణాటక కనబడింది. కానీ అక్కడ కూడా డెవలప్మెంట్ మెయిన్ ఎజెండా కాగా లోకల్ బిజెపిలోని వర్గ పోరాటాలు పార్టీని అధికారానికి దూరం చేశాయి. వీటన్నిటి కన్నా లీడర్ బేస్డ్ పాలిటిక్స్‌కు అలవాటు పడిన సౌత్ ఇండియాలో హిందుత్వ రాజకీయాలకు ఒక పాపులర్ ఫేస్ కావాల్సిన అవసరం ఉందని బిజెపి దాని మిత్రపక్షాలు ఎప్పటి నుంచో భావిస్తున్నాయి. ప్రస్తుతం బిజెపికి అత్యంత ఆప్తుడైన పవన్ కల్యాణ్ ఆ లోటు పూరించే దిశగా కనిపిస్తున్నారనేది జాతీయస్థాయి రాజకీయాల్లో వినిపిస్తున్న మాట.
దేశం మొత్తం వ్యాపించిన సెంటిమెంట్.. తిరుపతి
తిరుమల అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పుణ్యక్షేత్రం కాదు. దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే హిందువులకు అదొక ఎమోషన్. వెంకటేశ్వరునిగా స్వామివారు దక్షిణాదిన ఎంతటి ఫేమస్సో, బాలాజీగా నార్త్ ఇండియాలోనూ అంతే పాపులర్. అలాంటి స్వామివారి ప్రసాదమైన లడ్డూను జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడి తయారు చేశారు అనే వార్తలు భక్తులను బాధించాయి. దీనిపై స్టాండ్ తీసుకున్న పవన్ ప్రస్తుతం ఏం మాట్లాడినా దాని ప్రభావం చాలా దూరం వెళుతోంది. మామూలుగానే పవన్‌కి ఉండే రీచ్ చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడంతో సామాన్య హిందువుల నుంచి కరడుగట్టిన హిందుత్వవాదుల వరకు పవన్ హాట్ టాపిక్ అయ్యారు. ఇది రానున్న రోజుల్లో రాజకీయంగా బిజెపి ఆశయాలకు, ఆశలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడేదే అని విశ్లేషణలు వినవస్తున్నాయి.
కార్తీ, ప్రకాష్ రాజ్ లపై వ్యాఖ్యలు అందుకేనా?
నిజానికి పవన్ అంటే తమిళ హీరో కార్తీ చాలా అభిమానిస్తారు. అలాంటిది ఒక సినీ ఫంక్షన్‌లో యథాలాపంగా"లడ్డు అంశం ప్రస్తుతం చాలా సున్నితంగా" మారిందంటూ అన్న వ్యాఖ్యలను పవన్ తప్పు పట్టారు. దానిపై కార్తీ క్షమాపణ కోరుతూ ట్వీట్ చేయడం పవన్ కూడా దానిని స్వాగతిస్తూనే ఆయన సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగిపోయాయి.
ఉపముఖ్యమంత్రిగా అన్నీ అధికారాలు పవన్ చేతిలో ఉంటాయి కాబట్టి కల్తీ లడ్డు వ్యవహారంలో శిక్షించాలనే గాని ఈ ప్రాయశ్చిత్త దీక్షలు ఏంటి అంటూ విమర్శించిన ప్రకాష్ రాజ్‌పై కూడా జనసేనాని తీవ్రంగా విమర్శించారు. సెక్యులర్ ఫీలింగ్ అనేది అన్ని మతాలపై ఒకేలా ఉండాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి కూడా మరొక రిప్లై ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్. బద్రి సినిమా నుంచి ప్రకాష్ రాజ్, పవన్ మధ్య ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవం ఉన్నాయి. అయినప్పటికీ సనాతన ధర్మం విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని పవన్ గట్టిగా చెప్పారు. ఇది కూడా ఒక వ్యూహం గానే చూస్తున్నారు రాజకీయవేత్తలు.
కార్తీపై కామెంట్స్ ద్వారా తమిళనాడులో ఒక్కసారిగా వైరల్‌గా మారారు జనసేనాని. గత మూడేళ్లుగా అన్నామలై తదితర దూకుడు గల హిందుత్వ నేతల ఆధ్వర్యంలో హిందుత్వవాదులు ఇప్పుడు పవన్ వైపు చూడడం మొదలుపెట్టారు అన్న వార్తలు వినవస్తున్నాయి. కర్ణాటకలో మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి, తెలుగు హీరోలకు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. కన్నడ, తెలుగు మధ్య భాషా పరంగానూ సారూప్యత బాగుంటుంది. పైగా బీజేపీ దాని మిత్రపక్షాలు కొన్నేళ్లు అధికారంలో కూడా ఉన్నాయి. వారికి పవన్ సరికొత్త స్టాండ్ కూడా తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే.
కేరళలోను తెలుగు హీరోల ప్రభావం పెరుగుతోంది. అటు కేరళ స్టార్స్ కూడా డైరెక్ట్ తెలుగు సినిమాల్లో హీరోలుగా నటించే స్థాయికి రెండు రాష్ట్రాల మధ్య అనుబంధం పెరిగింది. పవన్ భావాలపరంగా కేరళ రాజకీయాలతో దూరం ఉన్నప్పటికీ సినీ స్టార్‌గా, ఓటమికి బెదరని వ్యక్తిగా, నిజాయితీపరుడుగా ఒక ఇమేజ్ అయితే ఉన్నమాట వాస్తవం. నటుడిగా ప్రకాష్ రాజ్ సౌత్ ఇండియాలో తిరుగులేని ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆయనపై ఘాటు విమర్శల ద్వారా పాజిటివ్ గానో నెగిటివ్ గానో ఆయా రాష్ట్రాల్లో పవన్ మరోసారి వైరల్ అయ్యారు.
ఇలా ఏదో ఒక రకంగా సౌత్ ఇండియా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు సడన్ గా పాపులర్ అయిపోయింది. అంతేకాక హిందూత్వ రాజకీయాలకు ఒక భవిష్యత్తు ముఖచిత్రంగా ఆయన కనిపిస్తున్నారు. ఇది బిజెపి ఎత్తుగడా లేకా వ్యూహమా అన్నది పక్కన పెడితే భవిష్యత్ దక్షిణాది రాజకీయాల్లో పవన్ పాత్ర చాలా కీలకమైన మలుపు తీసుకోబోతున్నదన్న సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.