Srikakulam MLC : శ్రీకాకుళం ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి - వైఎస్ఆర్‌సీపీకి టెన్షన్ !
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. దీంతో ఏకగ్రీవం కోసం వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Srikakulam MLC : శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థలలో సంపూర్ణ బలం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమ య్యే పరిస్థితి కనిపిస్తొంది. నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో వైఎస్ఆర్‌సీపీ తరపున నామినేషన్ వేసిన నర్తు రామారావుతో పాటు స్వతంత్ర అభ్యర్ధి గా ఆనెపు రామకృష్ణ పత్రాల పరిశీలను పూర్తయిపో యింది. ఇద్దరి నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల విత్ డ్రా కోసం ఈ నెల 27 వరకు గడువు ఉంది. ఆ గడువులోగా స్వతంత్ర అభ్యర్థి అయిన అవెపు రామకృష్ణతో నామినేషన్ ఉపసంహరింప చేసేందుకు తెరవెనుక ముమ్మరంగా యత్నాలు జరుగుతున్నాయి. తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతల మద్దతుతో రామకృష్ణ ప్రధానంగా నామినేషన్ ను వేశారు. అటు అధికార వైఎస్ఆర్‌సీపీ ఇటు టిడిపి నేతలు తనకి అండగా నిలుస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుని తూర్పు కాపులకి వైఎస్ఆర్‌సీపీ అన్యాయం చేసిందని వారు కుండబద్దలు గొట్టి చెబుతూ ఎన్నికలలో పోటీకి దిగారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీలో కీలక స్థానంలో ఉన్న వారు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన రామకృష్ణకు మద్దతుగా నిలిచిన వారిపై కూడా ఒత్తిళ్ళు చేస్తున్నారు. గతంలో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజు బరిలో నిలవగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వైకాపా నేత మామిడి శ్రీకాంత్ పోటీ కోసం నామినేషన్ దాఖలు చేసారు. అయితే చివరి నిమిషంలో ఆయన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి సంపూర్ణ బలం ఉన్నందున ఏకగ్రీవంగానే ఎన్నిక జరుగుతుందని ఆ పార్టీ నాయకులంతా అనుకున్నారు.
ఒత్తిళ్ళు ఎదురవుతున్నా బరిలో నిలవడం ఖాయమని స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్న తూర్పు కాపు సంక్షే మ సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో రాజకీయంగా తూర్పు కాపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఆ సామాజిక వర్గ నేతలుఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైకాపా తూర్పు కాపు నేతలకి అవకాశం ఇస్తుందని వారు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలను పటాపంచలు చేస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావుకి టిక్కెట్ ఇవ్వడంతో వారు తీవ్ర నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. తమతో పాటు మెజార్టీ జనాభా కలిగిన ఇతర సామాజిక వర్గాలను పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని వారు మండిపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొత్తం 776మంది ఉన్నారు. వారిలో ఎంపిటిసిలు 653మంది, జడ్పిటిసీలు 38 మంది, కౌన్సిలర్లు 74 మంది, ఎక్స్ ఆఫీషియో సభ్యులు 11 మంది వరకూ ఉన్నారు. వీటిలో 120 మంది ఓటర్లు టిడిపి వారు ఉండగా 20 మంది వరకూ స్వతంత్రులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడావైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే . అందుకే గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. అయితే ఏకగ్రీవం కావాలని ప్రయత్నిస్తున్నారు.