AP Assembly Sessions 2023: సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు-కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ మూడో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల మూడోవారంలో అసెంబ్లీని సమావేశాలు నిర్వహించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వినాయకచవిత తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను 10 రోజుల నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని భావింస్తోంది అధికార పార్టీ. మరోవైపు, వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు.
సెప్టెంబరు రెండోవారంలో సమావేశాలను నిర్వహించాలని ముందుగా భావించారు. కానీ సీఎం జగన్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో సమావేశాలు సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు నిర్వహించాలని అధికార పార్టీ భావించింది... కానీ, ఆ సమావేశాలను వారం నుంచి 10 రోజులకు పొడిగించాలా? లేదా తగ్గించడమా? అనేది ఏపీ ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించనుంది. ఈ భేటీకి మందే ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 15న సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో.. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని వైసీపీ వర్గాలు చెప్తున్నారు. దీంతో మూడు రాజధానుల బిల్లుపై ఆలస్యం తగదని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే.. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఇక, అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీడీపీ వైఖరి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన తెలుగు దేశం పార్టీ... ఈ సమావేశాలను కూడా బహిష్కరిస్తుందా అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నిలకల హీట్ కొనసాగుతున్న సమయంలో ఈ సమావేశాలు టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందా? ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. మూడు రాజధానుల బిల్లు కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉండంతో.... టీడీపీ అమరావతిపై గట్టిగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.
ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే సభలో లేవనెత్తే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో నకిలీ ఓట్ల అంశంపై కూడా రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు... రణరంగాన్ని తలపిస్తాయన్న వాదన కూడా వినిపిస్తోంది.