BJP Vishnu ON Commitment Movie : భగవద్గీత శ్లోకంతో సినిమాలో అశ్లీల దృశ్యాల చిత్రీకరణ - తక్షణం తొలగించాలని విష్ణువర్ధన్ డిమాండ్ !
కమిట్ మెంట్ సినిమాలో భగవద్గీత శ్లోకాలను కించపర్చడంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణం ఆ దృశ్యాలను .. ట్రైలర్, సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
BJP Vishnu ON Commitment Movie : కమిట్‌మెంట్ పేరుతో రిలీజ్‌కు సిద్ధమైన ఓ సినిమాలో ట్రైలర్ చివర్లో 'మురికి చేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది' అంటూ భగవద్గీతలో ప్రవచనం చెప్పారు. ఈ ప్రవచనం చెబుతున్నప్పుడు కొన్ని అశ్లీల సన్నివేశాలను చూపించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండటంతో వివాదాస్పదమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు చిత్ర దర్శకనిర్మాతలు, నటీనటులపై విరుచుకుపడుతున్నారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ సినిమా ట్రైలర్ అంశంపై స్పందించారు.
పెద్ద ఎత్తున అశ్లీల దృశ్యాలను చూపిస్తూ ట్రైలర్ విడుదల చేయటం పట్ల తీవ్రమైన నిరసనను వ్యక్తం చేస్తున్నానని సోషల్ మీడియాలో తెలిపారు. వీటిని పక్కన పెడితే అశ్లీల దృశ్యాలతో కూడిన 'కమిట్ మెంట్' అనే సినిమాను తీసి, అందులో భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తూ భగవద్గీత శ్లోకం తెలియజేసే సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా చూపించిన... అశ్లీల దృశ్యాలను ట్రైలర్ నుండి, సినిమా నుండి కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలుసుకోవలసిన అవసరం ప్రజలకు లేదు, అలా అని ఒకవేళ అక్కడ ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రజలెవరూ కూడా సమర్థించరు. (1/3)
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 28, 2022
Commitment Telugu Movie: అశ్లీల సీన్లతో భగవద్గీత, 'కమిట్‌మెంట్' ట్రైలర్‌పై నెటిజన్స్ గుర్రు! https://t.co/4CO1v1KOQc
తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి లాంటి తారలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కమిట్‌మెంట్'. ఈ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. కానీ కరోనా, ఇతర కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, పోస్టర్లు అప్పట్లో వివాదం సృష్టించాయి. . తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం లిప్ లాక్స్, రొమాన్స్, బూతు డైలాగ్స్ తో నింపేశారు. అక్కడితో ఆగకుండా వివాదం కోసమే అన్నట్లుగా భగవద్గీత శ్లోకాన్ని వాడారు.
కొద్ది రోజుల కిందట సింగర్ శ్రావణ భార్గవి కూడా ఇదే తరహాలో అన్నమయ్య కీర్తను శృంగారరసాత్మకంగా పాడి వివాదాస్పదమయ్యారు. చివరికి ఆ పాటను తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు కమిట్ మెంట్ సినిమా కొత్తగా వివాదంలోకి వచ్చింది. పబ్లిసిటీ కోసం చిత్ర నిర్మాతలు... ఇలా హిందువుల మనోభావాలను కించ పర్చే ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.